అదీ జీవితం! సుఖ సంతోషాలకే తప్ప చీకూచింతలకు ఆస్కారంలేని నిండు బ్రతుకులు.
"మా కలెక్టరుగారు ఊళ్ళో లేనప్పుడు నేనిలాగే సింపుల్ గా వుంటాను. ఎంత గొప్పవాళ్ళింటి ఫంక్షన్ కు వెళ్ళినా ఇలాగే వెళ్తాను. ఇది నా పుట్టింటి పెంపకంలోనే వుంది. మా నాన్నగారు నిజాం ప్రభుత్వంలో చాలా పెద్ద ఆఫీసరుగా పని చేశారు."
జానకి ఆమె మాటలకు ముగ్దురాలైంది.
మళ్ళీ ఏదో అడగబోయింది. అంతలో ఆవిడే బేగంపేటలో లాల్ బంగళా దగ్గిర ఎడంచేతి వైపుగా వున్న బంగళా మాదే. కొత్తగా కట్టిన బంగళా. ఇట్టే తెలుసుకోవచ్చు. బస్ స్టాప్ లో పరిచయమేకదా అని తోసి వెయ్యకండి. వీలు చూసుకొని ఒకసారి మా ఇంటికి రండి." ఎంతో ఆప్యాయంగా ఉర్దూలో చెప్పింది.
"వస్తాను లెండి!" మర్యాద కొరకు అన్నట్టు అన్నది జానకి.
"తప్పక రావాలి. మిస్టర్ సులేమాన్ ఖాన్ ఇల్లని చెబితే ఎవరైనా చెబుతారు.
జానకికి ఒక ఆలోచన వచ్చింది.
డిప్యూటీ కలెక్టర్ భార్యతో పరిచయం. వాళ్ళింటికి రాకపోకలు ఎంత మంచి అవకాశం! ఆమె భర్తకు చెప్పి తనకు ఓ చిన్న ఉద్యోగం ఇప్పించలేక పోతుందా!
జానకి జరీనాకు మరికొంచెం దగ్గిరగా వచ్చి నిలబడింది. తన పరిస్థితి అంతా జంకుతూనే చెప్పింది.
ఆమె ఎంతో శ్రద్ధగా సానుభూతిగా విన్నది.
"మరీ అంత దిగులు పడిపోకండి. మా కలెక్టర్ గారికి చెబితే నెల తిరక్కుండా మీకు ఉద్యోగం ఇప్పిస్తారు. ఆయన నా మాట కాదనరు. హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎంతోమంది మా వారికి తెలుసు." అన్నది ఎంతో ఆదరంగా.
జానకికి ఆమె మాటలతో, ఎవరో చెయ్యి ఆసరా వచ్చి నెత్తిమీద మోయలేని బరువు దింపినట్టూ, కన్ను పొడుచుకున్నా కనిపించని కారు చీకట్లో అనుకోకుండా ఎవరోవచ్చి టార్చిలైటు వేసి మార్గం చూపించినట్టూ అనిపించింది.
అప్పటికప్పుడే ఉద్యోగం దొరికినట్టు ఆనందపడి పోయింది.
"మీ సహాయం మర్చిపోనండీ ఎల్లుండి ఉదయం మీ ఇంటికి వస్తాను." అన్నది ఉత్సాహంగా.
"ఎల్లుండా? ఏ వారం? ఆదివారం కదూ? ఆ రోజు మావారు కూడా వస్తారు. మిమ్మల్ని పరిచయం చేస్తాను. తప్పక రండి." అన్నది జరీనా.
బస్ వచ్చింది.
ఖాళీగానే వుంది.
ఇద్దరూ బస్ ఎక్కి పక్క పక్కనే కూర్చున్నారు.
జరీనా ఏదో ఏదో చెబుతూనే వుంది. జానకి చాలా శ్రద్ధగా, వినయంగా వింటున్నట్టు తల ఊపుతూ కూర్చున్నది. ఊహలు మాత్రం కొత్త ఉద్యోగం చుట్టూనే తిరుగుతున్నాయి.
కండక్టర్ టికెట్ అడిగాడు.
పాస్ వుందని చెప్పింది జానకి.
జరీనాకేసి చెయ్యి చాపాడు.
ఆమె బ్యాగ్ జిప్ లాగి లోపలకు చెయ్యి దూర్చింది. ఎంతకూ చెయ్యి బయటికి రాకపోవడంతో కండక్టర్ విసుక్కున్నాడు.
వెంటనే పర్సు తెరిచి టికెట్ తీసుకుంది జానకి.
"అయ్యో మీరెందుకు కొన్నారు? వెధవ బ్యాగ్. ఇంత పెద్ద బ్యాగ్స్ తో ఇదే బాధ" అన్నది జరీనా జానకి టికెట్ కొన్నందుకు నొచ్చుకుంటూ.
అదంతా నటన అనిపించింది జానకికి. చాలామంది డబ్బున్న వాళ్ళు పిసినిగొట్టులుగా వుండటం ఆమెకు తెలుసు. బహుశా ఈమెకూడా ఆ కోవకు చెందిందేనేమో అనుకుంది.
బస్ అమీర్ పేట మలుపు తిరిగి శీశ్ మహల్ దాటింది. జరీనా కిటికీనుంచి చెయ్యి చూపుతూ "అదుగో, ఆ కన్పించేదే మా బంగళా" అంది.
ఆ చీకట్లో ఆమె ఏ బంగళాకేసి చూపిస్తున్నదో జానకికి అర్థంకాలేదు."
