Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 34


    "ఏమయ్యా అహోబిలం! నా గురించి అలా అని చెప్పావా?" ఇన్ స్పెక్టర్ అడిగాడు.


    అకస్మాత్తుగా నేనా మాటలు అనటం, ఇన్ స్పెక్టర్ గాడు అడగటం దాంతో అహోబిలం కంగారుపడిపోయాడు.


    "ఎబ్బే! నేనెక్కడ చెప్పాను? చెప్పలేడు సార్?" అని అంతలోనే సర్దుకుని "చెప్పాను సార్! ఎందుకనో మీ గొప్పతనం గుర్తుకు వచ్చింది. గబుక్కున నోరు జారి చెప్పేశాను. పొరపాటయింది సార్! ఇంకెపుడూ చెప్పను సార్!" నా మీద కోపంగా ఒక చూపు విసిరి అన్నాడు అహోబిలం.


    "ఏమిటీ? ఇంకెప్పుడూ చెప్పవా? చెప్పాలయ్యా! చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? నేరస్తులు మన గురించి భయభక్తులతో వణికి చావాలంటే మనము ఎలాంటి వాళ్ళమో కూడా తెలిసి వుండాలి. ఇప్పటికే పదిమందికి నా విషయం తెలుసనుకో! అయినా కూడా చెప్పటంలో తప్పేముంది? మంచిపనే చేశావ్! ఇకముందు కూడా అలాగే చేస్తూండు. ఓటి గుర్తుంచుకో! మంచి మాటలు చెప్పటానికి, మంచి పనులు చేయటానికి ఎప్పుడూ జంకకూడదు..."


    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు చెప్పుకుపోతూంటే అహోబిలం తన తాటికాయంత తలకాయినీ పైకి క్రిందికీ ఆడిస్తూ "అలాగే సార్! ఎస్ సార్. ఓ.కే. సార్!" అంటూ కంగారుపడిపోయి నత్తినత్తిగా పలికాడు.


    పైకి ఉబికి వస్తూన్న నవ్వును బలవంతానా ఆపుకున్నాను.


    నావేపు ఒకసారి గుర్రున చూసి మళ్ళీ అంతలోనే తగ్గిపోయాడు అహోబిలం. ఓ వెధవ నవ్వొకటి నవ్వి వూరుకున్నాడు. నేనేం చెపుతానో అని ముందు దడిశాడు. అందువల్లనే కంగారులో మొదట తబ్బిబ్బు అయిపోయాడు. తన నెత్తిన వేస్తున్నది అక్షింతలు కావని, పొగడ్త పూలని గ్రహించిన మరుక్షణం పాపం అహోబిలం తగ్గక తప్పలేదు. నాతో పెట్టుకుంటే డేంజర్ అనుకున్నాడో ఏమో, నా వేపు రవ్వంత కృతజ్ఞతగా చూశాడు చివరికి.


    "ఏమిటి? నన్నే మీరిద్దరూ కలిసి మోసం చేద్దామనుకుంటున్నారా? తెలిసి తెలిసి నిప్పులో వేలు పెడతారా? నేను అసలే నిప్పులాంటివాడిని అని తెలిసి కూడా అబద్ధాలు, నాటకాలు... ఆ!... ఆ! అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి? మర్యాదగా బ్రతకాలని లేదా? ఈ జైలు గోడల మధ్య నుండీ బ్రతికి బయటపడాలని లేదా?" నన్ను తీక్షణంగా చూస్తూ అడిగాడు.


    "మళ్ళీ ఈయనగారికి పిచ్చన్నా పుట్టివుంటుంది. లేక ఏదన్నా వార్తయినా అంది వుంటుంది." అనుకుంటూ,


    "ఏమయింది సార్! మేమేమన్నా కానిపని చేశామా? ఈ జైలులో మీ ఉప్పు, పులుసూ కూడు తింటున్నవాడిని. చెప్పండి సార్! లేకపోతే అడగండి సార్!" చాలా వినయంగా అన్నాను.


    "కోటీ యాభై లక్షల రహస్యం మీకు తెలుసట గదయ్యా! నాకోడు ఫోన్ చేసి చెప్పాడు. పారిపోయిన బాస్ గాడు మిమ్మల్ని అందుకే బంధించాడట కదా! అప్పటికీ వజ్రాల సంగతి మీకేమీ తెలియదని ఫోన్ లో వాడితో నేను వాదించాను. అవతల ముండావాడు చాలా గట్టివాడులే. ఏవేవో వివరాలు ఇచ్చి మిమ్మల్ని నాలుగు వుతికితే నిజం చెబుతారని, నాకు ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఊ... ఇప్పుడు చెప్పండి, కోటీ యాభై లక్షలు ఎక్కడ దాచారు?" నా కళ్ళలోకి గుచ్చిచూస్తూ అడిగాడు వర్ధనరావు.


    అర క్షణంలో విషయం నాకు అర్థమైపోయింది. ఇది బాస్ గాడి పనే. మేము జైలునుండి బయటపడటం ఇష్టంలేక ఉపాయంగా ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి ఫోన్ చేసి వుంటాడు. ఈ మహానుభావుడేమో అది పట్టుకుని మమ్మల్ని ఇంటరాగేట్ చేయబోతున్నాడు. ఇప్పుడే చాలా జాగ్రత్తగా వుండాలి అనుకున్నాను.


    "కోటీ యాభై లక్షలు, మొత్తం నోట్ల రూపంలో వున్నాయా? చిల్లరగా వుందా సార్? అయితే మాత్రం అయిదు కిరసనాయిలు డబ్బాలయినా వుంటుంది. ఒకటా? రెండా? రూపాయా? పావలా? పది పైసలా? ఐదు పైసలా? కోటీ యాభయ్ లక్షల రూపాయల చిల్లర అంటే అమ్మ బాబోయ్! ఎంత డబ్బో!" అంటూ గుండెలు బాదుకుని కళ్ళు తేలవేసి ఎక్కడో చూస్తున్నట్లుగా మాట్లాడాను.


    ఆ మాత్రం ఓవర్ యాక్షన్ చేయకపోతే వర్ధనరావు ఒక పట్టాన నమ్మడు.


    "నోట్లేమిటి? చిల్లరేమిటి? కోటీ యాభయ్ లక్షల గురించి నేను మాట్లాడుతూ వుంటే!" ముఖం చిట్లించి అన్నాడు వర్ధనరావు.


    "భలేవారు సార్! చిల్లర గానూ వుండక, నోట్లుగానూ వుండక కోటీ యాభయ్ లక్షలు ఎలా వుంటాయి సార్! ఓహో! అర్థమయింది బంగారు బిస్కెట్ల రూపంలో అయి వుంటుంది." ఏమీ తెలియనట్లు ఫోజుపెట్టి అన్నాను.


    "ఆపవయ్యా! ఆపు! ముందు ఈ అధిక ప్రసంగం ఆపు! నేను వజ్రాల గురించి మాట్లాడుతూ వుంటే, నువ్వేమో నోట్లంటావు! ప్రతి మాటనీ కన్ ఫ్యూజ్ చేసి పారేస్తావేమిటి? తెలిస్తే తెలిసినట్లు మాట్లాడాలి తెలియకపోతే తెలియనట్లు వూరుకోవాలి."


    ఇన్ స్పెక్టర్ గారు గద్దిస్తున్నట్లు నన్ను అడుగుతూ వుంటే, భయం భయంగా, వినయంగా తల వూపి వూరుకున్నాను.


    ఈ తఫా,


    రామ్ సింగ్ వేపుకి తిరిగి, "కోటీ యాభయ్ లక్షల గురించి నీకు తెలుసు?" గద్దిస్తూ అడిగాడు వర్ధనరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS