నిశ్చేష్టుడై చూస్తున్నాడు.
"నమ్మలేక పోతున్నావా వాత్సాయనా. ఏనాడూ ఏ మగాడికీ తలవంచని నేను నీ ముందు దాసోహమవుతున్నానెందుకో తెలుసా. అయిదు సంవత్సరాలుగా ధనుష్కోటితో నాకు శతృత్వమున్నా ఇంత మార్బలముండే నేనేం చేయలేకపోయినా అయిదు రోజుల్లో నువ్వు వాడి కథ ముగించావు కాబట్టి..."
అండర్ వరల్డ్ రాకెట్స్ ఎంత వేగంగా కదిలేదీ, ఎంతటి దీక్షతో మనుషుల కదలికల్ని పరిశీలించేదీ అర్థమై ఆశ్చర్యపోయిన శశాంక, "ఒక ఆడదానివయ్యుండీ ఇంత మేధాశక్తిని ప్రదర్శిస్తున్న నీకు నా జోహార్లు సోఫియా... నన్నెందుకిలా రప్పించినట్టు" అడిగాడు.
"నా సామ్రాజ్యాన్ని నీ చేతుల్లో వుంచి నీలో సగ భాగాన్నై ఈ అండర్ వరల్డ్ ని పూర్తిగా కబళించాలని" ఆమె వాక్యాలు ఇంకా పూర్తికాలేదు.
"సారీ సోఫియా... నేను పగ తీర్చుకున్నది వ్యక్తిగతమైన కక్షతో. నీ ప్రపంచంలో అడుగుపెట్టే కోర్కె లేదు."
నవ్వింది విషపూరితంగా.
"ఎందుకా నవ్వు."
"నవ్వక... నేను కోరిన నువ్వు నా లోగిలిలో అడుగుపెట్టి నన్ను కాదని ఎలా వెళ్ళగలవని..."
"అదేనా నీ ధైర్యం."
"అఫ్ కోర్స్. అదొక్కటే కాదు. చాలా వుంది. చూడు శశీ. నేను కోరడమే నువ్వు చేరుకున్న అదృష్టం. నన్ను కాదంటే నువ్వెంత నష్టపోయేదీ నువ్వూహించలేవు. ప్రపంచానికి నేను తెలిసింది పద్మినీజాతి ఆడదానిగానే అయినా పరుపుమీద హస్తినీ జాతి ఆడదాన్నై నీకు స్వర్గాన్ని చూపిస్తాను... కమాన్... చేయిపట్టుకు లాగింది. ఎంత కంఠస్తం చేశానని."
"ఏంటి?"
"వాత్సాయనుడి కామసూత్రాలు" ఆమె రెచ్చిపోతోంది. "నేను పుట్టింది ఆంగ్లో ఇండియన్ గా అయినా నేను ఆరాధించింది అర్ధశాస్త్రంలో కౌటిల్యుడ్నీ, కామ శాస్త్రంలో వాత్సాయనుడ్ని శశాంకా. రా... ఒళ్ళంతా కాలిపోతోంది."
విదిలించబోయాడు. కాని ఆమె పట్టు విడవలేదు. "శశీ" అతడ్ని చుట్టేసింది. "నేనో సెగలు చిమ్మే మంటని, ఎన్ని సమిధల్ని వేసినా కాంక్ష తీరని హిమాన్ని. కమాన్..."
ఆవేశంగా నెట్టేశాడు.
ఓ చిన్న మూలుగు.
వెంటనే బుసకొడుతున్న కళింగ నాగులా క్రోధంగా చూసిందతడ్ని. "నువ్వు వెళ్ళలేవు."
"ఏం."
"నీకా అవకాశం లేదు కనక."
అప్పటికే హాల్లోపల చుట్టూ నిలబడి వున్నారు సాయుధులైన ఆమె అనుచరులు.
ట్రిగ్గర్స్ పై వేళ్ళనుంచిన ఆ వ్యక్తులు ఎదురు చూస్తున్నారు ఆమె అనుజ్ఞ కోసమని.
"అర్థమైందనుకుంటాను..." ఆవేశంగా గదిలోకి నడవబోతూ ఒక్క క్షణం ఆగింది. "అయిదు నిమిషాల వ్యవధినిస్తున్నాను శశాంకా. నా గురించి ఇంత చెప్పిన నేను నిన్ను బయటికెలా వెళ్ళనివ్వను. కాబట్టే ఈలోగా ఆలోచించుకో... మనసు మార్చుకున్నావా బ్రతికి పోతావు. లేదా వాచీ చూసుకుంది. "మరో నాలుగున్నర నిముషాల్లో మరో లోకానికి వెళ్ళిపోతావు."
"వెళ్ళకు సోఫియా."
ఓర కంటగా చూసింది.
"మరేం లేదు... నాకీ పరీక్ష పెట్టిన నీ సమక్షంలో ఎలా దాటి వెళతానో నీకు చూపించాలని. అంతే..." చుట్టూ చూశాడు. సుమారు పదిమందిదాకా వున్నారు ప్రాణాలు తోడే యమకింకరుల్లా. "గుడ్" ఒక్కో వ్యక్తి ఆయుధాన్నీ ఆసక్తిగా చూస్తూ అన్నాడు. "లోమెట్ ఫోర్ట్ బ్రీచ్ లోడింగ్ మేగజైన్ రైఫిల్, జర్మన్ వీల్ లాక్ పెట్రోనిల్, ఇంగ్లీషు ప్లింట్ లాక్ పిస్టల్. వెల్, మంచి ఆయుధాలే."
"ఇక మిగిలింది మూడు నిముషాలే" అరిచింది సోఫియా.
"ఆగు సోఫియా, నీ కామశాస్త్ర పరిజ్ఞానం గురించి నువ్వు చెప్పినట్టే నా ఆయుధాల పరిజ్ఞానాన్ని నన్నూ తెలియజెప్పనియ్యి" క్షణం ఆమెనే తదేకంగా చూసి తలతిప్పి అనుచరులతో అన్నాడు. ఆయుధాలతో బుల్లెట్స్ సరిగా లోడ్ చేసినట్టేగా... మరేం లేదు. మరో రెండు నిముషాలలో నేను తప్పించుకోబోతున్నాను."
నిర్విణ్ణులై చూస్తున్నారంతా.
అప్పటికి సోఫియా పెట్టిన గడువు మిగిలింది ఇంకా రెండున్నరనిముషాలు మాత్రమే.
మరో అర నిమిషం గడిచింది.
చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం. అంతలో.
శశాంక రెప్పలార్చకుండా తననే చూస్తున్న సోఫియాని చూసి నవ్వాడు.
ఏ ధైర్యంతో అతడలా ఛాలెంజ్ చేసిందీ ఆమె వూహించలేకపోతూంది.
సరిగ్గా అప్పుడే ఆమెను ఆప్యాయంగా దగ్గరకు లాక్కున్నాడు.
ఇదీ ఆమె ఆలోచన కందనిదే... ఓడి తన రూట్ లోకి వచ్చాడనుకుంది. అదీ అర క్షణమే... ఏదో వీపు మీద గుచ్చుకుంది. వెంటనే అర్థమైపోయింది. తన వెన్నెముకకి పిస్టల్ గురిపెట్టాడని...
