Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 34


    ఇంటి చుట్టూ చిన్న పనులకి, పెద్ద పనులకి వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు.


    ఇంటికెవరన్నా వచ్చినా, తనెక్కడికన్నా వెళ్ళినా కూడా రాజకీయాల గురించే ప్రస్తావిస్తోందామె.


    ఎలక్షన్లకింకా వ్యవధి లేదు.


    కనక పార్టీ తరపున ఏదన్నా పదవిని సాధించాలని ఆమె మనసులో ఉంది.


    భారతి తల్లి హడావిడిని చూసి.....


    "భలేవాడివి బావా, మొత్తానికి అమ్మ జాతకాన్నే మార్చేశావు" అంది.


    సారధి తమాషాగా నవ్వాడు.


    "నీకు తెలీదు భారతీ, కొంతమంది పవర్ అంటే పడి చస్తారు. వాళ్ళని పవర్ మాంగర్స్ అంటారు. ఆ కోవలోకి వస్తుంది అత్తయ్య."


    "ఈ పిచ్చిలో అమ్మ ఏమవుతోందోనని భయంగా ఉంది."


    "నీకా భయం అవసరం లేదు, అత్తయ్య రాజకీయాల్లో బాగా రాణిస్తుంది. ఆ నమ్మకం నాకుంది" అన్నాడు సారధి.


    "నిజమే. కానీ పార్టీ టికెట్ అమ్మకి దొరకాలి. ఎలక్షన్లో గెలవాలి. ఇవన్నీ అయ్యే పనులంటావా? భారతి అనుమానంగా అడిగింది.


    "ఇవాళ రేపు ప్రజలు ఓట్లు వేస్తున్నది మనిషిని చూసి కాదు పార్టీని చూసి, ఆ పార్టీలో ఉన్న ప్రముఖ వ్యక్తిని చూసి, సీటు రావాలే కానీ అత్తయ్య కలలు నిజమవుతాయి."


    "ఏమోలే. ఒక్కోసారి వేళాకోళానికన్న మాటలే నిజమవుతాయట. నువ్వు తోటలో అమ్మని ఏడిపించడానికన్నావు, ఆ మాటల్ని ఆమె సీరియస్ గా తీసుకుంది. దాని ఫలితంగా ఆమె ఢిల్లీవరకూ వెళ్ళి వచ్చింది. పోనీలే. ఆమెకోరిక తీరితే అంతేచాలు!" అంది మేడమెట్లు దిగుతూ భారతి.


    సారధి కూడా ఆమె వెనకే దిగాడు.


    లక్ష్మిపతి క్లయింట్స్ తో హడావుడిగా ఉన్నాడు ఆయన ఆఫీసురూంలో.


    కింద హాల్లో లలితాంబ ఎవరితోనో మాట్లాడుతోంది.


    "డోంట్ వర్రీ, మీ పేరేమిటన్నారు బసవయ్యగారా?"


    "కాదు మేడం సాంబయ్యని"


    "అవును సాంబయ్య కదూ! మీరు నిశ్చింతగా ఉండండి. ఈరోజే మినిష్టరు గారికి చెప్పి టెండరు మీకు వచ్చేలా చూస్తాను. ఈలోగా వెళ్ళి చీఫ్ ఇంజనీర్ గార్ని కలుసుకోండి"


    "అలాగేనమ్మా. మీ సహాయం మరచిపోను, మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాను." అన్నాడు సాంబయ్య అనే కాంట్రాక్టరు.


    "ఇక కంగారు పడకండి. మనిషిగా పుట్టాం అంటే మామూలుగా బతికేయడానికి కాదు. నలుగురికి సహాయపడాలి. అది నా అలవాటు" అంది లలితాంబ.


    "మీలాంటి తల్లులు ముందుకొస్తే ఈదేశం బాగుపడుతుందమ్మా" అన్నాడు సాంబయ్య.


    "పొగడ్తలు నాకు గిట్టవు. అవసరం వచ్చినప్పుడు కృతజ్ఞత చూపించండి చాలు"


    సాంబయ్య వెళ్ళిపోయాడు. సోఫాలో కూర్చున్న మరో వ్యక్తి -


    "నా పేరు యాదగిరండి.  మా బస్తీకి లీడర్ని. ఆడేం సెయ్యాలన్నా నేనే సేత్తా" అన్నాడు.


    లలితాంబ నవ్వింది.


    "ఇది చెప్పడానికా వచ్చారు" అంది.


    "అది కాదమ్మా, మా బిడ్డ పదోక్లాసు పరీక్ష కెళ్ళింది. ఓ కాగితాన్ని పాడుచేసి తప్పేట్టుంది.   నాలుగు మార్కులు కలిపించి పరీక్ష నెట్టుకొచ్చేలా సూడాలా మేడం, లేకపోతే అది సత్తానంటోంది" అన్నాడు యాదగిరి.


    లలితాంబ సాలోచనగా తలపంకించింది. "ప్రయత్నం చేద్దాం. బోర్డు డైరెక్టరుతో మాట్లాడతాను ఆ పైన నీ బిడ్డ అదృష్టం?"


    "ఆ మాట సాలు నాకు"


    "నెంబరిచ్చి వెళ్ళు"


    యాదగిరి నెంబరు చెప్పాడు.


    "19858"


    లలితాంబ ఆ నెంబర్ని నోటు చేసుకొంది.


    యాదగిరి వెళ్ళిపోయాడు.


    కిందికి దిగొస్తున్న సారధిని, భారతిని చూసింది లలితాంబ.


    "సారధి"


    "ఏమిటత్తయ్యా!"


    "బహుశా నీకు ఆర్డర్స్ ఈ రోజుకానీ, రేపుకానీ వస్తాయి. మీ వూళ్లోనే గవర్నమెంటు కాలేజీ లెక్చరర్ గా వేస్తున్నారు" అంది.


    "థాంక్స్. మెనీ థాంక్స్ ఆంటీ" అన్నాడు సారధి సంతోషంగా.


    "థాంక్స్ ఎందుకోయ్. బయట వాళ్ళకే ఎన్నో చెస్తున్నాను. నువ్వు పరాయివాడివేమీ కాదుగా. అసలు రాత్రే నిన్ను లేపి చెప్పాలనుకున్నాను. కాని అది నా డిసిప్లేన్ కి విరుద్ధం. అందుకని వూరుకున్నాను."


    "కంగ్రాచ్యులేషన్స్ అడ్వాన్స్ గా  చెప్పేస్తున్నాను బావా" అంది భారతి.


    "థాంక్యూ భారతి"


    "థాంక్యూలు చెప్పడం కాదు. నీలాంటి కుర్రాళ్ళని వళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పు" అంది లలితాంబ.


    "అదేమిటత్తయ్య ఇప్పడేం....."


    "మాట్లాడకు. నాకు వళ్ళు మండుతుంది. ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్ళి చేసుకొని, దాన్ని పుట్టింట్లో పెట్టి ఉధ్యోగం కోసం దేశాలు పట్టుకుని తిరిగే వాళ్ళంటే నాకొళ్ళుమంట!" అంది లలితాంబ.


    "నా విషయంలో కారణం నీకు తెలుసుకదత్తయ్యా."


    "వెధవ కారణాలకేమొచ్చే. ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం కన్నా చంద్రమండలానికెళ్ళి తిరిగి రావడంతేలికంటాను. నువ్వేమంటావు"


    "నిజమే"


    "ఏదో నీ అదృష్టంకొద్దీ నువ్వు గట్టెక్కావు. అదే సామాన్యుల మాటేమిటి?"


    సారధి మాట్లాడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS