Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 34


    ఇక అక్కడ వుండడం వేస్ట్ అనుకున్నాడు గణపతిరాజు. ఎంతసేపు చెప్పినా అదే సమాచారం.

 

    వయస్సులో వున్న అంతమంది అమ్మాయిలు ఈ ఊర్లో ఎక్కడుంటారు? డాక్టర్ కి థాంక్స్ చెప్పి అక్కణ్ణుంచి బయటపడ్డాడు.

 

    ఆ వూర్లో బాలికల హైస్కూల్ వుంది. అక్కడికి వెళ్ళి ఎవరికైనా పాము కరిచిందేమోనని విచారించాడు. లేదన్నారు. అందులో అక్కడున్నది అంతా చిన్నపిల్లలే. హాస్పిటల్ కి వెళ్ళాడు. హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ కాదు. ప్రైమరీ హెల్త్ సెంటర్. ఇద్దరు వృద్ధులు తప్ప మరెవరూ లేరక్కడ.

 

    ఇక లాభం లేదనుకుని అన్నావారి సత్రం నుంచి అనాథ మహిళాసదన్ కు బయల్దేరాడు. మధ్యలో ఓ కూల్ డ్రింక్ షాపు దగ్గర ఆగి మందు అడిగి తీసుకున్నాడు.

 

    "ఈ వూర్లోనే వున్నాడు - అది ఖచ్చితం. ఎక్కడున్నాడో తెలుసుకోవాలి"

 

    తమ బాస్ ఎంత ముందు చూపుతో వ్యవహరించాడో వింటున్న ఇద్దరికీ అర్థమైంది.

 

    తప్పనిసరిగా ఓ మనిషికి పనిబడే ప్రదేశాలలో ఫోటోలు ఇవ్వడం వల్లే అతని ఆచూకీ తెలిసింది. ఇంత తెలివిగా వ్యవహరిస్తాడు గనుకే ఒక ముఠాకు నాయకుడయ్యాడు.   

 

    "రేయ్ రాజూ! నువ్వెళ్లి అన్నావారి సత్రంలో కుట్టుమిషన్ కేంద్రాలూ, అలానే వ్యభిచార కొంపలు - అమ్మాయిలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఏమైనా వున్నాయేమో చూడు. రేపటికల్లా వాడెక్కడున్నాడో తేలిపోవాలి" అన్నాడు గణపతిరాజు.  

 

    అలాగేనన్నట్లు తల వూపాడు ఇద్దరిలో ఒకడు.

 

    గణపతిరాజు చివరి చుక్క నోట్లో పోసుకుని -

 

    "మనసంతా చికాకుగా వుందిరా, అలా అన్నావారి సత్రంకు వెళ్ళి సెకండ్ షో సినిమా చూసొద్దాం పదండి" అన్నాడు.

 

    అదే సెకండ్ షోకి తరుణ్ వస్తున్నాడని వాళ్ళకి తెలీదు. అందరూ ఉత్సాహంగా బయల్దేరారు.

 

                           *    *    *    *    *

 

    అమ్మాయిలంతా భోజనాలకు వెళ్ళి వచ్చేటప్పటికి జ్ఞానమందిరంలో రెడీగా వున్నాడు తరుణ్.

 

    "ఏమిటి అర్జెంటుగా రమ్మన్నారట?" అంది కైవల్య అందరూ వచ్చారని తెలియగానే.

 

    మామూలుగా మౌనిక కూర్చునే కుర్చీలో కూర్చున్నాడతను. డయాస్ మీద అతని కెదురుగా వున్న టేబుల్ మీద నైల్ పాలిష్ బాటిళ్ళు వున్నాయి.

 

    అనాథ మహిళాసదన్ కు ఓ మెటాడోర్ వ్యాన్ వుంది. రెండు మూడు రోజులకోమారు అందులో టౌన్ కి వెళ్ళి కూరగాయలులాంటి నిత్యావసర వస్తువులు కొని తెస్తుంటారు. ఉదయం వ్యాన్ వెళుతుండగా మౌనిక వెళ్ళి ఓ వృద్ధుడికి డబ్బులిచ్చి నైల్ పాలిష్ బాటిళ్ళు తెచ్చిపెట్టమంది. అతను తెచ్చాడు.

 

    "మీరు కష్టపడి సంపాదించిన సంపాదనతో నైల్ పాలిష్ తెప్పించాను. ఏ రంగులూ లేక పాలిపోయిన మీ జీవితాల్లో రంగులు అద్దాలనే నా ఈ ప్రయత్నమంతా" తరుణ్ నెమ్మదిగా చెప్పాడు.

 

    సదన్ లోని అమ్మాయిలంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఓ పక్క ఆనందం, మరో పక్క ఏదో తెలియని యిబ్బంది.

 

    "మీరంతా చాలా అనీజీగా ఫీలవుతున్నారని మీ ముఖాలు చూస్తుంటేనే తెలుస్తోంది. కానీ ఇందులో సిగ్గుపడాల్సినది ఏమీలేదు. కొందరు స్వార్థపరులు విధవలు యిలా వుండాలని కొన్నిటిని ఏర్పరచారు. ఏం వితంతువులు మాత్రం మనుషులు కారా?

 

    వితంతువు అయినంత మాత్రాన జీవచ్ఛవంలాగా బతకాలని ఎక్కడయినా వుందా? 'తాటాకులలోన వ్రాసిరి పరాంగన కూడిన పాపమంచు' అని సాక్షాత్తూ తార చంద్రుడితో అంది. మన బతుకు మనం బతికే స్వేచ్ఛ మనకెప్పుడూ వుంటుంది. ఇందుకు ఎవరి పర్మిషనూ మనకు అనవసరం."

 

    చివరి వాక్యాలు వాళ్ళను బాగా ప్రభావితం చేశాయి.

 

    "అందుకే ఈ రోజు నుంచి మనకు ఇష్టమైన పనులు మనం చేద్దాం. దానికి నాందిగా మీరు ఈ నైల్ పాలిష్ పెట్టుకుంటున్నారు. అందరూ మరో పావుగంటకు రెడీ అయితే మనం ముందనుకున్నట్లుగా టూరింగ్ టాకీస్కీ సెకండ్ షోకి వెళదాం"

 

    శృతి ఆనందం పట్టలేక చిన్నగా బల్లను చరిచింది. ఆమెకు సినిమాలంటే ప్రాణం.

 

    ఇక్కడకు వచ్చిన ఈ సంవత్సరంలో తెరమీద బొమ్మ చూడలేదు. ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినట్లు వుక్కిరి బిక్కిరవుతూ వుందామె. అందుకే ముందుగా డయాస్ ఎక్కి ఓ బాటిల్ ను తీసుకుంది.`

 

    "ఇద్దరికి కలిసి ఒక బాటిల్. మీరు నైల్ పాలిష్ పెట్టుకొస్తేనే సినిమా"

 

    "ఓఁ" అంది ఆమె.

 

    "కైవల్యా, నేనూ కలిసి ఓ బాటిల్ తీసుకుంటున్నాం" అని డయాస్ దిగి, ఇక టైమ్ లేడన్నట్లు అక్కణ్ణుంచి బయటపడింది. ఆమెను అనుసరిస్తూ కైవల్య కూడా వెళ్ళిపోయింది.

 

    ముఖ్యమైన వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక మిగిలిన వాళ్ళు జట్లు జట్లుగా బాటిల్స్ తీసుకుని వెళ్ళారు. చివరికి మౌనిక, తరుణ్ మిగిలారు. నేరేడు పండు కలర్ నైల్ పాలిష్ బాటిల్ ఒక్కటే మిగిలింది.

 

    "ఇది మీకు" అన్నాడు.

 

    మౌనిక దాన్ని చేతుల్లోకి తీసుకుంది.

 

    "మనమూ తయారవ్వాలి"

 

    మౌనిక ఏమీ మాట్లాడలేదు.

 

    టూరింగ్ టాకీస్ నుంచి 'కృష్ణా, ముకుందా' పాట వినిపిస్తోంది.

 

    "వెళదాం రండి" అని అతను ముందు అడుగు వేశాడు. ఆమె మౌనంగా అతన్ననుసరించింది.

 

    మరో పావుగంటలో అందరూ తయారై మౌనిక గదికి వచ్చారు. వాళ్ళంతా తెల్లటి బట్టలు కట్టుకుని వున్నా గోళ్ళకు వేసుకున్న నైల్ పాలిష్ మాత్రం మసక వెన్నెల్లో మెరుస్తోంది. వాళ్ళు మాటిమాటికీ తమ గోళ్ళ వంక చూసుకుంటున్నారు.  

 

    "డైరెక్టుగా పోతే మనం పట్టుబడతాం. కాబట్టి అందరూ కంతలోంచి దూరాల్సిందే"

 

    అమ్మాయిలకు అది కూడా థ్రిల్లింగ్ గా అనిపించింది. దొంగతనంగా సినిమాకు పోవడమే వాళ్ళని ఉద్వేగానికి గురిచేస్తోంది. ఇప్పుడీ ప్రపోజల్.

 

    మౌనిక మొదట రానంది. కానీ ఆమె రాకపోతే మిగిలిన వాళ్ళు కూడా రామన్నారు.

 

    దాంతో ఇక ఆమెకి తప్పలేదు.

 

    అందులోనూ ఇప్పుడామె బాగా తేరుకుంది.

 

    అందరూ బయల్దేరారు.

 

    ఒక్కొక్కరే కంతలోంచి అవతలకి దాటుతున్నారు. పావుగంట పైగానే పట్టింది. అందరూ వచ్చేశాక హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారితే విమలాబాయికి తెలియచ్చుగాక ఇప్పుడిక సినిమాకు అభ్యంతరం పెట్టేవాళ్ళు లేరు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS