"దేనికి?"
"మనను దూరంనుంచే గమనిస్తున్న కొందరు స్టూడెంట్స్ కి మరికాస్త వినోదం అందించటానికి."
ఆదిత్య సంశయంగా చూస్తున్నాడు.
"రండి కారులోకి" ఆదేశంలా అన్న ప్రణయ, అందరూ చూస్తూ ఉండగానే ఆదిత్యబాటు కారులో కూర్చుంది. మరో అరనిముషంలో కారు కదిలింది.
దూరంనుంచే ఇదంతా గమనిస్తున్న శౌరి, సుధీర్ ఎంత మండిపడ్డారూ అంటే "ఎంత బరితెగించారు!" అన్నారు గట్టిగానే.
"అవునవును."
గిరుక్కున వెనక్కి తిరిగాడు శౌరి.
సూరి నిలబడివున్నాడు తన మిత్రబృందంతో.
"ఎందుకలా కంగారుపడతావు శౌరీ! నువ్వన్నది నిజం ఇద్దరూ ఇంత బరితెగిస్తారని నేనూ వూహించలేదు."
"సూరి తెగడుతున్నాడో, పొగడుతున్నాడో ముందు అర్ధంకాలేదు.
"మావాడు- అదే ఆదిత్యగాడు- ఇంకా స్పష్టంగా చెప్పాలీ అంటే మొన్నెప్పుడో బాహాటంగా అందరిముందూ మీ చెల్లికి ముద్దు పెట్టే ఛాన్స్ వున్నా ఛీ కొట్టి వెళ్ళినవాడు, ఇప్పుడు ప్రణయ వలలో పడ్డాడూ అంటే, హమ్మో! వీడు మహా అసాధ్యుడని నేనూ అంగీకరిస్తున్నాను. అసలు ఆ రోజు మీ చెల్లిని కిస్ చేసి వుంటే ఈ పాటికి నీ చెల్లితోబాటు నీకూ బావగా మారి..."
"సూరీ!" ఆవేశంగా సూరిని సమీపించాడు శౌరి.
"నేను చెబుతున్నది అబద్దమా శౌరీ?"
"ఆ రోజు వాడు నిజంగా ఆ పని చేసుంటే చీరేసేవాడ్ని!"
"అప్పుడు మీ చెల్లి అడ్డం పడేది!"
"అదేం ప్రణయలా బరితెగించిన ఆడది కాదు!"
"నిన్నటిదాకా ప్రణయ గురించీ మనమంతా ఇలాగే అనుకున్నాముగా!" క్షణం ఆగి అన్నాడు సూరి. "సో....దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రణయలో మీ చెల్లి దగ్గర లేని మరో ప్రత్యేకత ఏదో వుంది. అదే ఆదిత్యని ఆకట్టుకుని వుంటుంది."
"స్టాపిట్!" అరిచింది సూరిమీద కోపంతో కాదు. వెనుక నిలబడ్డ ప్రబంధని చూసి.
అసలు అప్పటికే ప్రబంధ వారి చర్చనంతా విందని తెలీని శౌరి ఇంకా తన ఆవేశాన్ని ప్రదర్శించేవాడే కాని ప్రబంధ విసవిసా నడిచి కారెక్కింది.
ఆ కారు వెళుతున్నది యూనివర్శిటీ బయటికి.
ఆదిత్య ప్రణయలే కాదు, ప్రబంధ కూడా ఆ రోజు క్లాసు ఎగ్గొట్టింది.
ప్రణయ కారు సరాసరి కింగ్ జార్జి హస్పిటల్ లోకి వచ్చి ఆగింది.
ఆదిత్య ఇదంతా ఏమిటో అర్ధంకాక చూస్తుండగానే ప్రణయ కార్డియాలజీ వార్డులోకి నడిచింది.
బామ్మ ఇంకా స్పృహలోకి రాలేదు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వున్నప్పుడు కొందరు వ్యక్తుల పరామర్స ఎంత ఊరటనిచ్చేదీ ఆ స్థితిలో వున్నవాళ్ళకు తప్ప అర్ధంకాని విషయం.
చాలారోజులుగా బామ్మ పరిస్థితికి ఆదిత్య కలవరపడుతూ, బహుశా ఆ కలవరపాటునుంచి తేరుకోడానికి ప్రణయని ఎక్కువగా కలవటం అలవాటు చేసుకున్నాడేమో కూడా.
ఇప్పుడు బామ్మకి తోడుగా అక్కడున్న అనితకీ ప్రణయ పరిచయం అంత రిలీఫ్ నిచ్చింది. అంతేకాదు ఐదు నిమిషాల పరిచయంలో అనిత ప్రణయకి చాలా దగ్గరైపోయింది.
ప్రణయ ఎవరో, అన్నయ్యకీ - ఆమెకీ వున్న పరిచయం ఏపాటిదో అనితకు తెలీదు కానీ, ఎప్పుడూ అమ్మాయిలకి దూరంగా తన ప్రపంచంలో తాను మిగిలిపోవటమే అలవాటైన అన్నయ్యకి అలాంటి అమ్మాయి స్నేహితురాలు కావటం అనితకీ గర్వ మనిపించింది.
కార్డియాలజిస్ట్ ఛాంబర్ లోకి వెళ్ళి మాట్లాడి వచ్చిన ప్రణయని అడిగింది అనిత "డాక్టరేమంటున్నారు?"
అనిత కళ్ళలోని దిగులుకే జాలి అనిపించిందో, లేక బహుశా ఇక ఆ వృద్దురాలు తేరుకోదని డాక్టరు చెప్పిందే గుర్తుకొచ్చిందో ఆప్యాయంగా అనిత భుజంమీద చేయివేసింది. "వయసైపోయిన మనిషిగా కొన్నాళ్ళపాటు మీకీ శ్రమ తప్పదంటాడు. మరి వెళ్ళిరానా?" అంది ప్రణయ.
"అప్పుడప్పుడూ వస్తుండండి"
"నీకు థాంక్స్ చెప్పాలి అనితా!"
"దేనికి?" అనిత విస్మయంగా అడిగింది.
"మీ అన్నయ్య పాటించని నియమాన్ని నువ్వు పాటిస్తున్నందుకు నిజం! పరిచయమై ఇన్ని రోజులయినా మాటవరసకి ఒక్కసారయినా తనకింత మంచి చెల్లి వుందని చెప్పటం చేతకాని బుద్దావతారం మీ అన్నయ్య నువ్వు పిలిచావుగా... తప్పకుండా వస్తుంటాను ఓ.కే."
ఆదిత్యతోబాటు బయటికి నడిచింది ప్రణయ.
"వెళ్తారా?" అన్నాడు కారు దగ్గరికి వచ్చాక.
క్లాస్ ఎగ్గొట్టింది నా కోసం - మీ కోసం కాదు అవునా?"
అవునన్నట్టు తల పంకించాడు.
"అలాంటప్పుడు ఇక చాలు మహానుభావా అని నేననేదాకా మీరు నాతో స్పెండ్ చేయాలి."
"సరే.... ఎక్కడికి వెళదాం?"
"మా ఇంటికి... ఏం కంగారుగా వుందా?"
"దేనికి?"
"పగలు కూడా ఇద్దరూ కలిసి కాలక్షేపం చేస్తున్నారని అందరూ అనుకుంటారని" కేజువల్ గా అంది ప్రణయ.
కాని తను అంత యథాలాపంగా తీసుకోలేకపోయాడు.
"యూ ఆరె డిఫరెంట్ కారెక్టర్"
"లేకపోతే ఏం చేయాలి ఆదిత్యా? జుట్టుపీక్కుంటూ యూనివర్శిటీకి వెళ్ళకుండా ఇంట్లోనే గడపాలా?"
జవాబు చెప్పలేదు ఆదిత్య.
సరిగ్గా ఏడు నిమిషాల్లో ఆమె ఇంటికి చేరుకుంది.
అప్పుడు హఠాత్తుగా ఆదిత్యకి గుర్తుకొచ్చింది క్రితం రాత్రి ప్రణయ అతడికో కవరిచ్చింది. అది ప్రస్తుతం అతడి జేబులోనే వుంది.
