Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 34


    
    వెంటనే అన్నాడు "ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్ (THE QUICK BROWN FOX JUMPS OVER THE LAZY DOG)"
    
    "ఆ వాక్యానికి ఇంగ్లీష్ భాషలో ఓ ప్రత్యేకత వుందంటే మీరు దిక్కులు చూస్తూ వుండిపోయారు."
    
    "అంటే ప్రతిసారీ అలా చెప్పలేనని మీ ఉద్దేశం అయితే మీరు పొరపాటు పడినట్టే."
    
    "నా ఉద్దేశం అదికాదు ఆదిత్యా! ఆ వాక్యంలోని ప్రత్యేకత ఏమిటంటే, ఇంగ్లీషు భాషలోని అన్ని అక్షరాలూ ఈ వాక్యంలో వున్నాయని మీకు తెలియజెప్పడం"
    
    నివ్వెరపోయాడు ఆదిత్య. "అయితే?"
    
    "సరిగ్గా ఇలాగే మీకిచ్చిన కవర్లోనూ నా వ్యక్తిత్వం తెలియచేసేది వుంది. అది చూశాక మీకే అర్ధమవుతుంది నేనేమిటీ అన్న విషయం."
    
    కాఫీ తాగిన ఆదిత్య ఆ తర్వాత మాట్లాడలేదు. అర్ధంకాని ఆమె మాటల్లోని వాక్యాల్ని మననం చేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు.
    
    అతడు వెళ్ళిపోతుంటే ప్రణయకి వెలితిగా అనిపించింది.
    
                                                                 * * *
    
    ఉదయం పదిగంటల సమయం.
    
    క్లాసులకి వెళుతున్న యూనివర్శిటీ విద్యార్ధులంతా లైబ్రరీ దగ్గర ఆసక్తిగా ఆగిపోయారు.
    
    అక్కడ లైబ్రరీ గోడలపై రాయబడిన వాక్యాలు చాలామందిని ఆకర్షించాయి.
    
    "అర్దరాత్రిదాకా ఆదిత్య, ప్రణయల విహారం."    

    "అర్జెంటుగా ప్రణయ మరో కొంపని అద్దెకు తీసుకున్నది ఆదిత్యతో కాపరానికేనా?"
    
    "ఆదిత్య, ప్రణయాల అర్ధరాత్రి శృంగారం."
    
    గుంపులు గుంపులుగా నిలబడ్డ స్టూడెంట్స్ లో కొందరు అసభ్యంగా ఉన్న రాతలకి నిశ్శబ్దంగా తల తిప్పుకుని వెళ్ళిపోతుంటే, మరికొందరు ఉత్సాహంగా కామెంట్స్ పాస్ చేస్తున్నారు.
    
    అది రాసింది ఎందుకో చాలామందికి తెలీదు. ఒకవేళ శౌరి పనికట్టుకుని రాయించాడని తెలిసినా అడిగే దమ్ము ఎవడికీలేదని చాలామందికి తెలుసు.
    
    ముందు రియాక్టయింది ఆదిత్యే. సిగ్గు, బిడియంలాంటివి ముంచుకు వస్తుంటే దూరంగా వెళ్ళిపోలేదు. ఉద్రేకంగా చెరిపేయాలనుకున్నాడు. అప్పుడు వారించాడు సూరి.
    
    "నన్ను వదులు" ఉక్రోషంగా విదిలించుకోబోయాడు.
    
    "ఒరేయ్ ఆదిత్యా!" నచ్చచెప్పాడు సూరి. "యూనివర్శిటీస్థాయిలో ఇలాంటి కుసంస్కారాన్ని ప్రకటించగలిగే విద్యార్ధులూ వుంటారన్న సత్యం ప్రపంచానికి తెలియాలీ అంటే ఆ అక్షరాలు అలాగే వుండాలి. అందరూ చదవాలి."
    
    "కాని ఇక్కడ రాసింది బజారు భాష"
    
    "పొయిటిక్ గా రాసివుంటే ఫర్వాలేదంటావా?" ఠక్కున అడిగాడు సూరి. "అయినా ఇంత పనిగట్టుకుని డబ్బు ఖర్చుచేసి రంగులు కొని, మనుషులని ఎంప్లాయ్ చేసి ఇలాంటి శ్రమ తీసుకున్న వ్యక్తులు నీకింత పబ్లిసిటీ ఇస్తుంటే ఆనందించాలి తప్ప ఆడపిల్లలా సిగ్గుపడతావేం?"
    
    "ప్రణయ ఏమనుకుంటుంది?"
    
    "నువ్వు రాయించావని మాత్రం అనుకోదు."
    
    "అయినా అసహ్యించుకుంటుంది."    
    
    "నిన్ను కాదు- రాయించినవాడిని."
    
    "ఎవరు రాయించారు?"
    
    నవ్వాడు సూరి "శౌరి."
    
    "దానివలన అతనికొరిగేదేమిటి?"
    
    "ఈ ప్రపంచంలో చాలామంది అశాంతికి గురయ్యేది తనకు జరిగిందానికి కాదు. మరొకడికి జరుగుతున్న దానికి.
    
    అర్ధంకానట్టు చూశాడు.
    
    "ప్రణయ అనే అమ్మాయి ఉన్నింటి అమ్మాయే కాదు, అందంతో బాటు ఆత్మాభిమానమూగల ఆడపిల్ల కారణమేమన్నా కానీ నీకు దగ్గరైంది నీకు తెలీదు ఆదిత్యా! ఆమె పరిచయంకోసం ఎంతమంది వెంపర్లాడి ఓడిపోయారో నాకు తెలుసు. అందులో శౌరి కూడా ఒకడు. అలా ప్రయత్నించి ఓడిపోవడంలో బహుశా ఈ పనికి పూనుకుంటాడు."
    
    ఇబ్బందిగా తల వంచుకున్నాడు ఆదిత్య ఆ క్షణంలో అనిపించింది ఒక్కటే. అనవసరంగా తను ఆమెకు దగ్గరకావాలని ప్రయత్నించి చాలా మంది అపోహపడటానికి కారణమయ్యాడు. ఒకవేళ ఆమెను తరచూ కలుసుకుని వుండకపోతే ఇలాంటి కథలు పుట్టేవికావు.
    
    ఆదిత్య అశాంతిగా క్లాసు రూంలోకి నడవబోతుంటే ఎవరో పిలిచినట్టు వెనక్కి తిరిగాడు.
    
    ప్రణయ నిలబడివుంది "ఏమిటీ... ఆడపిల్లలా మీకూ ముచ్చెమటలు పోస్తున్నాయా?" అంది మృదువుగా నవ్వుతూ.
    
    అక్కడి విద్యార్ధులంతా ఆమెను గమనిస్తున్నా తొణుకూ బెణుకూ లేకుండా గోడల మీద వాక్యాలన్నీ మామూలుగా చదివింది.
    
    "మనం వైస్ ఛాన్సలర్ కి రిపోర్ట్ చేద్దాం" అన్నాడు ఆదిత్య బిడియంగా తల వంచుకుని.
    
    "ఏమని?"
    
    "అదే..."
    
    "మన మధ్య నిజంగా సంబంధం లేదనా?"
    
    "అదికాదు ప్రణయా..."
    
    "ఒకవేళ ఉన్నా మా సంబంధంతో ప్రపంచానికేమిటి సంబంధమనా?"
    
    "అహ."
    
    "వద్దు ఆదిత్యా!" ప్రసన్నంగా అంది. "రాసినవాళ్ళు బాధపడతారు. అంతేకాదు- మనం చెరిపేస్తే మళ్ళీ చదువు మానుకుని కొత్త స్లోగన్స్ కోసం ఆలోచించి రాయించి టైమ్ వేస్ట్ చేసుకుంటారు. వాళ్ళమీద సానుభూతితో క్షమించి వదిలేద్దాం."
    
    "అంతేనంటారా?"
    
    "అంతేకాదు అర్జెంటుగా మనం మరో పనిచేయాలి" అంది. దగ్గరకు వచ్చి రహస్యంలా.... "మీరీ ఒక్కరోజూ క్లాసునే ఎగ్గొట్టాలి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS