"కాఫీ తాగుతారా?"
"లేదు.... ప్రణయా...! ముందు ఆ కవరులో ఏముందో చూడాల నుంది"
"వెల్ కం! నేను ఎదురుగా కూర్చోవాలా? లేక మీరు ఒంటరిగా చదవాలనుకుంటున్నారా?"
"మీ సమక్షంలోనే కవరు తెరవాలని నియమం పెట్టారుగా?"
"అయితే కానివ్వండి"
కవరు చించి లోపలి కాగితాన్ని తీసి చూస్తూ అవాక్కయిపోయాడు ఆదిత్య.
తాను రాత్రినుంచీ అనుకున్నట్టు అది ప్రేమలేఖ కాదు. ఏ విషయాన్నయినా సూటిగా మాట్లాడగలిగే శక్తివున్న ప్రణయ అలాంటిదేదో రాస్తుందన్న నమ్మకం లేకపోయినా, ప్రేమను వ్యక్తంచేయడంలో ఎంత సాహసం గల అమ్మాయి అయినా బిడియపడుతుందన్న ఓ లాజిక్ ని తన ఆలోచనలకి అన్వయించుకుంటూ చాలా ఆలోచించాడు కాని ఇదేమిటి?
"మిస్టర్ ఆదిత్యా!"
నిన్న నేను జవాబు చెప్పని మీ అయిదో ప్రశ్న ఎల్లుండి 'నిన్నయితే వచ్చే ఆదివారం ఈ రోజవుతుంది. మరి మొన్న ఎల్లుండి అయితే ఈ రోజు ఏమవుతుంది? దానికి జవాబు "ఆదివారం" నేను చెప్పలేకపోయిన మీ పదిహేనో ప్రశ్న.... టెల్ హర్ బ్రీఫ్ ఈజ్ లైఫ్ బట్ లవ్ ఈజ్ లాంగ్ అని చెప్పిన కవి ఎవరు అన్నదేగా...? దానికి జవాబు లార్డ్ టెన్నిసన్."
కాగితంలో నుంచి తలపైకెత్తిన ఆదిత్య రెప్పలార్పకుండా ప్రణయని చూశాడు. అదీ క్షణంపాటే.
"నేను ఈ కాగితం రాసింది మీ ముందేగా ఆదిత్యా? నేను గదిలోకి వెళ్ళి ఏం రెఫర్ చేయలేదు."
"ఒప్పుకుంటున్నాను ప్రణయా! మీరు నాముందే రాశారు. రెండు జవాబులూ కరెక్ట్ కాని ఎందుకు కావాలని తెలీదన్నారు?"
"మీ వ్యక్తిత్వం తెలుసుకోవాలని."
"అంటే?"
"మీ ముందు నేను ఓడిపోతే నా నుంచి మీరేం ఆశిస్తారో చూడాలని!"
మ్రాన్పడిపోయాడు.
ఏమిటి ఈమె వ్యక్తిత్వం?
చిరునవ్వుని జీవభాషగా ఆవిష్కరిస్తూ ప్రతి సంఘటనకీ సుతిమెత్తని గుండె చప్పుడ్ని నేపథ్యంగా నిర్వచించి ఓడిస్తుందేం?
క్షణం హసన్మందార మాలగా అనిపించే ఈ ఆడపిల్ల మరుక్షణం జ్వలలా కనిపించి కంగారు పుట్టిస్తుందెందుకని?
ఈ నిఘంటువుని ఇంకా తానెంత చదవాలి?
"ఆదిత్యా" ప్రణయ గొంతులో సన్నని ప్రకంపన ధ్వనించింది "అందరు అమ్మాయిలూ నాలాగే ఆలోచిస్తారో, లేక నేను మాత్రమే ఇలా ఆలోచించాలను కుంటానో నాకు తెలీదు కాని నేను దగ్గర కావాలనుకున్న మిమ్మల్ని అన్ని కోణాల్లోనూ స్టడీచేయాలని ప్రయోగాత్మకంగా చాలా రెచ్చగొట్టానేమో కూడా!"
గగుర్పాటు కలిగినట్లనిపించింది ఆదిత్యకు. నిజానికి అది గగుర్పాటు కాదు. తన మనసులోని అస్పష్టభావాలని ఆమె అందిస్తున్న నిర్వచనానికి కలిగిన అలజడి.
'నేను దగ్గర కావాలనుకున్న మిమ్మల్ని' అంటూ ప్రణయ ప్రయోగించిన వాక్యం అతడినెంత వివశుడిని చేసింది అంటే, ఏకాంత సరస్సులో ఈదులాడే మత్స్యంలా బ్రతికిన ఉద్విగ్నంగా కదిలిపోతున్నాడు.
"ఆదిత్య! మీరేమిటో తెలుసుకున్న నేను నేనేమిటో ఈ క్షణంలో తెలియచెప్పాను."
"థాంక్యూ ప్రణయా!" తల వంచుకునే తన ఆనందాన్ని ఇష్టంలా వ్యక్తం చేశాడు గుసగుసలా.... "థాంక్యూ వెరీమచ్!"
ప్రణయ నెమ్మదిగా కిటికీ దగ్గరకు నడిచింది.
"ఇంత సూటిగా నా మనసులో మాటని మీకు చెప్పినందుకు మరోలా అనుకోకండి ఆదిత్యా! ఈ రోజే ఎందుకు చెప్పాల్సివచ్చింది అంటే, కోరుకున్న మీకే నేను దగ్గర కావాలనుకున్నాను తప్ప కోరని ఒక వ్యక్తికి భార్య కావడం యిష్టంలేక..."
ఉలిక్కిపడ్డాడు ఆదిత్య - "అంటే?"
"ఇంత ఆత్మాభిమానం ప్రదర్శించే ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుందేం.... అనుకోకండి ఆదిత్యా!" సాలోచనగా ఆగింది క్షణంపాటు "ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితులు మనిషిని ఒక్కోసారి చిత్రంగా కట్టిపడేస్తుంటాయి. నేనూ సరిగ్గా అలాంటి స్థితిలో చిక్కుకుపోయాను."
ప్రణయ ఇలా మాట్లాడటం ఆదిత్యకు నచ్చలేదు. అయినా వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు.
"ఎవరతను?"
"రోహిత్.... వరసకి నాకు బావ మాత్రమే కాదు, మా డాడీ నాకు నిర్ణయించిన వ్యక్తి...! నాపైన తొలిసారిగా గెలుపు సాధించిన మనిషి కూడా...!"
ఆ చివరి వాక్యం ఆదిత్యని ఎంత ఆందోళనకి గురిచేసిందీ అంటే ఇక నిగ్రహించుకోలేకపోయాడు.
"గెలుపంటే?"
వెంటనే జవాబు చెప్పలేదు ప్రణయ. నిశ్శబ్దంగా వుండిపోయింది చాలా సేపటిదాకా.
ప్రణయ మొహంలో ఇమ్తఃవరకూ తను చూడని అలసట కనిపిస్తుంటే టెన్షన్ గా ఆమెను సమీపించాడు ఆదిత్య.
ఫాలభాగంపైన పేరుకున్న స్వేదాన్ని తుడుచుకుంటూ వెనక్కి తిరిగింది ప్రణయ.
"ఆదిత్య...! ఇంతకాలం మన పరిచయంలో నన్ను నిశ్శబ్దంగా చదవాలనే ప్రయత్నించారు తప్ప, నా గురించి మీరు అడిగి ఏదీ తెలుసుకోలేదు. కానిఈ రోజు నా అంతట నేనుగా మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను పత్రికాధిపతి చంద్రశేఖర్రావుగారి ఒక్కగానొక్క కూతుర్నని మీకు తెలుసు. చిన్నతనం నుంచి నేను గారాబంగా పెరగటం మాత్రమే కాదు, డాడీ పెంపకంలో నాకు నేనుగా ఎదగాలనీ ప్రయత్నించాను. కాదు, డాడీయే ఎదిగే వాతావరణం కల్పించారు. ఏమాత్రం ఎదిగానో నాకు తెలీదు. కాని ఏదన్నా నాకు నేనుగా ఎన్నుకోవాలనుకునే మానసికమయిన స్థాయికి మాత్రం చేరుకున్నాను."
