అదే అతన్ని పరుగెత్తిస్తుంది.
ఇప్పుడీ వేణు విద్వాంసుడు పరుగెత్తే కారణం అదే!
ఈ ఘట్టాన్ని మానసిక శాస్త్రి సూత్రాలలో విశ్లేషించి అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది రమోలా!
ఎంతసేపు అయినా బండి అలా పరుగెడుతూనే ఉంది.
ఆలోచనలు చాలించి తలఎత్తి చూచిందామె!
పరిసరాలు అన్నీ క్రొత్తగా కన్పించినాయి. ఎటు పోతున్నాడు?
హోటల్స్ కోసం వెదుకులాట అయితే నగరం నడిబొడ్డునే ఉండాలి. ఓ వేళ నగరంలో హోటల్స్ లేవు కాబట్టి ఇంటికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడనుకోవటానికి అది సంజీవరెడ్డి నగర్ కాదు.
ఆలోచనలు పూర్తి ఆయె సమయానికి నగరందాటి వస్తున్నట్లుగా గుర్తించింది రమోలా! తానే పొరపడిందా?
రవంత కంగారు పడింది!
"ఏయ్ మిష్టర్ మనం ఎక్కడికి పోతున్నాం"
"ఖబడ్దార్! నోరు మెదిపావంటే ప్రమాదంలో పడతావు. కదలకుండా కూర్చో" అన్నాడు ఆ యువకుడు కర్కశంగా!
ఆమె బెంబేలు పడిపోయింది. నవ్వులాటకు ప్రారంభించిన అట ఇలా ప్రారంభంలోనే రివర్స్ కొడుతుందని ఆమె ఊహించలేదు.
గుండెలు దడదడ లాడాయి!
క్రిందికి దూకేద్దామనిపించింది క్షణంసేపు!
కాని బండి అపరిమిత వేగంతో వెడుతోంది!
అతడు చాలా సీరియస్ గా కన్పించాడు. మాటలు అనటంలో చాలా క్రూరత్వం ధ్వనించింది. ఏమి చేయాలని ఆమె ఆలోచిస్తూ ఉండగానే అతడు నగరం దాటి మెయిన్ రోడ్డు దిగి ప్రక్కదారి పట్టించాడు!
ఇంక అరచినా అల్లరి చేసినా కేకలు పెట్టినా గోల చేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండని చోటుకి వారు వచ్చారు.
సామాజిక అడవుల మధ్య మాలాలి కొండ ప్రాంతంలో బండి ఆపాడు.
"దిగు" అని గద్దించాడు! అతని ముఖంలో పబ్లిక్ గార్డెన్ లో కన్పించిన అమాయకత్వం కనిపించలేదు. క్రౌర్యం గూడు కట్టుకుని ఉంది.
రమోలాకు శరీరమంతా ముచ్చమటలు పోసినాయి.
సామాజిక వనాలమధ్య నిర్జన ప్రదేశం!
వాటిమధ్య ఒక దిగుడు బావి ఉంది. దాని గట్టుమీద మోటార్ అమర్చి ఉంది. మోటారు నీటిని ఎత్తి పోస్తోంది. పాదులగుండా ప్రవహించి మొక్కల్ని తడుపుతోంది నీరు.
అది చూస్తే అక్కడ ఎవరయినా ఉండవచ్చు అని ఆశ చిగురించిందామెకు.
ముందుకు నడువు! అల్లరి చేయటం ఎదురు తిరగటం లాంటివి జరిగితే ప్రాణం తీస్తాను అన్నాడు. రమోలా గుండె నీరయిపోయింది.
సైకాలజీమీద రిసెర్చి స్టడీ ఎగిరి ఎటుపోయిందో తెలియదు. కన్నీరు పొంగి చెంపలు మీదుగా జారాయి. పెదవులు పాలిపోతున్నాయి.
"నన్నెక్కడికి తీసుకుపోతున్నావు?" అంది పొడారిన కంఠస్వరంతో?
"ఇక్కడ చెప్పింది చేయటమేకాని ప్రశ్నించేందుకు అవకాశం లేదు. మాట్లాడేందుకు ప్రయత్నించకు మక్కెలిరిగిపోతాయి" అని ఉరిమాడు.
రమోలా మరింక మాటాడక ముందుకు నడిచింది.
దిగుడుబావి గట్టుమీద చిన్న పాక వుంది.
పొలాలకు నీరుపెట్టే మనిషిలా తల పాగాతో ఒక వ్యక్తి కన్పించాడు. ఈ క్రొత్తగా వచ్చిన యువకుణ్ణి చూడగానే అతడు లేచి నిలబడ్డాడు.
"ఇంత ఆలస్యం చేశావేం?" అన్నాడు.
"పని ఇప్పటికి పూర్తి అయింది" అన్నాడు యువకుడు.
"మన వాళ్ళని పైకి రమ్మను! ఎక్కువ సమయంలేదు అన్నాడు. పొలాలకు నీరుపెట్టే వ్యక్తి తలపాగా చుట్టుకుని ఒంటినిండా తడిమట్టి రాచుకున్న యువకుడు.
వాలకం చూస్తే అతనే వారి నాయకుడు అనిపించేలా వుంది మాటల ధోరణి!
యువకుడు అతని ఆదేశాన్ని అందుకుని దిగుడుబావి గట్టుకు పరుగెత్తాడు. చిన్న విజిల్ అందించాడు.
బిలబిలమంటూ అయిదారుగురు యువకులు బావిలోపల నించి పైకి ఎక్కి వచ్చారు. ఈ తతంగమంతా చూసి నిర్ఘాంతపడిపోయింది రమోలా!
వారంతా బావిగట్టున పాకలోకి వచ్చారు.
అందరి దగ్గర భయంకరమైన ఆయుదాలున్నాయి.
ఒక చాక్లెట్ రేపర్ లో చుట్టిన చిన్న వస్తువు ఆమెకు అందించాడు నాయకుడు. అప్రయత్నంగానే దాన్ని చేతుల్లోకి తీసుకుంది రమోలా!
"అది త్రీ టన్స్ ఎనర్జీ కలిగిన బాంబు" అంటూ చెప్పటం ప్రారంభించాడు. నెత్తిమీద పిడుగు పడినట్లుగా అనిపించింది. తేలిపోతున్న చూపుతో దాన్ని పరిశీలించింది, అది రేపర్ లో చుట్టి చాక్లెట్ లాగే ఉంది!
చిన్నపిల్లలకి యిచ్చి "పాపా చాక్లెట్ తిను" అంటే ఎవరయినా నిర్భయంగా తీసుకునేందుకు సహజంగా చుట్టి ఉంది. అది అరచేతిలో పెట్టుకుని అందరికీ కన్పించేలా పట్టుకున్నా ఎవరికీ ఎలాంటి అనుమానం రాదు.
ప్లగ్ లో వ్రేలు పెట్టినదాని లాగా మనసులోపలే గిలగిలలాడి పోయింది.
అనవసరంగా కాలక్షేపానికి వినాయకుడి బొడ్లో వ్రేలు పెడితే తేలు కుట్టినట్లుగా ఉంది పరిస్థితి! చేజారిపోయిన తరువాత తనని చూచి ఎవరు మాత్రం జాలి పడతారు. కావాలని పోయి నెత్తిమీదికి ఎక్కించుకున్న తద్దినం ఇది!
ఇదేదో బాంబుల వ్యవహారం!
బహుశా వీరు టెర్రరిస్టులు అయి వుండాలి.
ప్రాణాలకే మోసం వచ్చింది. తనచేత ఏ ఘోరం చేయించాలని వీరు తన చేతికి మూడుటన్నుల పవర్ కలిగిన ఎక్స్ ప్లోజివ్ ఇచ్చారు?
దాంతో యాభై మీటర్ల డయాలో ఉండే నలభయిమందిని అవలీలగా చంపవచ్చు! తనని బలవంతంగా మానవ బాంబుగా మార్చి ఎవరిమీదకో ప్రయోగించాలని చూస్తున్నారు.
దాన్ని చూస్తేనే గుండె దడగా ఉంది బాబోయ్! ఏ క్షణంలో ప్రేలుతుందో!
"చూడమ్మా! ఇది చాలా శక్తివంతమయిన బాంబు. నీకు ఎలాంటి ప్రాణభయం లేకుండా చెప్పిన చోటుకి చేర్చితే నువ్వు సురక్షితంగా వెళ్ళిపోవచ్చు. ఆ తరువాత నీ గురించి ఎవరూ పట్టించుకోరు.
కాని యిప్పుడు మేము యిచ్చే చిన్ని షెడ్యూలుని నువ్వు తు.చ. తప్పకుండా అమలుపరచాలి! అదొక్కటే నీ బాధ్యత!!
యూ సీ!! వీరు నిన్ను ఒకచోటుకి తీసుకుపోతారు.
అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అది అనాధఆశ్రమం.
పిల్లలకు చాక్లెట్స్ పంచేందుకు ఒక ప్రముఖుడు వస్తాడు.
నువ్వు దీనితో వారికి వీలయినంత దగ్గరకు వెళ్ళి అక్కడ దాన్ని వదిలేసి ఇవతలికి రావాలి! ఎవరికీ అనుమానం రాకూడదు. ఆయన ఒక సైంటిస్ట్! మా వాళ్ళు కాంపౌండు ఇవతల చెట్లమీద కొమ్మల్లో దాక్కుని ఉంటారు. అక్కడ జరిగేదంతా బైనాక్యులర్స్ లో చూస్తుంటారు.
నువ్వు సక్రమంగా దాన్ని అక్కడ ఉంచవలసిన చోటున ఉంచి సక్సెస్ ఫుల్ గా తిరిగి వస్తావనుకో! ఏమీ ప్రమాదం ఉండదు నీకు.
ఎవరికయినా చెప్పాలని ప్రయత్నించినా, సక్రమంగా ఉంచవలసిన చోటున ఉంచకపోయినా వెంటనే నీ చేతిలో ఉండగానే రిమోట్ కంట్రోలర్ లో బటన్ నొక్కేస్తారు. డిబాస్టర్ జరుగుతుంది. సైంటిస్ట్ మరణిస్తారు. నువ్వు చనిపోతావు.
ఆ డిబాస్టర్ రేంజిలోంచి నువ్వు బయటపడి ప్రాణం దక్కించుకోవాలంటే దాన్ని చెప్పిన చోట ఉంచి మౌనంగా తిరిగి రావటమే దారి!
ఇది చాక్లెట్ కాబట్టి అక్కడ పిల్లలు పెద్దలు అందరి చేతుల్లోనూ అవే ఉంటాయి కాబట్టి సెక్యూరిటీవారు చూచినా వెంటనే అనుమానించరు.
ఈ పని చేయటానికే నిన్ను తీసుకు వచ్చాం! మనస్పూర్తిగా అయినా సరే! బలవంతంగా అయినా సరే ఈ పని నీవు చేయాలి. తప్పదు" అంటూ ఆమె కార్యక్రమంతోపాటు ఎదురు తిరిగితే ఏమవుతుందో కూడ వివరించాడు నాయకుడు.
ఏడ్చినా ప్రయోజనం ఉండని చోటు అది!
ప్రతీకారం కోసం కక్షలు సాధించటం కోసం అనాధ శిశువుల ప్రాణాలు బలిపెట్టటానికి వెనుకాడని కిరాతకులు! కాదంటే తనని ఊదేయటానికి అరక్షణం కూడ పట్టదు వాళ్ళకి. తల ఊగించింది రమోలా.
పార్కులో పరిచయం అయి తనని తీసుకు వచ్చిన యువకుడు ఆమెను చూచి నవ్వాడు. తిరిగి తన వాహనం మీదికి ఆహ్వానించాడు.
"పని పూర్తి అయింతరువాత గార్డెన్ బార్ లో కాఫీ త్రాగటానికి నాకు అభ్యంతరం ఏమీ ఉండదు" అన్నాడు. అతనితోనే బయలుదేరింది రమోలా!
వాహనం రోడ్డుకు దగ్గరగా ఉంది.
అక్కడివరకూ నడవాలి! దారిలో ఈ ఉచ్చునుంచి బయటపడే మార్గం ఒక్కటి అయినా దొరక్కపోతుందా అని భావించింది. కొద్ది ఆశ కలిగింది.
"నువ్వు ముందు నడువు! ఈ రైఫిల్ చూచావు కదా! ఇది కంప్యూటర్ మెకనైజ్ డ్! సెకనుకు నాలుగు చొప్పున అరనిముషంలో నూట ఇరవై బుల్లెట్స్ రిలీజ్ చేయగల అధునాతన గన్! దీన్ని పట్టుకుని నేను నీ వెనుక నడుస్తాను.
కనురెప్పపాటులో జరిగే ప్రతి కదలికని గమనిస్తూ ఉంటాను.
నాకు అనుమానం వచ్చిందనుకో!
అరనిముషం ఇది గర్జిస్తుంది. నూట యిరవై బుల్లెట్స్ నీ శరీరాన్ని జల్లెడలాగ తూట్లు తూట్లు చేస్తుంది. అండర్ స్టాండ్!?"
అవునని భయంగా తల ఊగించింది రమోలా.
చేతిలో బాంబు! వెనుక అధునాతన అగ్నివర్షం కురిపించే రైఫిల్!
