Previous Page Next Page 
పరిహారం పేజి 33


    నెమ్మదిగా క్రిందికి దూకి పరుగుపుచ్చుకుంది పారిజాత.
    మంగమ్మకు నిలబడి నిలబడి కాళ్ళు పీక్కుపోసాగాయి.
    "ఓ పారిజాతమ్మా! ఇంకా ఎంతసేపు? తొందరగా రా. అవతల లగ్నం గడియ వచ్చేస్తున్నది!"
    పిలుపుకు సమాధానం రాకపోయేసరికి మంగమ్మ లోపలికి తొంగిచూసింది. ఒక్కవెర్రికేక పెట్టింది. "ఎక్కడ మయమయ్యావే పారిజాతమ్మా? నాతల తీసేసేలా చేశావు కదే! ఓ దేవుడో! ఇంక నేనేం జేతురో?"
    మరునిమిషం ఆ ఇల్లు అరుపులతో నిండిపోయింది.
    "వెతకండి. జుట్టుపట్టి ఈడ్చుకురండి. సందుకో యిద్దరు పరిగెత్తండి" హెచ్చుస్థాయిలో వినిపించింది కామమ్మ కంఠం.
                               13
    మనోహర్ స్కూటర్ కోమలమ్మ కాంపౌండును సమీపిస్తున్నది.
    గేటుముందు అప్పుడే పారిజాత రిక్షా దిగుతోంది.
    "ఓ! పారూ?" చిరునవ్వుతో పలుకరించాడు మనోహర్ స్కూటర్ ఆపి.
    "రిక్షాకు డబ్బులిచ్చేసి పంపు మనూ! లోపలికివచ్చి లలితను అడిగి ఇస్తాను" ఎక్కడో నూతిలోంచి వస్తున్నట్టుగా ఉన్నాయి మాటలు.
    నుదుట కళ్యాణ తిలకం, కాళ్ళకు పారాణి - పెళ్ళి కూతురు అలంకరణలో పారిజాతను వింతగా చూశాడు.
    "ఏం పారూ? అలా ఉన్నావేం?" మనోహర్ కంగారుగా అడుగుతూనే ఉన్నాడు.
    పారిజాత తూలింది.
    మనోహర్ మెరుపులా ముందుకు వచ్చి ఆమెను చేతుల మీదకు ఎత్తుకున్నాడు. ఆలస్యం చేయకుండా గబగబ తమ ఇంటికేసి నడిచాడు.
    అదృష్టవశాత్తూ ఎవరి వాటాల్లో వాళ్ళుండి ఈ దృశ్యాన్ని ఎవరూ చూడలేదు. కోమలమ్మ కూడా అప్పుడు ఇంట్లో లేదు. ఎవరింటికో వెళ్ళింది.
    తన పక్కమీద పారిజాతను పడుకోబెట్టాడు మనోహర్ ముఖంమీద నీళ్లు చిలకరించి ఫాన్ వేశాడు.
    చాలా సేపటి వరకు చైతన్యం లేని దానిలా అలాగే పడి వుంది.
    కాళ్ళకు పారాణి, ముఖాన కళ్యాణ తిలకం చూశాక మనోహర్ తేలిగ్గానే గ్రిహంచగలిగాడు. పెళ్ళి పీటల మీద నుండి పారిపోయి వచ్చిందని.
    పారిజాత నెమ్మదిగా కళ్ళు తెరిచింది.
    "కామమ్మ అత్త రాలేదూ?"
    "ఉహుఁ. ఎవరూ రాలేదు లేచి కూర్చో"
    గుమ్మం దగ్గరికి వచ్చి తొంగిచూస్తున్నట్టుగా నిలబడ్డ వంట మనిషి కేసి చిరాకుగా చూసి, ఒక కప్పు వేడివేడి టీ తీసుకురా!" అని పురమాయించాడు మనోహర్.
    "ఊఁ ఇప్పుడు చెప్పు పారూ! ఏం జరిగింది?"
    "ఆకలేస్తోంది మనూ! మొన్నటి నుండి నేను పచ్చి మంచి నీళ్లుకూడా ముట్టలేదు. పదహారు పద్దెనిమిది మైళ్ళు నడిచి నడిచి కాళ్ళు వాచిపోయాయి."
    మనోహర్ చప్పునలేచి, "క్రిందికి రాగలవా?" అని అడిగాడు.
    "ఉహు వ్రేలు కదపటానికి కూడా నాకు చాతకావడం లేదు."
    మనోహర్ భోజనం పైకి తెప్పించాడు.
    పారిజాత ఆవురావురుమన్నట్టుగా తింటూంటే మనోహర్ కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు నిలిచాయి. ఈ పిల్ల పట్ల తనెంత నిర్దయుడైపోయాడు! తనను మేనత్త బారి నుండి రక్షించి తీసుకు పొమ్మని ఎంత దయనీయంగా ప్రార్ధిస్తూ వ్రాసింది! రజనిని పెళ్ళాడే ఉత్సాహంలో తను పారిజాతను మరిచి పోడానికే నిశ్చయించుకొన్నాడు. తన జీవితంలో ఆ పిల్లను ముడిపెట్టుకోకపోయినా కనీసం మనవతా ధర్మంతో నైనా వెళ్ళి వాళ్ళ మేనత్త చేతులనుండి రక్షించి తీసుకురావలసినమాట!
    "అబ్బ! బ్రతికించావ్ మనూ" అలసటగా అంది.
    "పెళ్ళి పీటల మీదినుండి పారిపోయి వచ్చావా?"
    "పీటలమీది నుండి కాదు. మరుగు దొడ్డిలోంచి" నీరసంగా నవ్వింది.  "ఇంకేం చేయను? నువ్వొచ్చి నన్ను తీసుకు వస్తావనుకొన్నాను. ఎంత ఎదురు చూశాను! కళ్ళు కాయడమంటే ఏమిటో నా కప్పుడే తెలిసింది"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS