మెల్లమెల్లగా అపస్మారకం క్రమ్మింది ముసలాయనకు. అందరినీ పేరు పేరునా అడుగుతున్నారు గాని ఎవరినీ గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడో అప్పుడో అన్నట్లుగా ఉంది పరిస్థితి. కోడలు అందరిచేతా పాలు పోయించింది ఆయన గొంతులో. చిన్నపిల్లలు ఆకలి గొంటారన్న ఉద్దేశ్యంతో త్వరత్వరగా వంటచేసి పిల్లలందరికీ పెట్టేశాడు వంట బ్రాహ్మడు.
రెండు గంటలసేపు ఆయాసపడ్డాడు గోపాలదేవులు. కడుపు ఎత్తుగా ఎగిరిపడినట్లయి ముఖమంతా పిండుకొన్నారు. కళ్ళు పైకిఉబికాయి.
"నాభి పెరిగింది" అన్నారెవరో?"
కలిపి సిద్ధంగా ఉంచిన శ్రీపాదతీర్ధం తండ్రి గొంతులో పోసింది కృష్ణవేణి."
కొడుకు, దేవదాసి "గోవింద గోవింద" అన్నారు ఆయన చెవులదగ్గర.
అంతసేపూ ఎగిరెగిరి పడుతూన్న కడుపు నిశ్చలంగా ఆగిపోయింది. కళ్ళనుండి జీవుడు వెళ్ళిపోయాడు. గోవిందనామస్మరణ వింటూనే కళ్ళు దగ్గరికి మూశారు సూర్యదేవులు.
"తిధి ఏమిటో?"
"ఏకాదశి ఘడియలు పడ్డాయి. పుణ్యలోకాలకు పోయాడు."
ఎవరూ కంటనీరు పెట్టలేదు అది శ్రీలక్ష్మి ఆజ్ఞ. "పండిన పండు రాలిపోతున్నది అనుభవించాల్సిందంతా అనుభవించి పరమాత్ముని పిలుపందుకొని వెళ్ళిపోతున్నారు, ఏడవకండి మీరెవరూ. ఒక్కొక్క కన్నీటిచుక్క ఒక్కొక్క నరకం సృష్టిస్తుందట ఆ జీవికి అని చెప్పింది ముందే.
కృష్ణవేణి దుఃఖం నిగ్రహించుకోలేక అక్కడినుండి లేచి వెళ్ళిపోయింది.
వాకిట్లో పిడకలు రాజవేశారు. ఇంట్లో శవాన్ని ఎక్కువసేపు ఉంచే అవసరం లేకపోయింది. మనుషులు అటు యిటు పరుగెత్తి గంటలో అన్ని సిద్ధం చేశారు. శవసంస్కారం జరిపించడానికి ఆహ్వానించబడ్డ బ్రాహ్మణుడు మంత్రాలు ఉచ్చరిస్తూంటే గోపాలదేవుల భౌతికకాయాన్ని వెలుపలికి తీసుకువచ్చి, ఇపుడు కూర్చోబెట్టి నీళ్ళుపోశారు బట్టలు విడిపించి పట్టుదోవతి చుట్టబెట్టి, పట్టు ఉత్తరీయం కప్పారు బుజాలమీద. ముఖాన తిరుమణితో రెండు తెల్లనామాలు, మధ్య తిరుచూర్ణం కలిపి ఎర్రనామం తీర్చారు. తులసీదళాలు రెండు, చెవులమధ్యనుంచారు.
"ఎంత చక్కగా వచ్చిందో చూడండి చావుకళ!" చూడవచ్చిన జనం మధ్యనుండి అన్నానెవరో.
"తాతయ్య నవ్వుతున్నాడు, నాన్నా!" అంది దేవదాసి, వస్తున్న ఏడుపు గొంతులోనే అణచుకొంటూ.
పాడెమీద బిగించారు శవాన్ని.
"తాతయ్యకు ఆయికాదూ, నాన్నా?" సువర్ణ ప్రతిమ వెనక పిల్ల అమాయకంగా అడిగింది.
"ఈ చిన్న పిల్లల్ని లోపలికి తీసికెళ్ళండి" అన్నారు సూర్యదేవులు.
"గోవింద..... గోవింద......" వాహనం లేచింది.
పెళ్ళి తాంబూలాలు పుచ్చుకొందామని వచ్చిన పెళ్ళిపెద్దలు శవవాహకులుగా ఉపయోగపడ్డారు. విధి విపరీతక్రీడ!
గోపాలదేవులు వేయించిన మామిడితోటలోనే ఆయన కాష్టం సిద్ధం చేశారు. గర్భిణీగా ఉండటం వల్ల శ్రీలక్ష్మి, నాన్నను కాలబెడుతూంటే చూడలేనని కృష్ణవేణి రాలేదు. దేవదాసి, సువర్ణ ప్రతిమ మాత్రం వచ్చారు బండిలో.
సూర్యదేవులు వణుకుతున్న చేతుల్తో అగ్ని రగుల్కొల్పారు కిరసనాయిల్ భగ్గునమండి కాష్టంలోని శవాన్ని నిర్దయగా దహించసాగింది.
దేవదాసి నిశ్చలంగా నిలబడి చూస్తున్నది 'చీమ చిటుక్కున్నకూడా కెవ్వుమనే సున్నిత దేహం' మంటలకు చురచుర పొంగుతూ అగ్నితో దహింపబడుతున్నా ఏ బాధా అంటడంలేదు. ఆ జీవుడిని! తాతయ్య ఎక్కడున్నాడిప్పుడు? అన్ని రాగబంధాలను త్రెంచుకొని అతీతుడైపోయాడు జీవుడు అందుకే యోగులు చెబుతారు - ఈ ప్రపంచమొక నాటక రంగమని, కొన్ని జీవులు పాత్రలు ధరించి కొద్దిసేపు ఆట నడిపించి రంగంనుండి నిష్క్రమిస్తాయని! జన్మ అన్నది ఒక సంకల్పమంటాడు బావ!
"అక్కా, తాతయ్య కాలిపోతున్నాడే!" అక్కను చుట్టేసి బావురుమంది సువర్ణప్రతిమ.
"అమ్మా, మీరిక బావిలో మునిగి ఇంటికి వెళ్ళండి." ఒక పెద్దమనిషి చెప్పాడు.
చల్లగా, నీటిలో మూడు మునకలువేసి తడిబట్టల్లోనే వచ్చి కూర్చున్నారు బండిలో, అక్కచెల్లెళ్ళు.
"తాతయ్య లేడు, ఆ ఊహతో గుండేదో బలంగావచ్చి గుండెకు గ్రుద్ధినట్లనిపించింది దేవదాసికి" మధ్యాహ్నం వేళల్లో ఎవరికి నదివి వినిపించను భారత భాగవతాలు?
నా పెళ్ళి కళ్ళచూడాలని రుక్మిణీకళ్యాణం చదివించావే? నా పెళ్ళి కళ్ళచూడకుండానే ఎందుకు వెళ్ళిపోయావు. తాతయ్యా?' పొంగి పొంగి వచ్చింది మనసులో దుఃఖం. మోకాళ్ళ మధ్య ముఖం దించుకొని ఏడవసాగింది.
* * *
