Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 33


    "ఈ దృష్టితో చూసినప్పుడు ఇదే సమంజసమనిపిస్తుంది. కాని, కాపురం కాపురమని ఇదైపోతున్నారే, అది ఎటువంటి కాపురం? చీత్కారాలు, చెప్పుదెబ్బలు, కట్టుబానిసకన్నా హీనంగా చూడబడడం -ఇంత హింసనూ, ఇంత కిరాతకాన్ని భార్య  అయిన పాపానికి  భరించాలా? ఇంత అవమానకరమైన బ్రతుకునుండి, క్షణం క్షణం నరకాన్ని కల్పించే బ్రతుకు నుండి ఆమెకు విముక్తి కలిగించాలని ఎందుకు అనుకోరు? ఆమె బ్రతుకు ఆమె బ్రతికే అవకాశాన్ని కల్పించాలని ఎందుకు ఆలోచించరు?"

    "ఆమె బ్రతుకు ఆమె బ్రతకడంలోనే చాలా కష్టాలు వుంటాయమ్మా! ఇప్పుడు మగడన్న వాడివల్ల ఒక్కటే కష్టం! ఆ మగణ్ని కాదని వస్తే ఈ మగవాళ్లంతా కీచకులూ, ఆడవాళ్లంతా అత్తలూ, ఆడబిడ్డలూ అయ్యి కాల్చుకు తినడం ప్రారంభిస్తారు. నువ్వింకా చిన్న పిల్లవు.  అనుభవం వేరు. కూర్చోని  ఏదో ఆలోచించడం వేరు" అని ఆమె లేచింది. హేమలత  చేతులు పట్టుకొని "ప్రమీల మీ కూతురనుకొని ఓకంట చూస్తూ  వుండండి! నాకు మీ ధైర్యమే ఎక్కువగా వుంది!" అని  కళ్లు ఒత్తుకుంటూ సెలవు తీసుకు వెళ్లిపోయింది.

    హరితకు చెప్పలేనంత వ్యధగా, కోపంగా వుంది. "కన్నతల్లి కదా. చూస్తూ చూస్తూ కూతుర్ని పులిబోనులో ఎలా వదిలేసి పోయిందో చూడు స్త్రీల ఇన్ని హత్యలూ, ఆత్మహత్యలూ జరుగుతున్నాయంటే, ఇలాంటి చాదస్తపు మనుషులవల్లే?వీళ్ల ముర్ఖత్వాన్ని ఆసరాగా తీసుకుని ప్రమీల భర్తలాంటి వాళ్లు చెలరేగిపోతున్నారు!" అంది నిస్పృహగా.



                       *    *    *    *



    వారం రోజుల తర్వాత ఒకనాడు ఎదురింట్లో పని చేసే లక్ష్మి వచ్చింది.
 
    "మీ పక్కింట్లో వుండే లక్ష్మీకాంతం సారు, పెళ్లాన్ని ఇంట్లో పెళ్లి తాళం వేసి పోయాడు బడికి. పిల్లకు పాలు లేవంట. కిటికీకాడ నిలబడి ఒకటే ఏడుపు ఆయమ్మ పాపం. మీకాడ కాసిన్ని పాలుంటే పోయించుకురమ్మంది."

    "ఇంట్లో ఆమె అత్తలేదా?"

    "కూతురుకాడి కెళ్లిందట!"   

    వారం రోజులు ఇదే విధంగా గడిచాయి. ఇరుగు పొరుగు వింతగా, వినోదంగా చెప్పుకొంటున్నారు. లక్ష్మి కాంతం సారు బడికి వెళ్ళేప్పుడు భార్యని ఇంట్లో వుంచి తాళం వేసుకుని వెళుతున్నాడని. కాని, ఒక్కరూ 'ఇదేం చెర ఆడపిల్లకు' అని అడిగిన పాపాన పోలేదు.
 
    కాని హరిత మాత్రం ఊరుకోలేకపోయింది. డౌరీ డెత్ కమీటి మెంబర్లను కూడగట్టుకొని ఒకరోజు వచ్చి పడింది.
 
    జానకి అనే ఆమె తనని తాను పరిచయం చేసుకొని, తన తోటి సభ్యునలు పరిచయం చేసింది. తాము ఎందుకు వచ్చారో సూటిగానే చెప్పింది.

    లక్ష్మీకాంతం తొణకలేదు. సీరియస్ గా ముఖంపెట్టి చెప్పాడు. "నేను కొడతాను.... తిడతాను కాని ఊరికేతిట్టాలనీ, కొట్టాలనీ కాదు. ఏదో తప్పు చేస్తేనే కొడతాను చేసిన తప్పు చాలక మళ్లీ ఎదురు మాట్లాడుతుంది. నాకు కోపం వస్తుంది. కొడతాను. మీకు చేతనైతే భర్త మనసు తెలిసి, అతడికి కోపం రాకుండా మసలుకొమ్మని చెప్పండి. తన్నులు తప్పుతాయి."

    "ఇంట్లో  పెట్టి తాళం వేసి వెడతావట! గొడ్డనుకొన్నావా? గోదనుకొన్నావా?"

    "చెప్పకుండా పుట్టింటికి ఉడాయించడం నేర్చుకుంది. నేను బయటికి వెళ్లగానే తను హఠాత్తుగా ఇంట్లోంచి మాయమైపోతే నేనెంత ఇదైపోవాలి? ఏ బావిలో పడిందో ఏ రైలు పట్టాలమీద తలపెట్టిందో అని నేను ఇదై పోవాల్సిందే కదా? అందుకే ఇంట్లో వుంచి తాళం వేసి వెడుతున్నాను."

    "చెప్పకుండా ఉడాయిస్తానని కాదండీ! తానులేని  సమయంలో ఏ మగాడితో ప్రేమాయణాలు సాగిస్తానో, లేక  ఇరుగుపొరుగులతో తమ మీద చాడీలు చెబుతాననో అనుమానం. కనీసం  ఆడవాళ్లతో కష్టసుఖాలు చెప్పుకోవడం కూడా ఓర్వలేనంత అల్పబుద్ది మనిషండీ!" ఏడుస్తూనే చెప్పింది ప్రమీల భర్త కేసి మండుతున్న కళ్లతో చూస్తూ.

    "ఇంట్లో లక్ష విషయాలుంటాయి. అవన్నీ బయట వాళ్లతో చెప్పుకోవచ్చా? మగణ్ని లోకువచేస్తే తనకు పరువు పెరుగుతుందా? ఈ మనిషి ప్రతిదీ బయట చెప్పుకొనే అల్పబుద్ది  వుంది కాబట్టే బయటికి వెళ్లకుండా కట్టడి చేయాల్సి వస్తుంది." అన్నాడు భార్యకేసి గుర్రుగా చూస్తూ లక్ష్మీకాంతం.

    "విన్నారు కదండీ, ఆయన ఉద్దేశ్యం? పశువులా బాదినా లోపలే కుక్కుకోవాలిగాని బయట ఎవరికీ చెప్పుకోకూడదు. ఈయనకి పరువు తక్కువ. అంత పరువు తక్కువ అనుకొన్నవాడు నన్ను ఎందుకు కొట్టాలి? ఎదురు మాట్లాడకూదట. అర్దం పర్దం లేకుండా తిడితే ఎంత కాలమని నోరుమూసుకొంటాను? నోరు మూసుకోడానికి గొడ్డును  కాదే. నాకూ ఒక మనస్సుంది. అభిమాన ముంది. ఈయనకు నన్ను మావాళ్లు భార్యగా పంపించారుగాని బానిసగా కాదే. అసలీయనకు కోపం ఎందుకు వస్తుందో చెప్పనాండీ! పప్పులో ఉప్పు తక్కువైతే, కూరలో కారం ఎక్కువైతే, అమాంతం పళ్లెం ఎత్తి ముఖాన  విసురుతారు. చిన్న తప్పును కెలికి కెలికి బ్రహ్మాండంగా మార్చివేయగల చతురులు. ప్రతి నిమిషం నన్ను నలుచుకు తినడం తప్పితే మరో పనిలేనట్టుగా వుంటారు! ఏ తప్పు పట్టడానికి లేకపోతే నా పుట్టింటి చరిత్ర అంతా కెలుకుతారు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS