మన హక్కుల్ని నాశనం చేస్తామంటే నేను సహించను. వాటిని రక్షించుకోడానికి నేను పోరాడతాను" అని శ్రీశ్రీగారు చెప్తూ వుంటే...
"ఏమిటండీ మీ ఆవేశం? మీరు పోరాటాల్లో పాల్గొంటారా?" అని అడిగాను.
"అంటే నీ ఉద్దేశం ఏమిటి? నేను కత్తులూ, కటార్లూ పట్టుకోలేను సరోజా! నేను కవిని. నా ఆయుధం కలం. దానితోనే పోరాటం సాగిస్తాను" అన్నారు.
"ఏవండీ ఒక చిన్న సందేహం. పానకంలో పుడకలా వచ్చానని అనుకోకండి. కవి అంటే అర్ధం_రాసేవాడని నాకు తెలుసు. కానీ దానికి మీరిచ్చే సమాధానం వేరే ఏదైనా వుందా" అని అడిగాను.
"అర్ధం ఏదైనా కవి అన్నవాడు మాత్రం కష్టజీవికి రెండువైపులా నిలిచేవాడుగా వుండాలని మాత్రం అంటాను సరోజా! అది సరేగానీ...నువ్వేమిటి ఇలా ప్రశ్నలు వెయ్యడం ప్రారంభించావు?" అని అడిగారు.
"అది కాదండీ మీ మాటల ధోరణి వింటూ వుంటే ఎన్నో అడగాలనిపించినా, వినే కుతూహలంతో అడగదలచుకున్న వాటిని మరచిపోతున్నాను. అందుకనే జ్ఞాపకం వచ్చినప్పుడే అడిగేసి తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాను.
ఏవండీ! నేను మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత మీ కవిత్వానికి నావల్ల ఏదైనా అంతరాయం కల్గిందేమోనని అప్పుడప్పుడు బాధపడుతూ వుంటానండి. నా వల్లే మీరు ఈ సినీప్రపంచంలో కూరుకుపోయారని, సినిమాకి అమ్ముడుపోయారని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నట్టు విన్నాను_" అని చెప్పాను. నా మాటకు ఆయన. "నీకెన్నిసార్లు చెప్పాలి సరోజా! లోకులు కాకులు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. మనమేం చెయ్యలేం. నువ్వు బాధపడితే వాళ్ళు అనడం మానేస్తారా? అంతెందుకు? నువ్వీ ఫీల్డుకిచ్చిన కొత్తలో మనల్ని ఎంతమంది ఎన్ని అనలేదు?
నువ్వు రాకముందే నేను ఈ ఊబిలో ఇరుక్కుపోయాను. బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి. ఏదైతే ఏమిటి? ఇది మాత్రం పని కాదా? ఇందులో వుండి మన లక్ష్యాన్ని సాధించలేమా? పైగా సినీ ప్రపంచానికి అమ్ముడుపోవడం అన్నమాట నేను ఒప్పుకోను. ఎవరూ ఏ ఉద్యోగానికీ అమ్ముడుపోలేదు.
అమ్ముడుపోవడం, కొన్నుక్కోవడం అన్నది సినిమాలకే పరిమితంకాలేదు. సినిమాను తిట్టి ప్రయోజనంలేదు. దాన్ని ఆయుధంగా వాడుకోవాలి.
సినిమా ద్వారా అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సినిమాను ఒక ఆయుధంగా గుర్తిస్తే ఇతర కళలన్నిటికంటే అది ప్రత్యేకమైనది విలక్షణమైనది.
కవిగాకన్నా డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా వుంటే ఇంకా మంచిది. నాకుమాత్రం ఇందులో పాతుకుపోవడం ఇష్టమా? నేనూ ఈ ఊరిలో నుండి బైట పడాలనే అనుకుంటున్నాను. లేకుంటే కెరటాలు ఆగిన తర్వాత స్నానం చేస్తానన్నట్టుగా వుంటుంది.
ఏం చేస్తాం_ఈ పని వదిలేసినా మరోపని ఏదయినా చెయ్యాలిగా. వేరే పనిలో ఇంతడబ్బు ముడుతుందా? మనం, మన పిల్లలు బ్రతకాలిగా. ఏ పనయితే ఏంలే అన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం ఇందులో కాలక్షేపం చేస్తున్నాను.
అదీగాక, నా కవిత్వానికీ, సినిమాకీ ఏమిటి సంబంధం ? నేను ఇందులో వుంటూ మానేశానా? ఆ ఆరోపణ ఆధారరహితం. నేను అంగీకరించను. కొత్త రచనలు చేస్తూనే వున్నాను.
నిజమైన లక్ష్యవాది ఏ వృత్తిలో వున్నా అతడనుకున్నదానికి, చెయ్యదలచుకున్నదానికి, చెప్పదలచుకున్నదానికి ఆ వృత్తి ఎంతమాత్రం అడ్డుకాదని నేను ఘంటాపధంగా చెప్పగలను.
రచయిత తన రచనలమీద బ్రతికే పరిస్థితి ఇంకా రాలేదు సరోజా! రచయితయినా, కళాకారుడయినా ఎవడి కాళ్ళమీద వాడు నిలబడగల గాలి. ఆర్ధిక ఇబ్బందులు లేకుండా బ్రతకగలగాలి.
నా గ్రంథాలమీద నేను బ్రతకలేకపోతున్నాను. నేను ఈ మాత్రం అయినా పాటలు రాయకుంటే మన పొయ్యిలో పిల్లులు కాపురం పెడతాయి. ఈ ఊబిలో నుండి బయట పడాలనే ఆవేదన నాకూ వుంది.
అయినా_సినిమా మీద చిన్న చూపుగలవాళ్ళను నేను సమర్ధించను. సినిమా అనేది కళలయొక్క సముదాయం. అందులో కూడా చాలా వరకు నా దృక్పథం నుంచే రాస్తున్నాను.
నేను ఎప్పటికయినా మంచి సినిమా తీయగలననే ఆశ ఇంకా చావలేదు. పోతే_ఎంతవరకూ నెగ్గుతానో మాత్రం చెప్పలేను.
నేననుకున్న పిక్చర్ తియ్యాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా పురిట్లోనే సంధి కొట్టేస్తోంది. ఒక్కటి మాత్రం జ్ఞాపకం వుంచుకో సరోజా! నేను సినిమాలో వుంటూ కవిత్వానికి దూరమై పోయానని అనుకుంటున్న వాళ్ళ మాటలు విని నువ్వు బాధపడిపోనక్కరలేదు.
ఇప్పటికి కూడా డాక్టర్ పని చేస్తూనో, లేక బ్యాంకులో ఉద్యోగం చేస్తూనో, ప్లీడర్ గా వుంటూనో... మొత్తంమీద ఏదో ఒక వృత్తిలో వుంటూ రాయడమే తప్ప,రచయితగా బ్రతికే అవకాశాలు, పరిస్థితులు లేవు.
నేను కవిని. కలంతో కదులుతున్న వాడిని. నేనేమిటి రాస్తున్నానో చూడు. ఆర్ధిక వ్యవస్థమీద అటాక్ చేస్తే సమస్యే లేదు.
కుటుంబరావుగారు కూడా సినిమా రచనలు చేశారు. కథలూ రాశారు. డైలాగులూ రాశారు. అయినా వారికి సుస్థిరమైన జాబు దొరికిందికాబట్టి_సినిమా నుండి బయట పడిపోయారు. నేనేమో ఒక విధమైన జీవితావసరం వల్ల ఇందులోనే వుండిపోయాను.
