Previous Page Next Page 
కావేరి పేజి 34

    మాధవరావు కంఠంలోని దృఢ నిర్ణయంవిన్న కావేరీకి ఎంతో ఆనందం కలిగింది. వంటరిగా వచ్చినందుకు మంచి తోడు, సంపూర్ణ సహకారం లభించినందుకు ఎంతో ఆనందించింది. తన ధ్యేయం నెర వేరబోతోందని, త్వరలో తను గొప్ప హీరోయిన్ అవగలదని కలలుకనసాగింది.

    "చీరలు మంచివి వున్నాయా?" అనడిగాడు మాధవరావు కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత!

    "ఆఁ...లగ్నాలు పెట్టుకున్నరోజున మా నాన్న కొన్న పట్టుచీర, మా అత్తయ్య పెట్టిన పట్టుచీర, పెళ్ళికని కొన్నచీరలు అన్నీ తీసుకువచ్చేశాను" ఎంతో ఉత్సాహంగా చెప్పింది.

    "ఏవీ...చూపించు!"

    కావేరి చెయ్యి కడుక్కునివెళ్ళి ట్రంకుపెట్టే మూతతీసి ఒక్కొక్క చీరా తీసి చూపించుతోంది మాధవరావుకి.

    చీరలు చూడాలన్న ఉద్దేశ్యంకాదు అతనికి! ఆ చీరాల అడుగున ఎన్ని నోట్లకట్టలు, ఎంత బంగారం దాచి తెచ్చిందని చూసేందుకు. ఆ తెచ్చినవాటితో తను ఎంతవరకు అంచనా వేసుకోవచ్చునో? అని చీరల వంకతో పెట్టె తెరిపించాడు.

    చీరలు తీస్తుంటే వాటిమధ్య దాచిన బంగారపు గాజులుని, పెద్ద గొలుసునీ, డబ్బుని చాకచక్యంగా క్రిందవరసకి చేర్చిన తరువాత తీసి చూపించుతోంది.

    కావేరి పెట్టెవైపుకి తిరిగినప్పుడు మెడని సారించి పెట్టెలోపలికి చూడసాగాడు మాధవరావు. కావేరి ఎంత మెలుకువగావున్నా బంగారపు వస్తువులు క్రిందికి చేర్చేటప్పుడు అయినా శబ్దాన్ని దాచలేకపోయింది మాధవరాచునుంచి. ఎంతో కష్టంమీద కావేరి దగ్గిరవున్న డబ్బుని షుమారుగా ఓ యాభైవేలు వుంటుందన్న నిర్ధారణకివచ్చి ఎంతో ఆనందించాడు.

    చాలాకాలం తరువాత తనకి లభించిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి! చేజారితే యింకరాదు! యిది పల్లెటూరి బైతుకాబట్టి తను చెప్పిందే వేదమని నమ్ముతుంది అనుకుని ఎంతో సంతృప్తి చెందాడు. అంతలోనే అయిష్టంగా ముఖంపెట్టి అన్నాడు-

    "ఇలాంటి చీరలు మీ పల్లెటూరివాళ్ళకు గొప్పకావచ్చును కాని ఇక్కడ వీటివిలువ చాలాతక్కువ! సినిమాలలో పనిమనుష్యులుగా వేషాలు వేసేవారు కడతారు....నీ స్టేటస్ కి ఇవి పనికిరావు. సాయంత్రం పాండీ బజారుకి వెళ్ళి వెరైటీ చీరలు, ఖరీదుగల పట్టుచీరలూ కొందాం....నువ్వెంత ఆల్ట్రా మోడరన్ గావుంటే అంత త్వరగా నిర్మాతలదృష్టిలో పడగలవు."

    "అలాగా?" అన్నట్టు మాధవరావువైపు చూసింది.

    తిరిగి పెట్టెలోనే తీసిన చీరలను సర్దేసింది. తాళంకూడా వేసేసింది. ఆతాళంచెవిని జేబురుమాలుకి కట్టుకుని ఆ జేబురుమాలుని చుట్టగా చుట్టి జాకెట్టు లోపలికి దూర్చేసింది.

    అంతా క్రీగంట పరిశీలించుతున్న మాధవరావు మనసులోనే అనుకున్నాడు." ఇది గట్టిపిండమే!నెమ్మదిగా ముగ్గులోకి దించాలి!"

    "నువ్వు స్నానంచేసి మంచి చీర కట్టుకుని వుండు. ఆకలివేస్తే భోజనం చెయ్యి! నేను అలా మా ఆఫీసుకి వెళ్ళి ఏ టైంకి వస్తానో? నా కోసం ఎదురుచూడవద్దు! లోపల గడియవేసుకుని పడుకో!" అన్నాడు కుర్చీలోంచి లేస్తూ!

    "ఒక్కదాన్నే వుండటం నాకు భయం...." అంది.

    "నేను వచ్చేస్తానుగా? అక్కడనుంచి యిక్కడికి అంత ధైర్యంతో వచ్చిననీకు భయమా?" అంటూ నవ్వాడు.

    "అది కాదండీ? నాకు యిక్కడ అంతా కొత్తకదా? అందుకు వంటరిగా వుండాలంటే ఎలా?.."

    "అలవాటు చేసుకోవాలి!...వస్తాను..." అంటూ లేచాడు.

    అతడిని తలుపువరకూ సాగనంపి బైటికి వెళ్ళిన తరువాత తలుపులు గడియవేసి వచ్చి మంచంమీద వాలిపోయింది. ఆ మంచంమీద పరుపు మెత్తగా వుండటంతో అదీ వింతగా వుంది కావేరికి.

    కడుపునిండా తిండి తినటంవలనను, రాత్రి నిద్రలేక పోవటంతో ఫాన్ గాలికి వెంటనే నిద్ర పట్టేసింది. అలా ఎంతసేపు నిద్రపోయిందో కావేరీకి తెలియదు.

    తలుపుమీద చేత్తో తట్టినట్లుంటే మెలుకువ వచ్చింది. మాధవరావు వచ్చి వుంటాడేమోననుకుని అంత బద్దకాన్నీ ఆవలకి నెట్టి ఆవలించుతూనే వచ్చి తలుపులు తెరిచింది.

    ఉదయం టిఫిన్ కాఫీలు తెచ్చిన సర్వరు.

    "భోజనం తెమ్మంటారా?" అనడిగాడు.

    "కావాలంటే నేనే అడుగుతానుగా? మంచి నిద్ర పాడుచేశావు. ఫో అవతలకి!"

    అంటూ అతని ముఖంమీదనే తలుపులు మూసుకుని వచ్చి తిరిగి మంచం ఎక్కింది కావేరి!..."
   
                                                                          16

    తీరా వచ్చి పడుకున్న తరువతహగాని ఆ హోటల్ సర్వర్ తనని "భోజనం సంగతి ఎందుకు అడిగాడు?" అన్న ఆలోచన కలిగింది కావేరీకి.

    ఇది భోజనం చేసేవేళేనా? లేక తను వంటరిగా వున్నానని చూసి కావాలని తనతో మాట్లాడటానికి వచ్చాడేమో! పని గట్టుకుని తనుఅడక్కపోయినా భోజనం సంగతి ఎందుకు అడిగాడు? మాధవరావు వెళ్ళటం చూసి వచ్చాడు.

    ఇలా తన యిష్టం వచ్చినట్టుగా ఆలోచించుకుంటోంది.

    ఎలా ఆలోచించినా? ఎంత ఆలోచించినా కావేరీకి అర్ధం అయినా భాష అదే!...

    "త్వరగా మాధవరావు వచ్చేస్తే బాగుండును!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS