Previous Page Next Page 
కావేరి పేజి 33

   
    "స్క్రీన్ టెస్ట్ అని సుదీర్ఘమయిన డైలాగ్ యిచ్చి డైరెక్టర్ సహాయం లేకుండానే నటించి చూపించమంటారు. నిర్మాత డైరెక్టర్ కూడా! కెమెరా మూవ్ అవుతూ వుంటుంది. నన్ను సినిమా తీస్తున్నారు? అని భయపడకూడదు. యింతకీ నువ్వేం చదివావు?"

    "టెన్త్ చదువుతున్నాను!"

    "కొద్దో గొప్పో ఇంగ్లీష్ వస్తుంది కదా?....ఫరవాలేదు ప్రస్థుతానికి! యింకా ఇంప్రూవ్ చేసుకోవటం ఎంతయినా అవసరం! ఆంగ్లో ఇండియన్ ట్యూటర్ ని నియమించుతాను. మూడు నెలలు గడిచేసరికి చక్కటి ఇంగ్లీషు మాట్లాడగలవు. ఏ నిర్మాత అయినా ఏం చదివావు అని అడిగితే బి.ఏ. అని చెప్పవచ్చును."

    "ఎక్కడ చదివావని అడిగితే?" సందేహనివృత్తికోసం అడిగింది కావేరి.

    "అవన్నీ అడిగే తీరిక వాళ్ళ కెక్కడ వుంటుంది? నువ్వు బి.ఏ. అనగానే ఖంగు తింటారు. అంత చదివినవాళ్ళు ఈ సినీఫీల్డులో చాలా అరుదు.

    "నిజమేనంటారా?..." అపనమ్మకంగా అడిగింది కావేరి తినటం మానివేసి.

    "అబద్దం చెప్పవలసిన అవసరం నాకేమిటి కావేరీ? కొన్ని సినీవార పత్రికలు నా రూంలో వున్నాయి. అందులో ఈవాటి తారలగురించి ఎంత గొప్పగా రాశారో? అవికూడా ఆ విలేఖరికి డబ్బుయిచ్చివ్రాయించుకున్నవే! అలాగని ఎంతమందికి తెలుసు? నేను ఈ ఫీల్డులో వుంటున్న వాడిని కాబట్టి నిజానిజాలు నాకుతెలుసు! అంతెందుకు? శాంతిశ్రీ అనే నటీమణి వేషాలుకోసం తిరిగి తిరిగి సంవత్సరానికి ఆమె వేసుకున్న చెప్పులేకాక అరికాళ్ళుకూడా అరిగిపోయాయి. కాఫీనీళ్ళకి కూడా మొహం వాచిపోయింది.

    తను ఎవరికీ లొంగకుండా ఎంతో నీతిగా వుండాలని ప్రయత్నించింది. కాని లాభంలేకపోయింది. అసలు కారణం ఏమిటోగాని సంవత్సరం తిరిగేసరికి పదిహేను సినిమాల్లో హీరోయిన్ గా బుక్ అయిపోయింది. అయిదు సినిమాలు ఒకవారం తరువాత ఒకవారంలో శాంతిశ్రీ నటించిన సినిమాలు విడుదలగావటం! అవి బాక్సాఫీసుని బద్దలు చేయటంతో శాంతిశ్రీ మరో ఇరవై పిక్చర్సులో బుక్ అయిపోయింది. అందులో ఎనిమిది హిందీ, కన్నడ, మలయాళం మరో ఎనిమిది! మిగతా నాలుగూ తెలుగు పిక్చర్సు! యింతకీ ఆ శాంతిశ్రీని అంతదాన్నిచేసింది ఎవరనుకుంటున్నావు?"

    "ఎవరండీ ఆ మహానుభావుడు? నిజంగా ఆ శాంతిశ్రీ ఎంత అదృష్టవంతురాలండీ? ఉదయమే లేవటంతోనే ఆ ఫోటోకి నమస్కరించుకుంటూ వుండవచ్చును!" అంది కావేరి ఉత్సాహంగా!

    తనుకూడా శాంతిశ్రీ అంత హీరోయిన్ అయిపోతే రోజుకాక గంట గంటకీ మాధవరావుకి నమస్కరించుకుంటూ వుంటుంది.

    "ఏమిటీ? ఆలోచించుతున్నావు?" అడిగాడు కావేరినే చూస్తూ!

    "అదే! ఆ శాంతిశ్రీ ఎంత అదృష్టవంతురాలో అని!"

    "ఓ! అదా? నేను చెప్పినట్లువింటే నువ్వు శాంతిశ్రీ కంటే కూడా గొప్ప నటివి అవగలవు. యాభై సినిమాలలో ఒకేసారి నటించగలిగే ఏర్పాటు చేస్తాను."

    "అంటే?"

    "నిర్మాతలకి, డైరెక్టర్లకీ అనుకూలంగా నడవటం! వాళ్ళు చెప్పిన విధంగా యాక్ట్ చేయటం! తమతో రమ్మన్న చోటికివెళ్ళి వాళ్ళిచ్చే ట్రైనింగ్ తోనే నువ్వు గొప్ప నటీమణివి కాగలవు! శాంతిశ్రీ వుంటే నిన్ను పరిచయం చేసేవాడిని! వారంరోజులక్రితమే బొంబాయి వెళ్ళింది! ఇంకా రెండునెలలకిగాని రాదు! కాల్ షీట్సు ఇచ్చింది. నన్నుకూడా శాంతిశ్రీ అంతటి నటీమణిని చేస్తాను!"

    ఆవేశంతో అంటున్న మాధవరావు వైపుకి ఆశ్చర్యంగా చూసింది.

    "చూడు కావేరీ! వంటరిగావున్నావని నిన్ను ఆదుకోవటం మినహా! నిన్ను మోసంచేయాలన్న బుద్ది నాలోలేదు. నీ కృతజ్ఞతలే నాకు కావాలి! అంతే!"

    "అలాగే మాధవరావుగారూ! మిమ్ములను మనస్పూర్తిగా నమ్ముతాను. మీరేమీ చెప్పితే అదే చేస్తాను. నేను కధానాయకి అవటమే నాకు కావలసింది. నేను నటించిన సినిమాలు వజ్రోత్సవాలు చేసుకోవాలి! నేను ఇంపాలా కారులో మా గ్రామంపెళ్ళి నా తల్లితండ్రులను, వినాయకం బావనీ చూడాలి! నువ్వేమీ హీరోయిన్ వి కాలేవు! అని నాతో చదువుకునే సుబ్బులు నన్ను ఎంతో హేళనచేసేది. నేను పెద్ద హీరోయిన్ ని అయిపోయాను! అని గర్వంగా దానిముందు నిలబడాలి! నాకెప్పుడూ సినిమా పాటల పుస్తకాలు, వాల్ పోస్టర్లూ తెచ్చిచ్చే నాగులుని మద్రాసు తీసుకుని వచ్చి తన అభిమాన నటీనటులందరి ఇళ్లకీ వెళ్ళ వారిని పరిచయం చేయాలి! వారితో ఫోటోలు తీయించాలి!

    "పెళ్లవబోతోంది. యింక సినిమాలు, నాటకాలూ మానివెయ్యి!" అని కామాక్షమ్మ అత్తయ్య అంతమందిలోనూ పట్టుకుని అంది. ఆ సినిమాలే నేడు నన్నెంత లక్షాధికారిని చేశాయో నిరూపించుకోవాలి! ఇవన్నీ నెరవేరాలంటే నేను పెద్ద హీరోయిన్ కావాలి!ఇంకా త్వరగా సినిమాల్లో నటించేటట్లు చూడండి!" అంది ఆవేశంగా!

    "తప్పకుండాను. కాని మనిద్దరం ఇలా హోటల్లో వుండకూడదు. ఏ నిర్మాత అయినా రావాలంటే హోటల్ రూం అనేసరికి భయపడతారు!"

    "ఎందుకని?" తెలియక అడిగింది కావేరి.

    "ఒక ఆడపిల్ల లాడ్జింగ్ లో వున్నదంటే ఆ అమ్మాయి ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరి తాలూకా మనిషి? అని పోలీసులు ఆరాతీస్తారు. ఆ అమ్మాయిమీద, ఆ అమ్మాయి వుంటున్న హోటల్ రూంమీద ఓ కన్నువేసి వుంచుతారు. ఇంకా ఆ అమ్మాయికోసం వచ్చే మగవారిమీద రెండుకళ్ళూ నిఘావేసి వుంచుతారు. నీతో మాట్లాడటానికి ఏ నిర్మాతయినా వచ్చారనుకో! మీ ఇద్దరినీ వ్యభిచారం నేరంక్రింద అరెస్టుచేసి జైలుకి పంపించుతారు. నువ్వు ఎవరివో? ఎక్కడనుంచి వచ్చావో నిన్ను చిత్రహింసలు పెట్టి అయినా నిజంచెప్పించి తీసుకెళ్ళి మీతల్లితండ్రులకి అప్పగించుతారు!"

    "అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు?"

    "ఏదయినా మంచి ఇల్లు అద్దెకు తీసుకుని అందులో వుందాం. అప్పుడు ఎలాంటి ఇబ్బందీ వుండదు. రోజుకి ఎవరు వచ్చినా? ఎంత మంది వచ్చినా మనలను గురించి పట్టించుకునేవాళ్ళే వుండరు!"

    "నిజం!"

    "అవును కావేరీ! అద్దెయింటిలో వుంటున్నామంటే ఓ విధమయిన గౌరవం వుటుంది. అప్పుడు డాన్స్ మాష్టరుని ఏర్పాటుచేస్తాను. చక్కగా డాన్స్ నేర్చుకో! సినిమాల్లో హీరోయిన్ కావాలనుకునేవాళ్ళకి డాన్సు వచ్చివుండాలి! ముఖ్యమయిన అర్హతగా డాన్సుని పరిగణించుతారు. నిర్మాతలు, డైరెక్టర్...ఇంకొకటి! నీ ఉచ్చారణ శుద్ద పల్లెటూరివాళ్ళు మాట్లాడుతున్నట్టు వుంది. ఆ ధోరణి మానిపించాలంటే ఆంగ్లో ఇండియన్ ట్యూటర్ ని నియమించి ఇంగ్లీష్, తమిళ, మళయాళ భాషలు నేర్పించుతాను. ఎంత ఖర్చు అయినా వెనుకాడరు. మళయాళం నేర్చుకోవటంలో ఒక ప్రాముఖ్యతవుంది ఈ సినీఫీల్డులో! తెలుగులో హీరోయిన్ గా చెలామణి కానివాళ్ళందరూ మళయాళ పిక్చర్సులో హీరోయిన్స్ గా అయి తమ సహజ నటనా చాతుర్యంలో ప్రసిద్ద నటీమణులందరూ ఒకటి రెండు సినిమాలలో నటించి ఆడియన్స్ మెప్పు పొందటమేకాక "సహజనటి" అని ఊర్వశి అని ప్రఖ్యాత బిరుదులను పొందారు. ఒకవేళ తెలుగులో రాణించలేదనుకో! మళయాళ సినిమాలలో రాణించగలవు అందువలన ఆ భాషవస్తే ఎంతో మంచిది. అవకాశాలు నిన్నువెతుక్కుంటూ వస్తాయి. నాలుగు భాషలు తెలిసిన నటీమణిని అని అన్ని పత్రికలూ రాస్తాయి. శాంతిశ్రీకంటే కూడా అనతికాలంలో నిన్ను గొప్ప నటీమణిని చేస్తాను!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS