Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 33


                                        శతమన్యు

    అప్పుడు కృతయుగం జరుగుతున్నది. ఆ కాలంలో ఒకప్పుడు దేశం అంతటా పెద్ద దుర్భిక్షం ఏర్పడింది. వానకు కురవకపోవటంవల్ల ఎక్కడా పంటలు పండలేదు. ఎవ్వరికీ గిద్దెడు గింజలు లేవు. పశువులకు గూడా గుప్పెడు గ్రాసం లేదు. నానాటికీ ప్రజాజీవితం దుర్భరమై పోతున్నది.
    ఆ మరుసటి యేడు గూడా వర్షాలు లేవు. చెరువులూ, సరస్సులూ, కాల్వలూ, నదీనదాలూ అన్నీ ఎండిపోయాయి. మార్తాండుని ప్రచండాగ్నిలో భూమండలం భగభగ మండిపోతున్నది. గడ్డీగాదమూ మలమల మాడిపోయింది. చెట్లూ చేమలూ ఎండి మ్రోడులై పోయాయి. ఆ భయంకర క్షామానికి ప్రాణికోటి అంతా హాహాకారాలు చేస్తున్నది. జనం అంతా ఇళ్లూ వాకిళ్ళూ విడిచి ఎక్కడికో వలసపోతున్నారు.
    ఆ విధంగా పన్నెండేళ్ల వరకూ వర్షం పడలేదు. ఎక్కడా తిండిలేదు. నీరు లేదు. గడ్డిలేదు. కాలాలు లేవు. ఋతువులు లేవు. గతులు లేవు. భూమండలం అంతా దుమ్మూ ధూళీ! ఆకాశం అంతటా అగ్నిజ్వాలలు! పక్షులు కూడా రెక్కలు విప్పటం లేదు. ఎక్కడా ధాన్యపుగింజ కనిపించటం లేదు. అన్నం మెతుకు అగుపించటం లేదు. మహారాజుల ధనాగారాలూ, కోటీశ్వరుల ఏడంతస్తుల మేడలూ పిడికెడు బియ్యం పుట్టించలేక పోతున్నాయి. క్షణక్షణానికీ జీవకోటికి ప్రాణభయం అధికమవుతున్నది.
    ఒకనాడు జనసమాజం అంతా ఒకచోట గుమికూడింది. ఎక్కడినుంచో మహానుభావుడైన ఒక దివ్యమహర్షి అక్కడికి దయచేశాడు. జనం అంతా "పాహిపాహి" అంటూ ఆయన పాదాలమీద వ్రాలారు. మహర్షి వాళ్లకి అభయం ఇస్తూ "మహాజనులారా! మీ బాధలు నేను గ్రహించాను. మిమ్మల్ని ఈ క్షామ బాధనుంచి తప్పించి రక్షించాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ కష్టసమయంలో మీకు కర్తవ్యం చెప్పి కాపాడటమే నా రాకకు కారణం. అయితే అందుకు ఒక్కటే మార్గం ఉన్నది. అది ఏమంటే మనం ఇప్పుడు వర్షదేవుడైన ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. బహుకాలం నుంచి యజ్ఞయాగాలు లేకపోవటంవల్ల వర్షాధిపతికి కోపం వచ్చింది. అందువల్ల వానలు కురియటం లేదు. కనుక మనం వానదేవుని ప్రీతికోసం ఒక మహాయజ్ఞం చేయాలి" అని పలికాడు. వెంటనే జనం అంతా "ఒక యజ్ఞం ఏమిటి? వర్షం పడుతుందంటే ఎన్ని యజ్ఞాలైనా చేస్తాము! ఎన్ని యాగాలైనా నిర్వహిస్తాము! సెలవివ్వండి" అని కోలాహలం చేశారు. మహర్షి వారిని చేతులెత్తి వారిస్తూ "ఆ యజ్ఞం అంత సులభమైనది కాదు. ఆ మహాయజ్ఞం సమయంలో సకల సద్గుణ సంపన్నుడైన ఒక మనుష్యుణ్ణి బలి ఇవ్వాలి. అందుకోసం ఎవరైనా త్యాగమూర్తి సంతోషంగా యజ్ఞకుండంలో దూకటానికి సిద్ధం కావాలి. ఆ విధంగా ఆ మహాయజ్ఞం పూర్తి అయితే భూమండలం అంతటా బ్రహ్మాండమైన వర్షం పడుతుంది. లోకం మళ్లీ పాడిపంటలతో సుఖ సంపదలతో సుభిక్షమై వర్ధిల్లుతుంది" అని పలికాడు.
    ఆ మాటలు వినగానే జనసమాజం అంతా నిశ్చేష్టమై నిశ్శబ్దంగా నిలబడిపోయింది. 'నరబలి' అనగానే ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు - అందులో సకల సద్గుణ సంపన్నుడైన మనుష్యుడు! అందరూ తలలు వంచుకొని నేలచూపులు చూస్తున్నారు. చూస్తూ చూస్తూ లోకం కోసం ఎవరి ప్రాణాన్ని ఎవరు బలి ఇస్తారు? అందువల్ల అందరూ మౌనం వహించారు. అంతలో "ఏమి! మీలో లోక శ్రేయస్సుకోసం స్వేచ్చగా ఆత్మత్యాగం చేసే ఔదార్యమూర్తి ఒక్కడూ లేడా?" అని అడిగాడు మహర్షి. జనం ఒకరి ముఖాలు ఒకరు చూచుకుంటున్నారు.
    అంతలో జన సమూహంలో నుంచి "లేకేమి! లోక కల్యాణం కోసం బలికావటానికి ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నాను!" అంటూ పదిపన్నెండేళ్ల పసిబాలుడు ఒకడు గంభీరంగా ముందుకు వచ్చాడు. కుర్రవాడు కుందనపు బొమ్మలాగా చాలా అందంగా ఉన్నాడు. కలువరేకుల వంటి కళ్లూ, అతి కోమలమైన అవయవాలు, తళతళా మెరిసి పోతున్నాయి.
    బాలుడు మందహాసం చేస్తూ చేతులెత్తి "మహర్షీ! ఆకలి మంటలతో ఆర్తనాదాలు చేస్తున్న అసంఖ్యాకమైన ప్రాణికోటిని కాపాడటం కోసం సంతోషంగా నా ప్రాణాలు యజ్ఞంలో సమర్పిస్తాను. నా ఈ జీవితం విశ్వకల్యాణానికి వినియోగపడితే అదే పదివేలు. ఈ విధంగా మానవసేవ చేస్తే మాధవసేవ చేసినట్లే అవుతుంది. మరి భగవత్సేవకంటే పరమార్థం ఏమున్నది?" అని పలికాడు.
    ఆ మాటలు వినగానే ప్రజలందరూ ఆశ్చర్యపరవశులైనారు. పది పన్నెండేళ్ల బాలుడు లోకం కోసం బలికావటానికి బయలుదేరాడు. ఆ త్యాగామూర్తిని చూచి అంతా ఆశ్చర్య చకితులైనారు. మహర్షి క్షణకాలం కన్నులు మూసుకున్నాడు. ఆయన మెల్లగా ఆ వీరబాలుణ్ణి సమీపించి గాఢంగా కౌగిలించుకున్నాడు. "నాయనా! శతమన్యూ! నీ త్యాగబుద్ధి నిరూపమానమైనది. నీ జన్మ సార్థకమైనది. నీవంటి ధర్మవీరుణ్ణి కన్న తల్లిదండ్రులు ఎంత ధన్యాత్ములో! నీవు జగదేకపూజ్యుడవు నాయనా!" అంటూ ఆనంద బాష్పాలతో ఆ పసి బాలుణ్ణి అభిషేకించాడు మహర్షి. మహాయజ్ఞానికి ముహూర్త నిర్ణయం జరిగింది.
    యజ్ఞ సమయం సమీపించింది. సంభారములు అన్నీ సమకూర్చబడినవి. సాధనాలన్నీ సంసిద్ధమైనాయి. ఋత్విక్కులు అందరూ దయచేశారు. కార్యక్రమం ఆరంభమైనది. మంత్రధ్వనులతో దిక్కులన్నీ మారుమ్రోగుతున్నాయి. జనం జయజయ ధ్వానాలు చేస్తున్నారు. శతమన్యుడికి స్నానం చేయించారు. నూతన వస్త్రాలు అలంకరించారు. ఒంటినిండా చందనం పూశారు. మెడనిండా పూలదండలు వేశారు.
    శతమన్యుడు యజ్ఞమంటపంలో ప్రవేశించాడు. యజ్ఞకుండానికి సమీపంలో నిలబడి దేవేంద్రుణ్ణి ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. యజ్ఞమంటపం అంతా నిశ్శబ్దంగా ఉన్నది. బలి సమర్పణ సమయం వచ్చింది. శతమన్యు బలిపీఠం ముందు తలవంచి నిలిచాడు. "ఇంద్రదేవా! నా ప్రాణం బలిగా తీసుకొని నా దేశాన్ని రక్షించు." అని ప్రార్థించాడు. జనసమూహం అంతా అతనివంక కన్నార్పకుండా చూడసాగింది.
    అంతలోనే ఆకస్మికంగా ఆకాశంమీదనుంచి విచిత్రమైన మంగళధ్వనులు విన్పించాయి. శతమన్యుడి మీద ఎడతెగకుండా పుష్పవర్షం కురిసింది. ఒక్కమాటుగా వాతావరణం మారిపోయింది. గగనం అంతా నీలిమేఘాలతో నిండిపోయింది. క్షణంలో కన్నులు మిరుమిట్లు గొల్పుతూ ఉరుములూ మెరుపులూ ఆరంభమైనాయి. దేవరాజు మహేంద్రుడు దివ్యదీప్తులతో యజ్ఞకుండం ముందు సాక్షాత్కరించాడు. జనగణం అంతా ఆశ్చర్యంగా కళ్లు తెరచి అలాగే చూడసాగింది. దేవేంద్రుడు తన దివ్య హస్తాలతో శతమన్యుడి వీపు తట్టి ప్రేమపూర్వకంగా ఇలా పలికాడు.
    "వత్సా! శతమన్యూ! నీ దేశభక్తిని నేను మెచ్చుకుంటున్నాను. నీ త్యాగశక్తిని నేను అభినందిస్తున్నాను. విశ్వరక్షణకై దీక్షపూనే నీ వంటి వీరబాలకులే లోకపావనులు! నీ ధర్మబుద్ధికి నేను సంతుష్టి పొందాను. అందువల్ల నీవు బలి కాకుండానే ఈ మహాయజ్ఞాన్ని సఫలం చేస్తున్నాను. ఈ యజ్ఞఫలంగా ఇప్పుడే లోకం అంతా సుభిక్షం అవుతుంది" అని అంతర్థానమైనాడు దేవరాజు.
    యజ్ఞసభ అంతా ఆనందపరవశమైపోయింది. ప్రజలందరూ చేతులెత్తి శతమన్యుడికి జేజేలు చెప్పారు. చూస్తూ ఉండగానే భూమండలం అంతటా బ్రహ్మాండమైన కుంభవృష్టి కురిసింది. చెరువులూ, సరస్సులూ, నదులూ నదాలు సమస్తం నీటితో నిండిపోయాయి. దేశం అంతా చల్లబడింది. గ్రామాలన్నీ ఎక్కడ చూచినా పాడిపంటలతో పూలతో పండ్లతో కళకళలాడుతూ కనుల పండువు చేశాయి. శతమన్యుడు సార్థక జీవనుడైనాడు. అతని ధర్మబుద్ధి, త్యాగఫలం నిఖిల లోకానికి నిత్యకల్యాణం కల్గించాయి. పచ్చతోరణాలు కట్టించాయి. నాలుగు దిక్కులా ఆనందదేవత నవ్వుతూ నవనవోన్మేషంతో నాట్యం చేసింది.

                                      *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS