టెలిఫోన్ మ్రోగుతూంది. ఇద్దరిలో ఒక్కరూ లేచి ఎత్తలేదు. అప్పుడే వచ్చిన ఇందిర గబగబా వెళ్ళి టెలిఫోన్ ఎత్తింది.
"రాంగ్ నంబర్!" రిసీవర్ విసురుగా పెట్టేసి నీరసంగా కుర్చీలో కూలబడింది.
బెల్ మ్రోగింది. జగన్నాథం పరుగులాంటి నడకతో వెళ్ళి ఆత్రంగా వీధి తలుపులు తెరిచాడు. ఒక వృద్ధుడు నిల్చుని వున్నాడు.
"లాయర్ రామనాథంగారి ఇల్లెక్కడండీ?" అడిగాడు ఆ వృద్ధుడు.
జగన్నాథం నీళ్ళు కారిపోయాడు. "తెలియదు" అంటూ తలుపులు వేసి వెనక్కు తిరిగాడు.
రవి ఇదేమీ పట్టించుకోకుండా కూర్చున్నాడు. అతనికి సాక్ష్యులు దొరుకుతారనే నమ్మకం పోయింది. కాని ఇందిరకూ జగన్నాథానికీ ఇంకా ఆశ చావలేదు.
ఐదు నిముషాల తర్వాత మళ్ళీ బెల్ మ్రోగింది. జగన్నాథం ఇందిర ముఖంలోకి చూశాడు. ఇందిర కూడా లేవలేదు కాని బెల్ మళ్ళీ మ్రోగింది. రవి లేచి వెళ్ళి తలుపు తీశాడు.
తలుపు తెరిచిన రవి ఎదురుగా నిలబడ్డ వాళ్ళను దీక్షగా చూశాడు.
"నమస్కారమండీ! మమ్మల్ని గుర్తుపట్టలేదూ?" అంటూ అంజి లోపలకు దారితీశాడు. రవి పక్కకు జరిగి వాళ్ళనే ఆశ్చర్యంగా చూస్తూ నిల్చున్నాడు.
"వచ్చేశారు సాక్షులు వచ్చారు" ఇందిర గట్టిగా అరిచింది.
జగన్నాథం చివుక్కున లేచి నిలబడ్డాడు. "రండి! రండి" ఉత్సాహంగా ఆహ్వానించారు, వాళ్ళ వెనకే ఏదో ఆలోచిస్తూ వచ్చి నిల్చున్నాడు రవి.
బేబీ బంతితో ఆడుకుంటూ వుంది. అంజి రవిని ఎగాదిగా చూశాడు ఓ క్షణం.
"బేబీ, మామయ్యకు నమస్కరించు! ఆ రోజు నిన్ను రక్షించింది ఈ మామయ్యేనమ్మా!" అన్నాడు అంజి.
అలివేలు అర్థంకానట్టు రవినీ, జగన్నాధాన్ని మార్చి మార్చి చూసింది. మళ్ళీ బంతి ఆడుకోసాగింది.
"ఏమండీ! నన్ను గుర్తుపట్టలేదా? మీ కేసు గురించి నిన్ననే తెలిసింది. పాత పేపరు తెప్పించి చూశాను. ఈ మధ్య మేము ఊళ్లో లేము!" అంటూ, అంజి రవి ముఖంలోకి చూశాడు.
జగన్నాధానికి సంతోషంతో మాటలు రావడం లేదు. ఇందిర రవి మౌనాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉంది.
రవి బేబీని, రమనూ మార్చి మార్చి చూశాడు.
అతను అలాగే వున్నాడు. కానీ ఆ పిల్ల తాను రక్షించిన పిల్ల కాదు. ఆ పిల్ల బొద్దుగా, తెల్లగా ఈ తల్లి కూడా ఆమె కాదు. అతను మాత్రం అలాగే కనిపిస్తున్నాడు. కాని అతనిలో వున్న ఆడంగితనం ఇతనిలో కన్పించడం లేదు.
ఇందిర అంజిని ఏవేవో ప్రశ్నిస్తూ ఉంది. రవి లోపలకు వెళ్ళాడు.
"రవిగారు మమ్మల్ని గుర్తుపట్టినట్టు లేదు!" అన్నాడు అంజి కొంచెం డీలా పడిపోతూ.
జగన్నాధానికి రవి ప్రవర్తన కోపం కలిగించింది. ఇందిరకు ఆశ్చర్యం కలిగించింది.
"దేవుడిలా సమయానికి వచ్చారు మమ్మల్ని ఆదుకోవడానికి. మీ మేలు జన్మజన్మలకూ మర్చిపోను!" అన్నాడు జగన్నాథం అంజి రెండు చేతులూ పట్టుకుని!
రవి బయటికి వచ్చి రూపాయల కట్ట అంజిమీదకు విసిరాడు. అందరూ తెల్లబోయి నిల్చున్నారు.
"తీసుకోండి! ఈ డబ్బు కోసమేగా మీరు దొంగ సాక్ష్యం చెప్పటానికి వచ్చారు" అన్నాడు రవి ఉద్రేకంగా.
ఒడ్డును కనుచూపు మేరల్లో చూస్తున్న జగన్నాధానికి మళ్ళీ ఓ పెద్ద కెరటం పడి సముద్రంలోకి తోసేసినట్టు అయింది.
ఇందిర పిచ్చి చూపులు చూస్తూ నిల్చుంది.
అంజి కొంచెం గాబరా పడ్డాడు! అంతలో సర్దుకుని అన్నాడు- "మీరు మమ్మల్ని గుర్తించినట్టు లేదు. మీరు మా బిడ్డ ప్రాణాలు కాపాడారు. అందుకే వచ్చాం! మమ్మల్ని మీరు అపార్థం చేసుకున్నారు! మీ పదివేల కోసం... ముష్టి పదివేల కోసం రాలేదు."
జగన్నాథం రవి ముఖంలోకి కోపంగా చూశాడు.
ఇందిరకు ఇదేమీ అర్థం కావడం లేదు.
రవి బేబీ దగ్గిరకొచ్చాడు. లాలనగా దగ్గిరకు పిల్చి కూర్చోపెట్టుకున్నాడు. అంజి ముఖం వికసించింది.
"చూడమ్మా! పాపా! నీకు బోలెడన్ని బిస్కెట్లు కొనిపెడ్తాను, బొమ్మలు కొనిపెడ్తాను! మంచి మంచి గౌనులు కూడా కొనిపెడ్తాను. నేను ఒకటి అడుగుతాను నిజం చెబుతావా?" అన్నాడు రవి.
బేబీ కళ్ళు మిలమిల మెరిసిపోతున్నాయి. "ఆ డబ్బు నాకిస్తావా? మరేమో అవి పెట్టి నేను చాలా బొమ్మలూ, మిఠాయిలు కొనుక్కుంటాను" కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది బేబీ_
అంజికి అరచేతుల్లో చెమట పట్టసాగింది! రవి ముఖం వెలవెల బోవడం ఇందిర గమనించింది.
"ఓ! ఆ డబ్బులన్నీ నీకే ఇస్తాను! నిజం చెప్పు. నువ్వెప్పుడన్నా నీళ్ళలో పడిపోయావా బంతి ఆడుకుంటూ"
"ఉహూఁ నేనెప్పుడూ నీళ్ళలో పళ్ళేదు."
"బేబీ!" కసురుకున్నాడు అంజి.
బేబీ భయంతో బిగుసుకు పోయింది.
"పుణ్యానికి పోతే పాపం ఎదురైందట! అలా వుంది మీ వరస! రా! బేబీ వెళ్ళిపోదాం! పసిది దానికేం తెలుసు? బిస్కెట్లు ఆశపెడ్తే అది ఏమైనా చెబుతుంది" అంది రమ లేచి నిల్చుంటూ.
