హైదరాబాద్ నుండి పని ముగించుకొని మూడో రోజుకల్లా రాయుడుపాలెం వచ్చాడు. బస్ దిగగానే ఆ వూరి గోడలమీద అసభ్యంగా బొమ్మలు గీచి అశ్లీలంగా రాసి వుంది.
"ఇన్ స్పెక్టర్ - లేడి డాక్టర్ ప్రేమాయణం" అంటూ అసభ్యంగా బొమ్మలు, బొమ్మలకింద అశ్లీలంగా రాసి వున్నాయి.
టింకు సంరక్షణ ఆ రెండు రోజులు డాక్టర్ లతకు అప్పచెప్పటం వలనే ఎవరో ఇలా చేసి వుంటారు. కాని ఆ గ్రామస్తులను ఎవరిని విజయ్ అనుమానించలేక పోతున్నాడు. ఇది కూడా రాయుడు చేయించి వుంటాడని నిర్ధారించుకోవటానికి ఎంతో సమయం పట్టలేదు.
అప్పటికి టింకును చూసి మూడు రోజులయ్యింది. మొదట సరాసరి డాక్టర్ ఇంటికి వెళదామనుకున్నవాడు కాస్తా విరమించుకున్నాడు.
జీవితంలో అనేక ఎదురుదెబ్బలు తిన్న తనే పిచ్చి రాతలకి మనసు కష్టపెట్టుకుంటే, ఉన్నత వృత్తిలో వుండి పెళ్ళికానిది అందునా వంటరిగా వుంటున్న డాక్టర్ ఇంకెంత క్షోభ అనుభవిస్తుందో?
ఇదంతా ఓ పథకం ప్రకారం తను ఇక్కడనుండి శెలవుపెట్టి వెళ్ళిపోవాలని రాయుడు అలాంటి పరిస్థితులను సృష్టిస్తున్నాడు.
తను రాయుడుపాలెంలో జాయిన్ అయిన నాటినుండి రాయుడికి సింహస్వప్నంగానే వున్నాడు. రాయుడు చేసిన అమానుషాలు పల్లె ప్రజలు లోగడ రిపోర్టు కూడా చేయలేదు. అతను వచ్చిన నాటినుండి ప్రజలలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని రూపొందించాడు. వెనుక రాయుడి హస్తంవున్న అనేక కేసులలో కూపీ తీస్తున్నాడు.
రాయుడిని ఉరికంబం ఎక్కించేదాకా విజయపురి నుండి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు విజయ్.
డాక్టర్ లత ఇంటినుంచి టింకూను తీసుకురావటానికి పోలీస్ స్టేషన్ నుండి కానిస్టేబుల్ ను పంపి ఇంటికి బయలుదేరాడు.
ఇంటి పెరటిలో డాక్టర్ లత టింకూతో బంతి ఆట ఆడుతోంది. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు విజయ్. టింకుతో ఆడుతున్న డాక్టర్ లత తన కళ్ళకి చిన్నపిల్లలా అనిపించింది.
స్త్రీలో కనిపించని రూపం అంటూ లేదనుకున్నాడు. విజయ్ ని చూసి టింకూ "డాడీ" అంటూ చెంగున వచ్చాడు. టింకూని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్న విజయ్ ని డాక్టర్ లత తృప్తిగా చూసింది.
విజయ్ గోడలమీద రాతలకు సారీ చెప్పబోతుండగా వద్దని వారించింది లత.
రెండు ఉన్నత హృదయాల గురించి సంకుచితంగా ఆలోచించినవాళ్ళు సిగ్గుపడాల్సిన క్షణంలో డాక్టర్ లత అక్కడినుండి వెళ్ళిపోయింది.
* * *
ఆరోజు రాత్రి 10 గంటలకు స్టేషన్ లో వుండి పని చూస్తున్నాడు విజయ్. అంతలో ఫోను మ్రోగింది. వూరి చివర చెరకు పొలాలలో రాయుడు అతని అనుచరులు భోజనం చేస్తున్నారని సమాచారం చెప్పి ఫోను పెట్టేశాడు అవతలి వ్యక్తి. విజయ్ స్టేషన్ లో వున్న కానిస్టేబుళ్ళను తీసుకుని రివాల్వర్ లోడ్ చేసుకుని బయలుదేరాడు.
కీచురాళ్ళ అరుపులతో గుబురు పొదలతో వున్న చెరకు తోట సమీపించి అక్కడ వెదికారు. అక్కడ మనుషులు ఎవరూ వచ్చిన జాడ లేదు. ఒకవేళ తనని తప్పుదోవ పట్టించటానికి రాయుడు అలా ఫోన్ చేయించాడా అన్న అనుమానంతో విజయ్ రివాల్వర్ బయటకు తీసి వెనుదిరిగాడు. అప్పటికే చెట్లమాటున వున్న వ్యక్తులు పోలీసులమీద బాంబులు విసిరారు.
విజయ్, సిబ్బంది తప్పించుకోవటానికి ప్రయత్నించినా మరో మార్గంలో కొందరు బాంబులు విసిరారు. "రాయుడు జిందాబాద్" అంటూ అక్కడినుండి పారిపోయారు.
బాంబులు ప్రేలి విజయ్ కి, సిబ్బందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
విజయ్ పరిస్థితి అయోమయంగా వుంటే అతన్ని క్వార్టర్స్ హాస్పటల్ కి తరలించారు.
ఉన్నతాధికారులు దర్యాప్తుకు వచ్చారు. వార్త విన్న విజయపురి ప్రజలలో ఆవేశం కట్టలు తెగింది. ఇల్లు తగులబెట్టారు. ఆ సమయంలో రాయుడు అక్కడ వుంటే వాళ్ళ కోపాగ్నికి సజీవంగా తగలబడిపోయేవాడు.
ఉన్నతాధికారులు క్యాంపు చేశారు. దర్యాప్తు చేశారు. 24 గంటలలో రాయుడిని అతని అనుచరులను అరెస్ట్ చేశారు.
విజయ్ కోలుకుంటున్నాడు. దురదృష్టం అతన్ని వెన్నంటి వుంది. కుడికాలు, కుడిచేయి ఆపరేషన్ చేసి తీసేశారు.
స్పృహలోకి వచ్చిన విజయ్ తనని అవిటివాడిని చేసేకన్నా సజీవంగా తగలబెట్టి వుంటే తనకా క్షోభ వుండేది కాదని విలపించాడు.
ఉన్నతాధికారులు, గ్రామ ప్రజలు తండోపతండాలుగా వచ్చి విజయ్ ని పరామర్శించి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నారు.
డాక్టర్ లత టింకు సంరక్షణను తీసుకుంది. విజయ్ మరల మామూలు మనిషిగా అవ్వాలని అతని వెన్నంటి హాస్పటల్ లోనే వుంది.
