విజయ్ పోలీసుశాఖలో యాదృచ్చికంగా చేరలేదు. విజయ్ తండ్రి రావు కూడా పేరుమోసిన పోలీస్ ఆఫీసర్. రౌడీలకు సింహస్వప్నం. అరాచకశక్తుల ఆటలు కట్టించి నీతి నిజాయితీలతో నిప్పులాంటి మనిషిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు.
అటువంటి ఆఫీసర్ ను ఒకరోజు అర్ధరాత్రి దుండగులు కొందరు అమానుషంగా కాల్చి చంపారు.
ఆరోజు తండ్రి శవాన్ని చూసిన విజయ్ లోని యువ రక్తం ఆవేశంతో పొంగింది. కర్తవ్యం బోధపడింది. తండ్రి తలపెట్టిన యజ్ఞం తను పూర్తిచేయాలి. సంఘ విద్రోహుల ఆట కట్టించి సమాజానికి మేలు చేయాలి. తండ్రికి తగ్గ తనయుడని పేరు తెచ్చుకోవాలి. తల్లి పోలీస్ శాఖలో చేరవద్దని ఆంక్ష పెట్టినా పోలీస్ శాఖలో చెరి ఉన్నత విలువలను కాపాడి మంచి ఆఫీసర్ అని పేరు తెచ్చుకున్నాడు.
డ్యూటీ విషయంలో రాత్రనక పగలనక విచక్షణ లేకుండా విసుగు విరామం లేకుండా పనిచేశాడు.
తన జీవిత భాగస్వామి రూప టింకుకు జన్మనిచ్చి అనారోగ్యంతో కన్నుమూసింది. డాక్టర్ కేవలం విజయ్ డ్యూటీ, డ్యూటీ అంటూ ప్రజాసేవకు అంకితమైయిపోయి, రూప ఆరోగ్యం గురించి పట్టించుకోనందున సకాలంలో ఆమెకు సరియైన వైద్యం చేయనందువలనే చనిపోయింది అనటంతో విజయ్ మనసు విరిగిపోయింది.
జీవితంలో తను ఒకే ఒక ఘోరమైన తప్పు చేశాడు. తన ప్రియాతి ప్రియమైన అర్ధాంగి తన అశ్రద్ధ వలన కాలగర్భంలో కలసిపోయింది.
మరల ఇంకో తప్పు చేయకూడదనే నిర్ణయానికి వచ్చి, టింకును చూసుకుంటూ శేషజీవితాన్ని గడిపివేయాలని ఇంకెవ్వరిని తన జీవితంలోనికి రానివ్వకూడదని ఉద్యోగ బాధ్యతలతో కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు.
విజయ్ జీవితం గురించి తెలుసుకున్న విలేఖర్ల కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇటువంటి ఆదర్శప్రాయుడైన పోలీస్ ఆఫీసర్ గురించి తాము రాసినదానికి పశ్చాత్తాపపడ్డారు.
"ఆదర్శవంతమైన పోలీస్ ఆఫీసర్ కు అడుగడుగున అవాంతరాలు" అన్న శీర్షికతో విజయ్ గురించి ఉన్నతంగా రాయటానికి నిశ్చయించుకున్నారు.
* * *
టింకు సంరక్షణ ఒక సమస్యగా వుంది విజయ్ కి. ఇన్నాళ్ళు వెళ్ళిన చోటల్లా ఎవరో పనివాళ్ళను పెట్టుకునేవాడు. ఎప్పుడు ఎటువంటి సమస్యలు వాళ్లు తేలేదు.
కాని రాయుడిపాలెంలో తను ఎదురుదెబ్బ తినాల్సి వచ్చింది. పనిపిల్ల కక్షలకి బలి అయింది.
టింకు ఆలనా పాలనా చూడటానికి ఎవరున్నారు. తల్లిని తెచ్చుకుంటే రోజూ మరల పెళ్ళిచేసుకోమని, లేకపోతే తను ఆ ఇంట్లో వుండలేనని పేచిపెట్టి తన తమ్ముడి దగ్గరే వుంటుంది. ఎప్పుడన్నా మనవడు గుర్తుకువచ్చినప్పుడు వచ్చి చూసి వెళుతుంది.
ఇప్పుడు టింకు కోసం తల్లి చెప్పినట్లు మరల పెళ్ళి చేసుకుంటే? రూప తన మనసు పుటల నుండి నిష్క్రమించలేదు. రూపను తను మర్చిపోలేకుండా వున్నాడు. కాని టింకు కోసం తను ఏదైనా చేయాలి. రాయుడిని అరెస్ట్ చేసి ఉన్నతాధికార్లకు తన సమస్యను చెప్పి కొన్ని నెలలు సెలవు మీద వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాడు.
రాయుడి గురించి ఉధృతంగా గాలింపు జరుగుతోంది. రాయుడి జాడ తెలియటం లేదు.
విజయ్ డ్యూటి మీద రెండు రోజులు హైదరాబాద్ వెళ్ళాల్సివచ్చింది. టింకు సంరక్షణ ఆ రెండు రోజులు ఎవరికి అప్పచెప్పాలో ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు.
టింకుకు నచ్చచెప్పి రెండు రోజులు జాగ్రత్తగా చూడమని డాక్టర్ లతకు టింకును అప్పగించి హైదరాబాద్ వెళ్లాడు.
* * *
విలేఖరులు విజయ్ గురించి మహోన్నతంగా రాసినది చదివిన రాయుడిపాలెం ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఆత్మవిమర్శ చేసుకున్నారు.
విజయ్ వాళ్ళ మనసులను గెలిచాడు. ప్రతి మనిషి మనిషిగా మారాడు. అతను ఇప్పుడు ఆ గ్రామ ప్రజలకు ఓ ఆత్మబంధువు, యుగపురుషుడు, నాయకుడు.
విజయ్ మీద వాళ్ళకు వున్న భక్తిభావంతో గాని, గౌరవభావంతో గాని రాయుడిపాలెం వూరి పేరును విజయపురిగా మార్చాలని నిశ్చయించుకుని పంచాయితీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గ్రామ పెద్దలు కలెక్టర్ గారిని కలసి విన్నవించుకున్నారు. చిరునవ్వుతో అంగీకరించారు కలెక్టర్. ఆనాటి నుండి రాయుడిపాలెం పేరు విజయ్ పేరుతో విజయపురిగా మారింది.
విజయ్ తన్ను గౌరవించిన ప్రజలను మరచిపోలేక విజయపురినే తన స్వగ్రామంగా చేసుకున్నాడు. తన రిటైర్ మెంటు తరువాత అక్కడ వుంటానని ప్రజలకు వాగ్దానం చేశాడు.
రాయుడు అజ్ఞాతవాసంలో వున్నాడు. అయినా ఎప్పటికప్పుడు రాయుడిపాలెం విషయాలు తన అనుచరుల ద్వారా తెలుసుకుంటున్నాడు. విజయ్ టింకును డాక్టర్ లత ఇంట్లో వదిలి హైదరాబాద్ వెళ్ళినట్లు తెలుసుకున్నాడు.
విజయ్ ని రాయుడిపాలెం నుండి వెళ్ళగొట్టేందుకు పథకం ఆలోచించాడు. రాత్రికి రాత్రి దాన్ని అమలుపరచటానికి తన అనుచరులను రాయుడిపాలెం పంపాడు.
