Previous Page
ది సెల్ పేజి 35


    విజయ్ లో చివరగా జీవితంలో ఒకే ఒక ఆశ మిగిలింది. తన తండ్రి తలపెట్టిన యజ్ఞంలో తండ్రి సమిధ అయ్యాడు. తను కొనసాగించిన మహాయజ్ఞంలో తను కేవలం సమిధగానే కాలిపోకూడదు. ఫలితం ఉండాలి. అది సమాజానికి చెందాలి.
    రాయుడికి ధర్మదేవత ఉరికంబానికి తీసుకువెళ్ళాలి. రాయుడిమీద కేసులలో సాక్ష్యాలు చెప్పేదాకా తను బ్రతికి వుండాలి. దుష్ట శిక్షణ జరగాలి.
    అకుంఠిత దీక్ష పట్టుదలతో సాక్షులను, సాక్ష్యాధారాలతో రాయుడిమీద సెషన్స్ కోర్టులో సాక్ష్యం చెప్పించాడు. పర్యవసానం రాయుడికి యావజ్జీవ కారాగారవాసం పడింది.
    రాయుడు హైకోర్టులో అపీల్ చేశాడు. పర్యవసానం శిక్ష కొట్టివేశారు.
    ఆ వార్త విన్న విజయ్ మనసు మనసులో లేదు. హృదయం విలవిలలాడింది. జీవితం మీద విరక్తి, అంతకు మించి కక్ష కలిగాయి.

                                                                  *    *    *

    గత చేదు జ్ఞాపకాల నుండి విజయ్ డాక్టర్ లత వాస్తవంలోకి వచ్చారు.
    డాక్టర్ లత విజయ్ కి నచ్చచెప్పబోయింది. విజయ్ అన్నిటికి అతీతంగా వున్నాడు.
    బయట ఆడుకుంటున్న టింకు తండ్రి దగ్గరకి వచ్చాడు. అతని మౌనం వెనక బడబాగ్ని రగులుకుంటున్నట్టు ఆ పసి హృదయం పసిగట్టిందేమో !
    "డాడి మనం ఈ వూరి నుండి వెళ్ళిపోదాం" అన్నాడు. విజయ్ లేచాడు. టింకు అతన్ని అనుసరించాడు.
    డాక్టర్ లతకు విజయ్ ను ఆపగలిగే శక్తి లేదు. రిక్షా ఆపి సూట్ కేసులు లోపల పెట్టింది. విజయ్ టింకు రిక్షా ఎక్కారు.
    న్యాయం, ధర్మం, నీతి నిజాయితీల మీద నమ్మకం పోయిననాడు మానవుని మనుగడే కష్టం అవుతుంది. దర్యాప్తు దోషమో! విధానాల దోషమో? పురాతన చట్టాలు నేటి సంగతులకు అనుకూలంగా లేకపోవటమో? కారణం ఏదైతే గాని ఉరిశిక్ష అనుభవించవలసినవాడు శిక్ష తప్పించుకున్నాడు.
    లోపం ఎక్కడ వుంది అన్న ఆలోచనలతో విజయ్ సతమతమౌతున్నాడు.
    ఈ రోజు తనకు, తన వ్యవస్థకు జరిగిన అన్యాయాలకు న్యాయదేవత బలి అయిపోయింది.
    విజయపురి పొలిమేరలకు చేరిన విజయ్ వెనుతిరిగి వేశాడు. వెనుక రిక్షాలో డాక్టర్ లత సూట్ కేసుతో వస్తూంది. డాక్టర్ లతే కాదు లత వెనుక ఆ గ్రామంలో హృదయం వున్న ప్రతి వ్యక్తి విజయ్ వెనుక బయలుదేరారు.
    వూరు దాటుతున్న విజయ్ ని చూసి రాయుడు మీసం మెలివేశాడు.
    ఇన్ స్పెక్టర్ విజయ్ రిక్షా దిగాడు. డాక్టర్ లత అతని చేయి పట్టుకుని ఆపింది.
    విజయపురి వాసులు విజయ్ కి అవకాశం ఇవ్వలేదు. అతను తలపెట్టిన మహా యజ్ఞం కొనసాగుతుంది.

                                           *    *    *

    విజయపురి ఇప్పుడు ఆదర్శ గ్రామం. విజయ్ ఆ గ్రామానికి దేవుడు.
    టింకు ఇప్పుడు విజయపురికి కొత్తగా పోస్ట్ చేయబడిన పోలీస్ ఆఫీసర్.

                                                         * సమాప్తం *


 Previous Page

WRITERS
PUBLICATIONS