"ఆహా, బయల్దేరాడండీ పెద్ద పురోగామి. ఈవిధంగా ఆచార్యుని దయ్యాల మధ్య తిరగనిస్తే ఏమవుతాడు? అతనికేదయినా జరిగితే మనం వూళ్ళో తలెత్తుకుని తిరగగలమా!" ప్రశ్నించాడు కవి. రమణ ఆలోచనలో పడ్డాడు.
"నేను దయ్యాల మధ్య తిరుగుతున్నానని నీకెవరు చెప్పారు. రాత్రి ఏమయినా కలగన్నావా? సోదిలో వచ్చినదా?" నా ప్రశ్న.
"దయ్యాలకోసం కాకపోతే ఏమయినా నిధులు కోసం వెదుకుతున్నావా ఏమిటి కొంపతీసి?" కవి ప్రశ్న.
ఔను, నిధుల కోసమే తిరుగుతున్నానని మనసులో అనుకున్నాను. ఈ సమాజంలో మనిషి బ్రతకటానికి డబ్బు చాలా ప్రధానమయిన అవసరం. కాని సామాజిక స్పృహతో ఆలోచిస్తే అంతకన్నా ప్రధానమయిన అవసరాలు చాలా ఉన్నాయి. నేను చూచినంతలో యీ సామాజిక స్పృహ కలిగినవాళ్ళు చాలా అరుదుగా కన్పించారు.
ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క ప్రదేశంలో, కొందరి మధ్య లేకపోతే జీవితం వృధా అనిపిస్తుంది. మరొక కాలంలో, మరొక ప్రదేశంలో, మరికొందరి మధ్య కాయకష్టం లేకపోతే జీవితం వృధా అనిపిస్తుంది. అలాగే యెన్నో కాలాల్లో, యెన్నో దేశాల్లో వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్నప్పుడు వాటికి అనుగుణమయిన అంశాలు లేకపోతే జీవితం వృధా. కాబట్టి యీ జీవితానికి ప్రయోజనం దేశము, కాలము, పాత్రత అనే మూడు అంశాల్ని బట్టి నిర్ణయమవుతుంది. ఈ జీవితానికి అర్ధమూ, పరమార్థమూ కాలాన్ని బట్టి మారిపోవచ్చు. పాత్రతను బట్టి మారిపోవచ్చు. ఒకప్పుడు కన్యాశుల్కం రోజుల్లో ఆడపిల్ల పుడితే సంతోషించిన తల్లిదండ్రులు ఇప్పుడు మగపిల్లలు ఎక్కువగా కావాలని కోరుకుంటున్నారు. ఇదే కాలం జీవితం మీద చూపే ప్రభావం.
అమెరికాలో భర్త విడాకులిస్తే మరొక వరుణ్ణి యెన్నుకుని జీవితాన్ని సంతోషంతో నింపుకునే అవకాశ మేర్పడుతుంది. ఆడపిల్లలకది మంచి అవకాశం. అదే మన దేశంలో భర్త విడాకులివ్వటానికి సిద్ధమయితే ఆ పిల్ల హృదయంలో స్పందనలు ఎలా వుంటాయో పరిశీలించండి. ఇది దేశ దేశానికి మారే పరిస్థితులు జీవితంమీద చూపే ప్రభావం ఇది మనం మార్చగలిగేదా? లేనిదా?
ఒకడు అబద్దాలతో, లంచగొండి జీవితంతో సమాజంలో ఉన్నత స్థాయికి యెదుగుతాడు. అతడిని అనుసరించబోయిన మరొకడు జైలుపాటు కావచ్చు. సమాజం చేత బహిష్కృతుడయినా కావచ్చు. యదార్థం చెప్పి వొక్కడు గొప్ప పేరు సంపాదించవచ్చు. అదే యదార్థాన్ని చెప్పి ఒక్కొక్కడు తన సర్వస్వాన్ని కోల్పోవచ్చు. ఇది పాత్రత.
ఈ విధంగా మన చేతుల్లో లేని మూడు అంశాలు ఈ జీవితాన్ని నడిపిస్తున్నాయి. ఆ నడకను బట్టి జీవిత సారం ఆయా మనుషులకు దొరుకుతూ వుంటుంది. కాని మానవ మేధస్సులో ప్రకృతి సిద్ధాంతాలను అనుకూలంగానే కాక, ప్రతికూలంగా ఆలోచించే శక్తి వుంది.
ఆ శక్తితోనే అతడు ఈనాడు ప్రకృతితో పోరాడుతాడు. ఈ పోరాటంలో అతడు లాభం పొందనూ వచ్చు. లేదా నష్టపడి పోవచ్చు. నేను చేస్తున్న పని అదే గదా!
కేవలం కొండవీటిని చూడాలన్న ఉత్కఠంతో నేను వచ్చాను. నాకు తెలిసివున్న విషయాన్ని మిత్రులకు తెలియచెయ్యాలని ఉబలాట పడ్డాను. కాని, ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి? నన్ను ఏ శక్తులు ఈ విధంగా నడిపిస్తున్నాయి. నేను చూస్తున్న విషయాలు యదార్ధాలా? స్వప్నాలా? ఇది కావాలన్నప్పుడు లభించే అవకాశం కాదని ఈరోజే తెలుసుకున్నాను కనుక ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ నాకు ఇది లభించకపోవచ్చు. వేమాంబ సోమదేవుల పర్యవసానం ఏమయిందో! అది ఈ రాత్రికి తెలుస్తుందా ఏమో! గ్యారంటీ ఏమిటి?
"ఈ దృశ్యాలను నేను చివరకంటా చూడగలిగితే గొప్ప నిధి దొరికినట్లే కదా" అది డబ్బుతో కూడినది కాకపోవచ్చు. అందులో మణులూ మాణిక్యాలూ వుండకపోవచ్చు. చరిత్రపుటల్లో చెరిగిపోయిన ఒక కమనీయగాధ వుంటుంది. కమ్మని కమ్మని కావ్యమవుతుంది. అది నిధి కాదా?"
"బాబోయ్ ఏమిటా దయ్యం చూపులు మనలోకంలో వున్నావా? మళ్ళీ ఆ దెయ్యాలు నెత్తికెక్కాయా? కవిగారి కేక.
"మిత్రమా! దయ్యంకన్నా మొండివాడు ఘనుడన్న ఇంగ్లీషు సామెత విన్నావా? కనుక దయ్యాలను గురించి ఆలోచించటం మానెయ్యి. ఇక నిధుల సంగతంటావా? ఔను. నేను ఒక గొప్ప నిధి కోసం వెతుకుతున్నాను. వివరించాను. "మమ్మల్ని కూడతీసుకు వెడితే భాగం పంచాల్సొస్తుందని నువ్వు ఒక్కడివే తగలడు తున్నావన్నమాట?" కవి వాక్కు. "మీకు కూడా ధైర్యముంటే తగలడొచ్చు" అన్నాను.
"మనం పగలు పూట తగలడకూడదా అని. రాత్రిళ్ళే తగలడాలని రూల్సా" కవి తన భయాన్ని బయటవేశాడు.
"అవును మరి నువ్వన్నట్టు దయ్యాలతో కదా నేను స్నేహం కట్టింది, అవి కనిపించేది రాత్రిళ్ళే కదా? మన రూల్సుకు అవి లొంగుతాయా. నీకు భయం కలుగుతోందని పగలే కన్పిస్తాయా" నా ప్రశ్న.
"కవిశేఖరా! ఏమిటా మిడిగ్రుడ్లు. ఇక చెప్పు సమాధానం" రమణ కవ్వించాడు. కవిగారి భయం రెట్టింపయింది.
"ఈరోజు రాత్రికి అందరమూ కలసే వెళ్ళాలి రమణ రెట్టించాడు" రేపు ఆఫీసుకి శలవు లేదు. కాకపోతే..." నీళ్ళు నములుతున్నాడు కవి. రమణకి జాలేసి ఆ విషయం వదిలేశాడు. అ"ఆఫీసుకి శలవు పెట్టకముందు మటుకు నువ్వెప్పుడు ఆఫీసులో అఘోరించావు? జీతాలు తీసుకునే రోజు తప్ప!" రమణ చెప్పింది యధార్థమే! కవిగాడు వి.ఎల్.డబ్ల్యు ఉద్యోగం వెలిగిస్తున్నాడు. ఏ రోజూ ఆఫీసులోనేమో క్యాంపు రాసుంటుంది. మనిషేమో తను రాసిన గేయాల్ని తనే కూనిరాగాల్లో ఆలపిస్తూ ఇంట్లో పడుంటాడు. జీతాలిచ్చే రోజుమటుకు ఆఫీసులో క్యాంపని రాసుండదు. కవి ఇంట్లోనూ వుండడు. వాడి కూనిరాగాలు కరువయ్యాయని బెంగతో గదిగోడలు బిక్కుబిక్కుమంటూ ఉంటాయి? అయితే ఈ స్థితికి నేనెప్పుడూ కవిని హేళన చేసి ఆలోచించలేదు. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళమీదే నడుస్తుంది.
