సీ. పోలుపొందగఁ విభూతిబొట్టు నెన్నోసలిపైఁ
దళుకొత్తుచెమట కుత్తల పడంగ
సొగసుగాఁ బూదండ జోఁపినకీ ల్గోప్పు
జాఱఁగా నొక చేత సరుదుకొనుచు
బిగిచన్నుఁగ వమీఁద బిరుసుఁ బయ్యెద చెంగు
దిగజాఱి శివసూత్రమగ పడంగ
ముక్కున హురుమంజిముత్యాల ముంగర
కమ్మ వాతేఱ మీఁద గంతులిడఁగ
గీ. కౌను జవ్వాడ మట్టియల్ గదిసి మ్రోయఁ
గమ్మవిలు కాని జాళువా బొమ్మయనఁగ
మెల్ల మెల్లన సింహాద్రిమీఁద కేఁగెఁ
గన్నె పూఁబోఁడి యగసాలి వన్నె లాఁడి. 311
అక్కడఁ దంబురా చేతఁబూని గానము సేయుచు వచ్చు సాతాని వెలఁ దిపైఁ జెప్పినది.....
సీ. మీఁగాళ్ళ జీరాడు మేలైన కుచ్చెళ్ల
తీరున మడిచీర తీర్చి కట్టి
బిగువుగుబ్బల మీఁద నిగనిగ ల్దళుకొత్తు
నోరపయ్యెద కొంగు జాఱవైచి
వలవల ఆకొకవింత గలుగఁగా గొప్పలౌ
కురులు నున్నగా దువ్వి కొప్పువెట్టి
నెలవంక నామంబు సలలితంబుగ నుంచి
తిరుచూర్ణ మామీఁదఁ దీర్పుచేసి
గీ. ఓరచూపుల విటులఁ దా నూరడించి
గిల్కు మెట్టేలరవరవల్ గుల్కరింపఁ
జికిలి చేసిన తామ్రంపుఁ జెంబు వూని
వీధి నేతెంచె సాతాని వేడ్క లాఁడి. 312
అట దుకాణమునఁ దములపాకులు కొనఁబోయి చెప్పినది.-
చ. తొలకరిమించుఁ దీవగతి తోఁవ దుకాణము మీఁద నున్నయ
య్యాలికులవేణితోఁ దములపాకుల బేరము లాడఁబోయి నే
వలచుట కేమి శంకరుని వంటి మహాత్ముఁడు లింగరూపియై
కులికేడు దాని గబ్బిచనుగుబ్బలసందున నాట్య మాడఁగ? 313
ఉ అంగడి వీధిఁ బల్లవుల కాసగ మామిడి పండు లమ్ముచు
జంగమువారి చిన్నది పిసాళితనంబునఁ జూచెఁబో నిశా
తాంగజబాణ కైర వసితాంబుజ మత్త చకోర బాలసా
రంగతటిన్నికాయముల రంతులు సేసేడు వాఁడి చూపుల. 314
సీ. బాలేందు రేఖ సంపద మించి విల్లసిల్లు
నొసటితళ్కూలనీటు నూఱు సేయు
భ్రమరికాహరినీలచమర వాలములఁ బోల్
వేణీభరము చాయ వేయు సేయు
దర్పణద్విజరాజదాళదళ్య ప్రభ
లావన బింబస్పూర్తిలక్ష సేయు
కోకహటకశైలకుంభికుంభారాతి
కుచకుంభయుగళంబు కోటి సేయు
గీ. జఘనసీమకు విలువ లెంచంగ వశమె
దీని సౌదర్యమహిమంబు దేవుఁ డేఱుఁగ
నహహః యేబ్బంగి సాటి సేయంగవచ్చు
భావజుని కొల్వు జంగముభామచెల్వు. 315
మ. విమలాంభోరుహపత్ర జైత్రములుగాఁ బెంపారు నేత్రమ్ముల
గమనీయంబగుక జ్జలం బునిచి రేఖా సౌష్టవం బొప్ప నా
యమునాఱై కయు దాఁటి పూఁవచను లొయ్యారంబు సూవ దుకా
ణముపై బొందిలి దొర్తూ నిల్చే ముఖ చంద్రస్పూర్తి శిభిల్లఁగ. 316
నీలాటి రేవున స్నానమునకై యరిగి యచ్చటనున్న నానావనితలఁ జూచి చెప్పిన పద్యములు.....
ఉ. వీసపుముక్కు నత్తు నరవీసపు మంగళసూత్ర మమ్మిన
గాసునురానికమ్మ లరకాసునుగానివి పచ్చపూసలు
మాసిన చీర గట్టి యవమాన మోసంగఁగ నేఁడు రాఁగ నా
కాసల నాటి హరికన కాంగిని జూచితి నీళ్ళ రేవున 317
క. పూజారి వారి కోడలు
తా జాఱఁగ బిందె జారి డబ్బునఁ బడియే
మైజాఱు కొంగు దడిసిన
బజారే తిరిగి చూచి పక్కున నవ్వే. 318
శా. పొచ్చెం బొంతయు లేని హంసనడతోఁ బొల్పోందు లేనవ్వుతోఁ
బచ్చల్దాపినకుల్కు ముంగరులతో బాగైన కెమ్మోవితో
నచ్చం బైనముసుంగు వెట్టి చెలితో నామాటలే యాడుచు
వచ్చెంబో కుఛకుంభముల్ గదలఁగా వామాక్షి తా నీళ్ళకు. 319
ఉ. శ్రీకర భూషణంబులును సిబ్బేపుగుబ్బలు ముద్దుఁ జెక్కులు
గోకిలవంటిపల్కులును గొల్చినఁ జేఱులఁ గేరుకన్నులు
బ్రాకట దేహకాంతియును బంగారుబొమ్మకు హెచ్చు వచ్చు నీ
చాకలవారి జవ్వనికి సాటికిరా రిఁకఁ దొంటి జవ్వనుల్. 320
క నీలాటి రేపు లోపల
మేలిమితో ఁ దీర్చినట్టు మెఱసి నిలుచుచు
దాలిమిని వాలుఁజూపుల
బాలామణి గుట్టు బైట ఁబడఁగాఁ జూచె. 321
కొండవీట నిన్నప్పు డెడనెడఁ బల్నాటి సీమకు శ్రీనాధుఁడు పోవుచుండేడివాడు. పల్నాటిసీమపై నీతనికిఁ గల యనాదరము ననేక పద్యములఁ బట్ తెలిసికొననగు. పల్నాటి వారికిఁ గారెమపూడిఁ కాశియట.
ఉ|| వీరులు దివ్యలింగములు విష్ణువు చెన్నుఁడు కళ్లి పోతురా
జారయఁ గాలభైరవుఁడు నంకమశక్తియ యన్నపూర్ణయు
గేరేడు గంగధారమడుఁగే మణికర్ణిక గాఁ జెలంగు నీ
కారేమపూఁడి పట్టణము కాశి గదా పలినాటి వారికి. 322
పల్నాటి సీమపై నీతనికిఁ గల యనాదారము.
క|| రసికుఁడు పోవఁడు పల్నా
డేసఁగంగా రంభయైన నేకులే వడుకు
వసుదేశుఁడైన దున్నును
గుసుమాస్త్రుం డైన జొన్నకూడె కుడుచు. 323
పల్నాటిసీమలో నెంతో లోఁతు త్రవ్వినఁగాని నీళ్ళూరవు. అక్కడి చేఁత్రాళ్ళు కొండవీటి చేఁత్రాళ్లకు ద్విగుణితములై యుండవలయును. అంతలోఁతు త్రవ్వినను గొన్ని చోట్ల నీరూరక రాతిచట్టు వచ్చును; కాన నీళ్లకై యెంతో సొమ్ము భంగపడవలసి వచ్చుచుండును. ఈ విషయమునఁ జెప్పినపద్యము.
ఉ|| అంగడి యూరలేదు వరియన్నములేదు శుచిత్వమేమిలే
దంగన లింపులేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగఁ బాల్పడుకృపావరు లెవ్వరులేరు దాత లే
న్నంగను సున్న గాన పలినాటికిఁ మాటికిఁ బోవ నేటికి?. 324
పల్నాటి ప్రాంతములందు గ్రామమున కేవ్వరేని పెద్దలు వచ్చిన గ్రామ పురోహుతునింట విడిదల సేయింతురు. శ్రీనాధుఁడొక పురోహితునింట విడిసి యచ్చటి రోఁత నిట్లు వర్ణించే. (ఆవైపులఁ బురోహితు లూరిలోని తమ యాశ్రి తులయిండ్ల కనుదినమును విస్తళ్ళు కుట్టి యిచ్చుచుండవలెనఁట! దానికై ! నిల్వ చేసి యుంచుకొన్న విస్తరాకులు గలవు).
ఉ|| దోసెఁడు కొంపలోఁ బసుల త్రోక్కిడి మంచము దూడరేణము
బాసిన వంటకంబు వసిబాలురశౌచము విస్తరాకులు
మాసినగుడ్డలు దలకుమాసిన ముండలు వంటకుండలు
రాసేడుకట్టేలుం దలఁపరాదు పురోహితులింటి కృత్యముల్. 325
