Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 33


    "సుందరి చాలా అదృష్టవంతురాలు! మీవంటి నిస్వార్థ ప్రేమికుడ్ని నిజంగా అభినందించాలి!" బిందుమాధవి మనస్ఫూర్తిగా అంది.
    "నో, నో! సుందరి నిజంగా దురదృష్టవంతురాలు. వారిని ప్రేమించడమే ఆమె చేసిన పెద్ద నేరం. అందుకే శిక్ష అనుభవించింది. ఏ స్త్రీ కూడా కలలో అయినా తన ప్రేమికుని నుంచి అలాంటి జవాబు ఆశించదు. వాస్తవం కాకపోయినా, ఇన్ స్పెక్టరుగారు జోక్ గా అన్నది ఆమె పాలిట శాపమయింది" అంది అనూష ఆవేశంగా.
    "పిచ్చి అనూషా! ఇందులో ఇన్ స్పెక్టరుగారి తప్పేం వుంది! వారేమీ ఆమెను మోసం చేయలేదు కదా! ఇప్పటికీ ఆమెనే ధ్యానిస్తూ బ్రహ్మచారిగా ఉండిపోలేదూ!" అంది సమర్థిస్తూ బిందుమాధవి.
    "ఆంటీ! అబద్ధం చెప్పి మోసం చేయడం నేరం కాదా? ఏది ఏమైనా నష్టపోయింది ఆడపిల్లే కదా!" అసహనంగా అంది సాహితి.
    "టీ చల్లారి పోతున్నది మేడమ్!"
    అప్పుడే మాయ మరొకసారి టీ కప్పులు టీపాయ్ మీద పెట్టడం గ్రహించి అన్నాడు వీరేష్.
    అందరూ టీ తాగుతుండగా తనో కప్పు తీసుకుంటూ, "నా కథ చెప్పి బోర్ కొట్టిస్తున్నట్టున్నాను." అన్నాడు.
    "భలేవారే! అలా ఎందుకనుకుంటున్నారు? జీవితంలో అన్నీ పోగొట్టుకుని మీరు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారో ఆశ్చర్యంగా ఉంది. మీ మనో నిబ్బరం చూసి ఎంతైనా నేర్చుకోవాలి" అంది ప్రశంసగా అనూష.
    "ఇక వెళ్దాం!" అంటూ బిందుమాధవి లేచింది.
    ఆమెతోపాటు అందరూ లేచారు.
    వీరేష్ గేటు వరకు వెళ్ళి వీడ్కోలు చెప్పి వచ్చాడు.
    గోడకు వేలాడుతున్న ఫోటోను, పూలదండను చూసి తనలో తానే ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు.
    మాయ అతన్నే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.


                               *    *    *    *


    బిందుమాధవి మనసిప్పుడు ప్రశాంతంగా ఉంది.
    అనూష, సాహితి చిన్నపిల్లలేమీ కారు. వాళ్ళకు తెలివితేటలతో పాటు ధైర్యసాహసాలు కూడా ఉన్నాయి.
    ఈ సమాజంలో ఒంటరి స్త్రీ ఎన్ని కష్టాలెదుర్కొంటుందో తనను చూసి ప్రత్యక్షంగా తెలుసుకోగలిగారు.
    పరోక్షంగా ఇన్ స్పెక్టర్ వీరేష్ జీవితం తెలుసుకుని సుందరి, మాయ ఎలా మోసపోయారో తెలుసుకున్నారు.
    ఇప్పుడు వీళ్ళకు జీవితపు విలువలు తెలిశాయి. ఈ సమాజంలో ఆడపిల్ల ఎన్ని ముళ్ళపొదలను తప్పించుకుని అడుగువేయాలో తెలుసుకున్నారు. ఇక వీళ్ళ నడవడిలో మార్పు వస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నది బిందుమాధవి.
    వీళ్ళిద్దరూ సమ్రాట్ నిజస్వరూపాన్ని అర్థం చేసుకుంటే ఇన్ స్పెక్టర్ వీరేష్ ఎదుట సమ్రాట్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించడం ఏమంత కష్టమైన పని కాదు.
    ఒక్క కుదుపుతో ఆగింది కారు.
    బిందుమాధవి త్రుళ్ళిపడింది. వెంటనే ఆలోచనలను పక్కకు నెట్టి వాస్తవంలోకి చూసింది.
    కారును ట్రాఫిక్ బీట్ లో వున్న లేడీ కానిస్టేబుల్ దగ్గర ఆపింది సాహితి.
    కారులో ఎవరన్నా పోలీసు ఆఫీసరు ఉన్నారేమోనని పరుగు పరుగున వచ్చి లేడీ కానిస్టేబుల్ సెల్యూట్ కొట్టింది.
    "చూడండి ఆంటీ! ఈమెను సరిగ్గా చూడండి!" అనూష గబగబా అంది.
    బిందుమాధవి ఆమెను నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసింది. మరుక్షణమే ఆమె ముఖం వివర్ణమయింది.
    "ఆంటీ! ఈమె ఇన్ స్పెక్టరు వీరేష్ గారి ప్రేమికురాలు సుందరి కదూ!" అంది సాహితి ఆశ్చర్యంగా.
    బిందుమాధవి మౌనం వహించింది.
    "భగ్న ప్రేమికుడికి సుందరి ఇక్కడే ఉందని కబురుపెడితే బావుంటుంది" అంది అనూష కవ్వింపుగా.
    బిందుమాధవి హృదయంలో కలవరం మొదలయింది. ఈ కాలపు ఆడపిల్లలు ఆవలిస్తే పేగులు లెక్కపెడతారనిపించింది. ఆడపిల్లలకు చక్కగా కనువిప్పు కలిగేలా వీరేష్ ఇంటికి పిలిచి కట్టుకథలు అల్లి బాగా నటించాడనుకుంది. సాహితి, అనూష ఆలోచనలలో మార్పు తప్పక వస్తుందనుకుంది.
    కాని వీరేష్ వేసిన పథకం ఇంత తొందరలోనే బెడిసికొడుతుందని తను కలలో కూడా అనుకోలేదు.
    "మీ ఆఫీసరుగారి భార్య ఏ ఆస్పత్రిలో ఉన్నారో నీకు తెలుసా?"
    అనూష ప్రశ్నకు లేడీ కానిస్టేబుల్ అటెన్షన్ లోకి వచ్చి సెల్యూట్ కొట్టింది. తెలుసునన్నట్టు బుర్ర వూపింది.
    "ఒకసారి ఆస్పత్రి చూపించు. మేడమ్ గారిని పలకరించి వస్తాము. బైదిబై నీ పేరు?" అడిగింది అనూష.
    అలానే వస్తానని తలూపి తన పేరు చెప్పింది లేడీ కానిస్టేబుల్ శ్రీలత.
    సాహితి కారు తలుపు తెరిచింది. శ్రీలత వచ్చి కూర్చుంది. శ్రీలత చెప్పిన ఆస్పత్రి ముందు కారు ఆపింది సాహితి.
    మెటర్నిటీ వార్డులోకి వెళ్ళింది అనూష. నెలలు నిండిన అరుణ తన క్లాస్ మేట్ అనూషను చూస్తూనే ఆప్యాయంగా కౌగిలించుకుంది.
    "ఏమే! నా పెళ్ళికి రాలేదు. చివరికి ఈ సమయానికి వచ్చావన్నమాట?" అంది నిష్టూరంగా అరుణ.
    అరుణను మిసెస్ వీరేష్ గా వాళ్ళందరికీ పరిచయం చేసింది అనూష.
    వాళ్ళిద్దరూ మాటలలో వుండగానే లేడీ కానిస్టేబుల్ మీనాక్షి క్యారేజీ తీసుకుని గదిలోకి వచ్చింది.
    వాళ్ళను చూడగానే నాలిక్కరుచుకుని, అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది.
    "ఇక నీ 'మాయ' నాటకం చాలించవమ్మా!" అసలు అవతారం తెలిసిపోయినట్టు అంది అనూష నవ్వుతూ.
    మీనాక్షి ఉరఫ్ 'మాయ' తెల్లబోయింది.
    జరిగిందంతా తెలుసుకుంది అరుణ. అంతా హాయిగా నవ్వుకున్నారు.
    వాళ్ళంతా ముచ్చట్లాడుతుండగా ఒళ్లు మండిన బిందుమాధవి లేచి వెళ్ళిపోయింది.
    బయట కారు స్టార్టు అయిన శబ్దం విని సాహితి, అనూష ముసిముసిగా నవ్వుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS