ఇదంతా ఆలోచించేసరికి ఎవరికి వారికి అంతులేని నీరసం ఆవరించింది.
ఎన్నివిధాల ఆలోచించినా, ఒకే మార్గం తప్ప రెండో మార్గం కనిపించలేదు.
ప్రయాణీకులలో కాస్త వయసు వున్న కుర్రాడిని పట్టుకొని, "నువ్వు నడిచివెళ్ళరా బాబూ!" అంటే__ "నాకు నడవటానికైతే బలముంది గానీ, మాట్లాడటానికి భయం. నేను చస్తే వెళ్ళను." అన్నాడు వాడు.
"నేను వెళదామంటే, నేను నడవలేను. పది అడుగులు వేస్తే చాలు, కాళ్ళు తిమ్మిరిలు ఎక్కిపోవటమూ, కాళ్ళ నొప్పులు." ఎవరూ అడగకపోయినా చెప్పాడు పుండరీకాక్షయ్య.
అందరూ అలా తర్జనభర్జన పడుతూండగా, బస్సు హారన్ వినిపించింది.
"అదిగో బస్ హారన్ వినిపించిందా?" ఆనందంగా వాళ్ళలో ఒకతను అరచి మరీ చెప్పాడు.
"అవును. వినిపించింది. అది నిజంగా బస్ హారనే" అన్నాడు ఇంకొక ఆయన.
"హారన్ వినిపించింది అంటే బస్సు వస్తున్నట్లే కదా?" అన్నాడు పండరీకాక్శయ్య.
"వస్తున్నట్లేమిటండీ, అదిగో వస్తూంటేనూ!" దూరంగా కానవచ్చిన బస్సుని చూపిస్తూ అన్నాడు ఆయన.
బస్సుని చూడంగానే అందరి ముఖాల్లో ఆనందం తాండవమాడింది.
బస్సు ఆపమని చెయ్యి వూపుదాం. లేకపోతే వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది!" ఒకతను అన్నాడు.
"చెయ్యి వూపినా కూడా బస్సు ఆగకుండా వెళ్ళిపోయిన సందర్భాలు వున్నాయి కదా!" ఓ అనుమానాలరావు తనకి వచ్చిన అనుమానం వ్యక్తం చేశాడు.
"మనమిలా మీన మేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే బస్సు ఇలా రావటం, అలా పోవటం జరిగిపోతుంది. అన్నింటికన్నా మంచిపని ఏమిటంటే మనందరం కలిసి రోడ్డుకి అడ్డంగా నుంచోవటం."
పుండరీకాక్షయ్య ఆ మాట అనంగానే అందరూ పోలో మంటూ రోడ్డుకి అడ్డంగా నుంచున్నారు.
వాళ్ళా కంగారులో అలా ఆలోచించారు కానీ, వాళ్ళంతా కలిసి రోడ్డుకి అడ్డంగా నుంచోకపోయినా, వస్తున్న బస్సు ఎలాగూ అక్కడ ఆగేది. కారణం అంతక్రితం బస్సు రోడ్డుకి అడ్డంగా.
ఎలాగూ అక్కడే వుంది. స్పీడుగా వస్తున్న బస్సు ఆమడ దూరంగా వుండగానే వీళ్ళని చూడటం జరిగింది. మెల్లగా అప్పుడు తగ్గించుకుంటూ వచ్చి, వీళ్ళ కొద్ది దూరాన ఆగింది.
ముందుగా కండక్టర్ బస్సులోంచి దిగాడు.
"బస్సు ఆపాలంటే ఇదటయ్యా పద్ధతి?..." అంటూ ఏదో అనబోయాడు.
ఈ లోపలే కంగారు కంగారుగా వాళ్ళు జరిగింది టాకీగా చెప్పారు.
అదే బస్సులో డ్యూటీలో లేని కానిస్టేబుల్ ప్రయాణం చేస్తున్నాడు. సమయానికి ఆయన వుండటం కూడా మంచిది అయింది. బస్సులో జరిగిన ఘోరం కానిస్టేబుల్ తో పాటు వచ్చినవాళ్ళందరూ కూడా చూశారు. అతను కొన్ని సూచనలు చేశాడు.
కానిస్టేబుల్ చెప్పిన ప్రకారం, అందరూ అక్కడే ఆగిపోయారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇన్ స్పెక్టర్ ని తదితరులని తీసుకురావటానికి ఇప్పుడు వచ్చిన బస్సే తిరిగి వెనక్కి బయలుదేరింది.
బస్సులో కానిస్టేబుల్ కూడా వెళ్ళాడు.
"మనదోవన మనం వెళ్ళటానికి లేకుండా, పోలీసు డిపార్ట్ మెంట్ అంతా కదిలి వచ్చినదాకా, మనందరినీ ఇలాగే వుండమని చెప్పాడు. ఈ శిక్ష ఏదో చచ్చిన వాళ్లకి కాదు మనకి. మన ప్రాణానికి వచ్చింది ఇదంతా." ఎవరికి వారే నీరసంగా, నిరాశ నిస్పృహలతో రోడ్డుకి ప్రక్కగా కూచుండి పోయారు.
