Previous Page Next Page 
మంచివాడు పేజి 33

జానకి తన తొందరపాటుకు సిగ్గు పడింది. తను ఫుట్ బోర్డు మీదనుంచి కిందపడి వుండేదనే అతను హెచ్చరించి వుంటాడు.
సహనం, సభ్యత, సంస్కారం, శీలం __ ఇవన్నీ
మానవుడి మానసిక స్థితి సరిగా వున్నప్పుడే అతని వెంట వుంటాయేమో!
మనిషి మహానగరాలనబడే కారడవుల్లో నివసిస్తున్నాడా?
ఇక్కడ కూడా మరో ఆటవిక నాగరికత పెరుగుతూ వుందా?
"మీరిక్కడికి వెళ్ళాలి! ఉర్దూలో సన్నగా వినిపించి జానకి చివ్వున తలతిప్పి చూసింది.
జానకి ఆ ప్రశ్న వేసిన స్త్రీని చూసింది.
ఆమె ధరించిన ఎర్రటి నైలాన్ చీరా, ఆకుపచ్చ జాకెట్, విద్యుద్దీప కాంతిలో మిలమిలా మెరుస్తున్నాయి.
మనిషి తెల్లగా పొడవుగా వుంది.
అందమైన ముఖం.
జానకి కళ్ళు పెద్దవి చేసుకొని చూడసాగింది.
లిప్ స్టిక్ పెదవుల మీద చిరునవ్వు తళుక్కుమంది.
ఆమె వయసు ముప్పై, ముప్పైఅయిదు మధ్యగా వుండొచ్చు అనుకుంది జానకి. దేహం ఇప్పుడిప్పుడే తన సన్నని నాజూకుతనాన్ని విడిచి, గుండ్రంగా బొద్దు తేలిపోతున్నట్టు కనిపిస్తుంది.
'ఎంత సింపుల్ గా ఎంత అందంగా వుంది!" అనుకుంది జానకి.
అందం ఎక్కడ కన్పించినా జానకి కళ్ళు ఇట్టే పట్టేస్తాయి.
"మీరెక్కడదాకా వెళ్ళాలండీ?" మళ్ళీ మృదువుగా అడిగింది.
రూపానికి తగిన సంస్కారం! అనుకుంది జానకి.
"అల్లావుద్దీన్ బంగళా దాకా!" జానకి సమాధానం ఇచ్చింది ఉర్దూలోనే.
ఆ స్త్రీ కళ్ళు మెరిశాయి.
"నేను బేగంపేట వెళ్ళాలి. పర్వాలేదు. తోడు దొరికారు." అన్నది ఆమె.
జానకి జవాబుగా నవ్వింది. ఆమె నవ్వు ఆమెకే పేలవంగా అనిపించింది.
"అసలు ఏనాడూ బస్సులు ఎక్కినదాన్ని కాదు. మావారు డిప్యూటీ కలెక్టర్. ఇవ్వాళే కారు చెడిపోయింది. స్నేహితురాలికి జబ్బుగా వుంటే వెళ్ళాల్సి వచ్చింది." అన్నది ఆమె.
జానకి ఎంతో ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూసింది. శరీరం మీద విలువైన చీరా జాకెట్ తప్ప పెద్దగా నగలేమీ లేవు. మెడలో సన్నటి గొలుసు వుంది. చేతులకు ఆకుపచ్చ మట్టిగాజులు వున్నాయి. "మర్యాదా మన్ననా తప్ప, డాబూ దర్పంలేని మనిషి" అనుకుంది జానకి.
"మీపేరు?" జానకి అడిగింది.
"జరీనా బేగం!"
అందానికి తగ్గ పేరు!
"మీవారు ఏ జిల్లాలో పని చేస్తున్నారూ?"
"ఆయన పేరు వినే వుంటారు. మహమ్మద్ హుస్సేన్ నిజామాబాద్ లో పని చేస్తున్నారు." అన్నది జరీనా.
"ఈ బస్సుల్ని నమ్ముకొని లాభం లేదండీ! అయినా నేను ఎప్పుడు ఎక్కాను కనుక!" విసుగ్గా మళ్ళీ అన్నది జరీనా!
జానకి మాట్లాడలేదు.
"ఇంత పొద్దుపోయి ఆటోలోగానీ, టాక్సీలోకానీ ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా వుంది." మళ్ళీ అన్నది.
"మీరు హైదరాబాద్ లోనే వుంటున్నారా?" జానకి అడిగింది.
ఆ ప్రశ్నకు ఆ స్త్రీ సన్నగా నవ్వింది. ముత్యాలు గొలుసు తెగి ముత్యాలు మొజాయిక్ గుచ్చుమీద దొర్లిన శబ్దం.
ఎంత చక్కగా నవ్వుతుందో?
"ఆయనక్కడా నేనిక్కడా! ఏం చేస్తాంలెండి! ఎదిగొచ్చే పిల్లల బాధ్యతలు తప్పేవికావుగా? వాళ్ళ చదువుల కోసం నేను ఇక్కడే వుంటున్నాను. వీకెండ్సుకు ఆయనవచ్చి పోతుంటారు." అన్నది జరీనా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS