"అది కాదు సార్! మనం వీళ్ళని..." కంగారుపడుతూ అహోబిలం ఏదో చెప్పబోయాడు.
"ముందు వీళ్ళని ఇక్కడి నుంచీ తీసుకువెళ్ళూ అన్నాను తీసుకువెళ్ళు. అంతే. చెప్పిన పని చేయడం నేర్చుకో ముందు. అసలు నీకు ఈ వుద్యోగం ఏ బుద్ధితక్కువ వాడిచ్చాడయ్యా! వూ... చెప్పింది చెయ్!" అధికార స్వరంతో అరిచాడు వర్ధనరావు.
అహోబిలం నోరు మూసుకుని మా ఇద్దరినీ తీసుకుని సెల్ వేపుకి సాగాడు.
16
తినటం పడుకోవటం చాలా విసుగ్గా వుంది.
అయినా అంతకన్నా చేసేదేమీ లేనపుడు, విసుక్కుని మాత్రం ప్రయోజనం ఏముంది? అయినా ఎవరి మీద విసుక్కోను? తిని కూర్చునే విషయంలో దిగులు పడక్కరలేదు. నా దిగులల్లా మేమేమో ఇక్కడ ఇరుక్కుపోయాము. అవలీలగా కోటీ యాభయ్ లక్షల రూపాయల విలువ గల వజ్రాలు బాస్ గాడు చేజిక్కించుకొని ఎక్కడో హాయిగా తిరుగుతున్నాడు. ఈడు ఈపాటప్పటికి ఈ దేశం వదిలిపోయిన ఆశ్చర్యపడనక్కరలేదు.
కానీ_
బాస్ దేశం విడిచే పారిపోయే ప్రయత్నం మాత్రం చేయడు. కారణం వాడికి మాతృదేశం మీద వున్న భక్తికి కాదు. భాషలు రావు. ఇతర దేశస్థులతో మెలగటం చాతకాదు. అందుకని చచ్చినట్టు ప్రాణం మీదికి వచ్చినా సరే, కోటాను కోట్ల ధనరాసులు దొరికినా సరే, ఈ విశాల భారతదేశంలో ఏదో ఒక మూలాన చావనన్నా చస్తాడు గానీ, విదేశాలకు మటుకు పోడు.
ఇక్కడినుంచీ ఎంత తొందరగా బయటపడితే, వాడి ఆచూకీ లాగి వాడి భరతంపట్టి తీరుతారు అంత తొందరగానూ.
"లే... లే... తీరుబడిగా పడుకుని, పగటి కలలు బాగానే కంటున్నావ్! మీకేం దున్నపోతుల్లా తింటారు. తొంగుంటారు. మధ్యలో చచ్చేది మేము." నా ఆలోచనలు చెదరగొడుతూ అహోబిలం కంఠ స్వరం వినవచ్చింది.
నెమ్మదిగా కళ్ళు తెరచి చిద్విలాసంగా ఒక నవ్వు నవ్వాను. తాపీగా లేచి కూర్చుంటూ "ఏమిటి విషయం?" అన్నాను.
"విషయం కాదు నా బొంద. నిన్ననేమో మిమ్మల్నిద్దరినీ ఎమర్జంటుగా ఏవేవో ప్రశ్నలు వేయాలని పిలుచుకు రమ్మన్నాడు మా ఇన్స్ పెక్టర్ గారు. మిమ్మల్ని పిలిచికెళ్ళా కదా! ప్రశ్నలు వెయ్యొచ్చు కదా! అసలు విషయం పట్టుకుని ప్రశ్నలు వేయాల్సింది పోయి, నీవూ మా ఇన్ స్పెక్టర్ గారు కలిసి లెక్కల పరీక్ష నిర్వహించారు. మీ ఇద్దరినీ ఇంటరాగేట్ చేయాలిట ఇప్పుడు. మళ్ళీ తీసుకురమ్మన్నారు. లేచి నాతో రండి!" కానిస్టేబుల్ అహోబిలం ముఖం ముడుచుకుని చెప్పాడు.
లేచి నుంచుంటూ "మనలో మనమాట. ఈ రోజు ఏం పరీక్ష? సోషలా? లేక సైన్సా?" నవ్వుతూ అడిగాను.
"నీకు నవ్వులాటగానే వుంటుందయ్యా! మధ్యలో ఏది వచ్చినా మా ప్రాణం మీదికి వస్తుంది. పద! పద!"
అహోబిలం వెనుక నేనూ, రామ్ సింగ్ బయలుదేరాం.
మామూలే_
ఇన్ స్పెక్టర్ గారిని చూడంగానే ఒక సలాము, మరో నమస్కారం పారేశాము నేనూ, రాంసింగూ.
పాపం ఆయనేమీ సంతోషపడ్డట్లు కనపడలేదు.
"నేనిపుడు చాలా గట్టి ప్రశ్నలు వేయబోతున్నాను. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సీరియస్ క్వచ్చన్స్. మాటల్ని మధ్యలో మార్చేసి నవ్వులాటకి వెళ్ళారంటే మాత్రం నేను సహించను. మీకు తెలుసో లేదో! నేను చాలా స్ట్రిక్టు ఇన్ స్పెక్టర్ ని!" గంభీర్యంగా శలవిచ్చాడు ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.
"ఆమాట మీరు పనిగట్టుకు చెప్పాలా సార్! మీరు ఎన్నో కేసులు చేపట్టి, ఎన్నో అద్భుత విజయాలు సాధించారని విన్నాను."
ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ఆత్రుతగా కాస్త ముందుకు వంగి "విన్నావా! ఎప్పుడు విన్నావ్? ఎవరి నోట విన్నావ్? ఎక్కడ విన్నావ్?" మహా కుతూహలంగా అడిగాడు.
"విన్నాను సార్! ఇక్కడికి వచ్చిన తర్వాతనే విన్నాను. మొన్నో రోజున ఏదో మాటల మీద ఈ అహోబిలంగారే చెప్పారు. అసలు మీరు వాసన చూసే దొంగలెవరో, దొరలెవరో మనుష్యుల్ని పసిగట్టేస్తారుట. ఏ నోట విన్నా మీ సాహస గాధలేనుట. ఎంతో క్లిష్టమైన కేసుల్ని కూడా అవలీలగా అర నిముషంలో పట్టేస్తారుట. అదే మీ స్పెషాలిటీ అనీ, గొప్పతనం అనీ, అదనీ, ఇదనీ, అబద్ధాలు ఆడితే చమ్డాలు వూడ దీస్తారని, మీ గురించీ చెబుతూంటే మీ సాహసాలు విని డంగైపోయాను సార్!" అంటూ అహోబిలం వేపు చూశాను.
