Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 33


    "మరేం లేదు. అర్థరాత్రి ఆడది స్వేచ్చగా తిరిగిన నాడు తప్ప మీ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు కాదన్న ఆయన అభిప్రాయాన్ని గౌరవించి మీరలా బయలుదేరారేమో అని..."


    జవాబు చెప్పలేదామె.


    తోవ చూపిస్తూ, "ఇదిగో ఇదే మా ఇల్లు" అంది మరో అయిదు నిముషాల తర్వాత.


    జూబ్లీహిల్స్ లోని చాలా ఖరీదైన ఇంటి ప్రహరీని దాటి లోపలికి వెళ్ళాక ఆమె దిగింది. "ప్లీజ్... ఒక్కసారి లోపలికి రండి."


    "ఫర్వాలేదు."


    "అదికాదు. మీరిందాకన్నారే ఆ మాట చెప్పి వెళుదురుగాని"


    "ఎవరికి?"


    "కారు లేకుండా సెకండ్ షోకి వెళ్ళమని ప్రోత్సహించి పంపిన మా అక్కయ్యకి"


    రెప్పవాల్చకుండా ఓ క్షణం చూశాడు.


    వెంటనే పోర్టికోలో కారువుంచి ఆమె వెనుకగా ఇంట్లో అడుగుపెట్టాడు. "ప్లీజ్. కూర్చోండి. అక్కయ్యని పిలుస్తాను" ఆమె వేగంగా మరో గదిలోకి వెళ్ళింది.


    వాల్ టూల్ ట్రాక్స్ ఏసియా కార్పెట్ పై వున్న సోఫాలో కూర్చుని ఎక్రిలిక్ ఎమల్షన్ తో మెరిసిపోతున్న గోడల్ని చూశాడు యధాలాపంగా.


    పైన వేలాడుతున్న షాండ్లియర్ జూయెల్ కలర్స్ ని హాల్లో నింపుతుంటే కుషన్ పై జారగిలబడి తానెంత ఖరీదైన ఇంటిలో అడుగుపెట్టిందీ అర్థం చేసుకుంటున్నాడు.


    అయిదు నిముషాలు గడిచింది.


    ఎవరూ రాకపోయేసరికి పైకి లేచాడు ఇక వెళ్ళాలన్నట్టుగా.


    "హల్లో"


    అప్పుడు వినిపించింది ఓ కంఠం.


    హాల్ చివర వున్న కార్వ్ డ్ డోర్ దగ్గర నుంచొని మత్తుగా చూస్తోంది ఓ యువతి.


    ఒక సన్నని నవ్వు కిన్నెరసాని కిలకిలల్లా...


    క్రౌనింగ్ గ్లోరీగా కనిపించే అందమైన బాబ్ తో సిల్వర్ థిన్ స్కర్ట్ లో మెరిసే కాళ్ళను ప్రోవొకేటివ్ గా కదిలిస్తూ "చీర్ మి డ్రిఫ్' లుక్ తో వెలుగు రేఖలని ఒంటికి అద్దుకుని చాలా దగ్గరకి నడిచి వచ్చింది రాయంచలా...


    ఆమె ఇంకా నవ్వుతూనే వుంది ఎలాంటి మగాడ్నయినా ఓడించగల విజయగర్వంతో.  


    రెప్పవేయనివ్వని సౌందర్యం కాదు... కాంక్షతో మగాడ్ని రెచ్చగొట్టగల అద్యగ్నికృతాదీత ఉదంచిత కామ ప్రకోపిత కర్తరీముఖమై పురుషుడ్ని పాదాక్రాంతం చేసుకోగల అసదృశమైన అంగసౌష్టవం... తృటిలో జ్వాలయై హృదయాంతరాళాన్ని తాకగల హలమై కోర్కెల తేనె తుట్టును తాకి ఉపలాలిత ఉభుక్తాభిషిక్తయై పైబడుతున్న జలపాతంగా మారి శశాంక సన్నిధిని చేరి విరహోత్కంఠితలా భుజాలపై తాలవ్వాల్చింది.


    అప్పుడు గుర్తించాడు ఆమె ఇందాక తనతో ప్రయాణం చేసిన అమ్మాయిగా.


    ఆమె నిట్టూర్పులు వేడిసెగల్లా అతడి చెంపల్ని తాకుతుంటే ఏం ఆశించి ఇంత నాటకం ఆడిందీ అర్థం చేసుకునే ఆలోచనలో మునిగిపోయాడు.


    "మిస్టర్ వాత్సాయనా" పిలిచింది అల్లరిగా. "తెలుసు నీ పేరది కాదని. అయినా కంగారు పడకు. నిజమైన మగాడు నా దృష్టిలో వాత్సాయనుడే. వెదికి వెదికి వేసారిపోయాను. ఇన్నాళ్ళకు చూశాను..."


    లేచాడు పైకి.


    "ఏం నచ్చలేదా."


    "ఏమిటి?" నిశితంగా చూస్తూ అడిగాడు.


    "నా సౌందర్యం."


    "దాచుకో."


    "నన్ను దోచుకో అని నేనడిగిన తొలి మగాడివి."


    "కాని నేను గాడి తప్పను."


    "నేను తప్పిస్తాగా."


    "ఒప్పుకుంటేగా."


    "ఒట్టేశావా" ఆమె వాలు చూపుల్లో ఉద్దీపిత మౌతున్న కోర్కెల తోరణాలు. "అదే... నీ భార్యకి."


    శశాంక భృకుటి ముడిపడింది. "చాలా తెలుసే."


    "యా. నాకు నీ గురించి ఎంతో తెలుసు" చేతుల్ని సుతారంగా అతడి భుజాలపై వేసి లాలనగా కళ్ళలోకి చూసింది. "శశాంకా... నువ్వు గురి తప్పనివాడివని, మరో ఆడది కోరినా దరిచేరని వాడివని కాబట్టే కక్షతో ధనుష్కోటి కథ ముగించావని..." నవ్వింది మృదువుగా.


    శశాంక ఫాలభాగంపై స్వేదం ముత్యాల్లా పేరుకుంది.


    "ఆశ్చర్య పోతున్నావు. పోలీసులకే తెలియని విషయం నేనెలా గుర్తించానని కదూ" నిట్టూర్చింది ఓ లిప్తపాటు. "నీ గురి ధనుష్కోటి అయితే నువ్వు నాకు గురిగా మారేవు... నువ్వు వాడ్ని అనుసరిస్తుంటే నిన్ను నా వాళ్ళు వెంటాడేరు..."


    "అంటే నువ్వు."


    "సోఫియా... మరో గేంగ్ కి యజమానురాలని. నన్ను మాఫియా క్వీన్ అను, ఏంజె లాఫ్ డెత్ 'మెనిగాన్' అను లేదా ఇంటర్ పోల్ ని ఇబ్బంది పెట్టిన రెడ్ క్వీనాఫ్ టెర్రర్ 'జోయల్లీ అబ్రాన్' అను, అదీ కాదంటే జర్మన్ రెడ్ ఆర్మీ నాయకురాలు 'ఉల్రెక్ మిన్హాఫ్' గా పిలువ్. ప్రపంచం దృష్టిలో నేను ఒకప్పటి మోడలింగ్ సామ్రాజ్యాన్ని ఏలిందాన్ని. ఇప్పుడో స్టార్ హోటల్ కి ఓనర్ని. కాని ఇలాంటి చీకటిలో మరో ప్రపంచాన్ని ఏలుతున్న ఎంప్రిస్ ని."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS