చిదంబరం మాటలు జగన్నాధం వినిపించుకోడం లేదు. తను ఎక్కడితో తేలిపోతున్నట్టుంది. గుండెల్లో ఓ మూల ఆకాశమంత ఖాళీ ఏర్పడినట్టుంది. శరీరం యావత్తూ స్వాధీనం తప్పుతున్నట్టుంది.
సరిగ్గా ఆ వేళకి తలుపు శబ్దమైంది. చిదంబరం తలుపు తెరిచాడు . తెరిచిన వెంటనే-
" ఓ నువ్వా! ఎవరో అనుకుని మావాడు అదిరిపోయాడు. రా...లోపలికి"
చిదబరం ఎవన్నట్టు కళ్ళతో అడిగింది.
" ఆ విడ మిస్ కుసుమ చక్కగా పాడుతుంది. ఇతను జగన్నాధమని మా క్లాస్ మేట్ , గొప్పు యాక్టర్."
ఇద్దరికీ పరిచయం చేశాడు చిదంబరం.
కుసుమకి ఆమందుతో బాగా పరిచయమన్నట్టు- తనే స్వయంగా గ్లాసులో వొంచుకుని గుటగుటా తాగింది. తర్వాత గ్లాసులో మరికొంచెం పోసుని ఆరగా ఆరగా తాగడం మొదలెట్టింది. జగన్నాధం అనుసరించేడు.
ముగ్గూరూ చాలాసేపు చాలా విషయాలు మాటాడుకున్నారు. జగన్నాధానికీ ఎలుగెత్తి ఎవర్నో పిలవాలన్నంత వుత్సాహం వొచ్చిందీగానీ చిదంబరం వారించడంతో ఆగిపోయాడు.
* * * *
ఉదయం నాలుగ్గంటల ప్రాంతాల్లో జగన్నాధానికి మెలుకువ వొచ్చింది. తన పక్కనే అర్థనగ్నంగా పడుకున్న కుసుమని చూచి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.అప్పు డతనికి లీలగా, గడిచిన రాత్రి తన అనుభవం గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చిన కాసేపటికి కళ్ళలో నీళ్ళు తీరిగాయి.
అక్కడే వున్న కుర్చీలో కూలబడిపోయి మొహాన్ని చేతుల్లో దాచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ఎక్కడినించి వొచ్చాడో సుడిగాలిలా వొచ్చేడు. చిదంబరం. వొచ్చి లైట్ వేసి అన్నాడు-
"గుడ్ మార్నంగ్ బ్రదర్!"
"... ... .... ..."
" ఛ ఏడుస్తున్నావెందుకోయ్?" దగ్గరగా వొచ్చి జగన్నాధం భుజం కుదుపుతో అడిగేడు.
అతను మరింత కుదించుకు పోయాడు. చిదంబరం మెల్లిగా నవ్వి జోలపాట పాడేడు-
'ఏడవకు ఏడవకు వెర్రి నా తండ్రీ!
ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు,
నీలాలు కారితే నే చూడలేనూ
జో.... జో..
జగన్నాధం చివాలున లేచి నిలబడ్డాడు. గట్టిగా అరిచేడు.
" నా మిద నీకెందుకింత కసి? బాదల్లో ఛస్తున్నానీతిగా బ్రతుకు తున్నాను. రాత్రి ఆ నీతికి స్వస్థి చెప్పించావ్. ఇది నీ వల్ల జరిగింది. నువ్వే దీని క్కారణం. నువ్వే చిదంబరం నువ్వే."
ఈ అలజడికి కుసుమ కళ్ళు విప్పింది. భయంతో లేచి నిలబడింది. కుసుమని ఓదార్చాలనే ఉద్దేశ్యంతో చితంబరం అన్నాడు-
"దేరీజ్ సథింగ్ టు ఫియర్ మిస్ కుసుమా! జస్ట్ మిసండర్ ష్టాండింగ్. ఇలాంటి మనిషిని బాగుచేయడం నా వల్లకాదు. నిన్న ఉదయం ఈ మంచివాడ్ని అవమానించాననే బాధకొద్దీ చేరదీసి చక్కటి అతిథ్యమిచ్చి క్షమంచమని కోరేను. నోటి కొచ్చిచట్టు పేలేస్తున్నాడు. మైడియర్ జగన్నాధం, గెట్ వే ఫ్రం హియర్. క్విక్ చాతకాని తనం చావనంత వరకూ నువ్వు బాగుండవు వెళ్ళు." అన్నాడు చిదంబరం గుమ్మంవేపు చేయిచూపుతూ.
- ఆ ఉదయం నుంచీ జగన్నాధానికి నీతి నియమాలపట్ల కొత్తరకమైన అలోచనలు ప్రారంభమయ్యాయి. అతని ఆలోచనలు కుచ్చుల టోపీలో యిదో ముచ్చటైన రంగుటీక.
జ్యోతి సచిత్ర మాస పత్రిక-జూన్ -65.
* సమాప్తం *
