ఆడది ఓ దారి కావాలంటే పెళ్ళొక్కటేనా మార్గం?
పెళ్ళిలేకుండా, ఓ మగాడితో తాళి కట్టించుకోకుండా ఆడది బతకలేదా?" అవంతి గొంతు బొంగురుపోయింది.
అందుకే నేను...... నేను...... నిరూపిస్తాను. ఆడదంటే ఏమిటో ఇటు సమాజానికీ, అటు చేతకాని మొగుళ్ళకీ తెలిసేలా, బుద్దొచ్చేలా నేను చేస్తాను!" అంది అవంతి.
ఆమె మాటల్లో ఆత్మవిశ్వాసం వుంది.
పట్టుదల వుంది.
కేవలం ఆవేశంతో అంటున్న మాటలుకాదు. ఆచరణలో పెట్టి గెలవాలన్న బలీయమైన కోరిక ఆమెలోని ప్రతి అణువులోనూ ఉంది.
కానీ......
నిలువెల్లా రాక్షసత్వంతో నిండిపోయి, విషపుకోరలతో ఆడదాన్ని కబళించే సమాజం ఆమెని గెలవనిస్తుందా!
ఏది ఏమైనా వెనుకంజ వేసే ప్రసక్తి ఆమెకి లేదు.
తను అనుకొంటున్న దానిని సాధించడానికి, తాను తలబెట్టబోతున్న ఈ మహాయజ్ఞంలో ఓ సమిధగా తనని తాను అర్పించుకోక తప్పదు.
కుసుమని కౌగిలిలోకి తీసుకుని ఆమె తలపైన చేత్తో నిమిరింది అవంతి.
ఆ సమయంలో ఆమె మొహం ఎర్రబడింది. ఆమె గుండెలు రోషంతో ఎగిరి పడుతున్నాయి.
అవంతి బుగ్గపైన రమణి ముద్దు పెట్టుకుంది.
అవంతి ప్రేమగా రమణి చెక్కిళ్ళని తన నాజూకైన హస్తాలతో రాసింది.
"ఏమో నువ్వు చెప్పేటప్పుడు వింటుంటే ఉప్పెనలా ఈ దేశంపైన విరుచుకుని పడాలనిపిస్తుంది. కానీ అంతలోనే ఏదో జంకు కలుగుతోంది నాకు. అసలు రోజు రోజుకీ జటిలమైపోతున్న స్త్రీల సమస్యలకి ఓ పరిష్కార మార్గం ఉంటుందంటావా?" అడిగింది రమణి.
అవంతి కళ్ళతోనే మత్తుగా నవ్వింది. "భేషుగ్గా ఉంటుంది. కానీ దానికి ముందున్న ఓ లోపం ఏమిటో నీకు తెలుసా? అది మనసులోనే ఉంది. ఎందుకంటావా? చెప్తాను విను."
ఓ మగాడు రోడ్డుపైన పోతుంటే మరో మగాడెవడూ వాడ్ని పట్టించుకోడు. కానీ అదే ఓ ఆడది వెళుతోందనుకో మరో ఆడది ఎగబడి చూస్తుంది. ఆ స్త్రీని తనతో పోల్చుకొని చూస్తుంది. అది కట్టుకున్న చీర దగ్గర్నుంచి, ముక్కుపోగు వరకు శల్య పరీక్ష చేసి తనకంటే ఏ మాత్రం మిన్నగా కనబడినా జెలసీతో మండిపోతుంది.
కూతుర్ని చూస్తే తల్లికి, తల్లిని చూసి కూతురు ఈర్ష్యపడేరోజులివి.
అందుకని ముందు ఆడవాళ్ళయిన మనం ఇలాంటి వెధవ బుద్ధులని వదులుకోవాలి. అసూయ పడ్డం మరచిపోవాలి. తోటి ఆడదాన్ని మనలాంటిదేనని ఆదరించాలి. గౌరవించాలి. మన మధ్య ఓకలిసి కట్టుని, ఐక్యతని అలవరచుకోవాలి.
అప్పుడు
అప్పుడు
ఏ ఆడదైనా ఒకటే!"
అది విజృంభిస్తే ఆదిశక్తి అవుతోందని మగజాతి, ఆ జాతితో పాటుగా సమాజం హడలిపోతాయి. మన సమస్యల పరిష్కారానికి నాందిగా ఓ చిన్న దారి మనకి దొరుకుతుంది" అంది అవంతి.
"నీ మాటలు, నా మాటలూ ఎవరింటారు? సాంప్రదాయపు మూఢవిశ్వాసాలకి బానిసలైపోయి సెంటిమెంటల్ గా బతికేస్తూ వాళ్ళ చుట్టూ ఓ గిరి గీసుకున్న వాళ్ళకి మనం నచ్చచెప్పలేం కదా!" శ్యామల అడిగింది.
"అఫ్ కోర్స్ నీ అభిప్రాయాన్ని నేను అంత తేలిగ్గా కొట్టిపారేయను శ్యామలా, కానీ మార్పు అనేదాన్ని ఏ మనిషి ఓ పట్టాన అంగీకరించలేడు. దాన్ని క్రమంగా ఆచరణలో పెట్టి ఆ మార్పుకి అలవాటు పడేట్టు చేసి, దాన్నే తరువాత ఓ సాంప్రదాయంగా మార్చగలగాలి. దానికి నాందిగా మనం ముందడుగు వెయ్యాలి."
"ఫలితం వుంటుందా?"
"మనని చూసి కొందరు, ఆ కొందర్ని చూసి మరికొందరు.... అలా కాలచక్రంలో మారితే చాలదూ!" అంది అవంతి.
"నీకిది వరకే చెప్పాం అవంతీ. నువ్వు మా నాయకురాలివి. నీ ఆశయాలకి ఊపిరి పోసి, ఆచరణలో పెట్టడానికి మేము ఎప్పుడూ రెడీనే." అంది కుసుమ.
"నువ్వెట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గనని నాకు మాటివ్వాలి" అంది శ్యామల.
శ్యామల మాటలకి అవంతి గంభీరంగా మారిపోయింది.
స్నేహితురాళ్ళకేసి రోషంగా చూసింది. "నాకు దేవుడున్నాడనే నమ్మకం ఉంది. ఆ దేవుడి సాక్షిగా నా ఆశయాలని కాపాడుకోడానికిగాను నేను ఏనాడూ వెనకంజ వెయ్యనని ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో ఆఖరికి నా ప్రాణం పోయినా నేను లక్ష్యపెట్టను" అంది అవంతి.
శ్యామల, కుసుమ, రమణి ఆమె మాటలకి గట్టిగా చప్పట్లుకొట్టారు.
ఆ గది చప్పట్ల హోరుకి మారుమోగిపోయింది.
20
ఢిల్లీ వెళ్ళి పెద్దలని కలుసుకుని తిరిగి హైదరాబాదులో కాలుపెట్టేసరికి లలితాంబ రాజకీయ నాయకురాలయిపోయింది.
ఆమె అధికార పార్టీలో సభ్యురాలిగా చేరింది.
ఈ పని ఎప్పుడో చేసి వుండాల్సింది ఆమె మనసులో అనుకుంది.
ఇది వరకే నగరంలో ఆమెకి గల పలుకుబడికి ఇది మరికొంచెం దోహదం కావడంతో క్షణం కూడా తీరిక లేకుండా పోయిందిప్పుడు.
ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కలుసుకుంది. అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు వెళ్ళి శాసన సభ్యుల్ని, కొందరు మంత్రులని పరిచయం చేసుకొంది.
