తులసి మాలలు తిప్పడంలోకన్నా పూసలు కుట్టడంలో ఎక్కువ ఆనందాన్ని వాళ్ళు పొందారు.
ఆరోజు సాయంకాలం జ్ఞానమందిరంలో చేరి అందరి దగ్గరా పూసల్ని కలెక్ట్ చేసుకున్నాడు. వాటిని బస్తాలో వేసి, ప్యాక్ చేశారు.
సాయంకాలం ఆరుగంటలకి పూసల కుర్రాడు వచ్చాడు. అతనికి బస్తా యిచ్చి ద్వారం దగ్గర ఏం చెప్పాలో ముందే ట్రైనింగ్ యిచ్చాడు.
ఆ కుర్రాడు వెళ్ళిన తర్వాత డబ్బులు కలెక్టు చేసుకోవడానికి అతను కూడా జైనమతాచార్యుడి వేషంలో అన్నావారి సత్రానికి బయలుదేరాడు.
అతను తాను రోడ్డుమీదకి ఎక్కాడో లేదో "ఆగు" అన్న మాటలు చాలా కఠినంగా వినిపించాయి.
అతని గుండె దడదడలాడింది. తను పట్టుబడి పోయాడన్న విషయం అర్థమయింది.
ఆగి వెనక్కి చూశాడు.
తనను క్రాస్ చేసుకుని వెళ్ళిన గణపతిరాజు అనుచరులు యిద్దరు నిలబడి వుండటం కనిపించింది.
అతను క్షణంసేపు తటపటాయించాడు. అంతలోనే ధైర్యం పుంజుకున్నాడు.
"నేనా బాబూ?" అన్నాడు వాళ్ళ వంక చూస్తూ.
"అవును. ఇలారా" ఆజ్ఞాపిస్తున్నట్లు పిలిచాడు.
తరుణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు.
"ఎవరు నువ్వు?"
"నేను జైనమతస్థుడ్ని. జైనమత ప్రవక్త అయిన మహావీరుని బోధనలను ప్రపంచానికి చాటుతూ యాత్రలు చేస్తుంటాను.
జైనుల్లో రెండు రకాలు. తెల్లటి బట్టలు కట్టుకోవాలి అన్నవాళ్ళు శ్వేతాంబరులు. జైనులకు వస్త్రాలతో నిమిత్తం లేదని అనేవాళ్ళు దిగంబరులు. ఉమాస్వాతి రచించిన 'తత్త్వార్థాగమ సూత్ర' అనే గ్రంథం ముఖ్యమైనది. జైనమత తత్వమంతా దీన్ని ఆధారం చేసుకునే అభివృద్ధి చెందింది. సప్తభంగీనయ..."
"ఆపవయ్యా!" ఒకడు అరిచాడు.
తరుణ్ ఆగాడు. వాళ్ళవంక నిశ్చలంగా చూస్తూ వుండిపోయాడు. తాను అలా నాన్ స్టాప్ గా మాట్లాడడం వల్ల లాభం వుంటుందనుకున్నాడు.
"సుత్తి నిలుపు. వెళ్ళెళ్ళు" అన్నాడు ఇంకొకడు.
అన్నావారి సత్రంకెళ్ళి తన మిత్రుడైన పూసల వ్యాపారిని కలుసుకున్నాడు. దండల్ని లెక్క వేసి మొత్తం నాలుగువందలా నలభై రూపాయలు వస్తాయన్నాడు. సగం డబ్బుని అప్పుకి కట్టేసి మిగిలిన రెండువందలా ఇరవై రూపాయలను తీసుకొచ్చాడు.
అతను వచ్చిన వెంటనే అందరూ జ్ఞానమందిరంలో సమావేశమయ్యారు.
దాదాపు సంవత్సరం తరువాత వాళ్ళు డబ్బు చూశారు. అదీ కష్టపడి సంపాదించింది. కొంతమంది అమ్మాయిలైతే భావోద్వేగాన్ని అణుచుకోలేక ఏడ్చారు.
అంతా చెప్పాక తరుణ్ "ఈ డబ్బుతో ఏం చేయాలో నాకు ఓ ఆలోచన వచ్చింది. ఇప్పటివరకు పాలిపోయిన మీ జీవితాలకు రంగులు అద్దాలి. ఈ డబ్బుతో మీ అందరికీ నైల్ పాలిష్ తీసుకొస్తాను. ఈ ఖర్చుపోగా మిగిలిన సొమ్ము రేపు రాత్రి అన్నావారి సత్రంలోని టూరింగ్ టాకీస్ కి సెకండ్ షోకి వెళదాం. నాగార్జున సినిమా"
అమ్మాయిలంతా తనను తాము మరిచిపోయారా క్షణంలో. ఏ కాలక్షేపానికీ నోచుకోని వాళ్ళకి సినిమా అంటే ఎక్కడాలేని సంతోషం తన్నుకొచ్చింది.
ఒక్కసారిగా అందరూ చప్పట్లు చరిచారు.
ఇక్కడ కార్యక్రమం యిలా సాగుతుండగా గణపతిరాజు అన్నావారి సత్రంలోని డాక్టర్ క్లినిక్ మెట్లు ఎక్కుతున్నాడు.
* * * * *
అప్పుడు రాత్రి తొమ్మిదిగంటలైంది. చలి మీదపడి కొరుక్కు తినేస్తోందేమోనని గది కిటికీలన్నీ మూసుకున్నాయి. నిశ్శబ్దానికి కాళ్ళు మొలిచి పరిగెడుతున్నట్లు ఆకుల రెపరెపలు తప్ప మరొకటి వినపడడం లేదు.
గణపతిరాజు కుర్చీలో కూర్చుని జేబులోని క్వార్టర్ బాటిల్ విప్పి ముందు పెట్టుకున్నాడు. వచ్చినప్పటినుంచి మౌనంగా వున్న అతన్ని భయంగా చూస్తున్నారు అతని అనుచరులు.
మందుమీద నిషేధం వున్నా, అది విమలాబాయి మహిళాసదన్ అయినా కొంచెం కూడా జంకూ గొంకూ లేకుండా గణపతిరాజు మందును గ్లాస్ లో పోసుకున్నాడు. దానికి కొద్దిగా నీళ్ళు కలిపి సిప్ చేశాడు.
ఇప్పటికి గొంతు పెగిలినట్లు "తరుణ్ గాడు ఈ ఊర్లోనే వున్నాడు"
వింటున్న యిద్దరు ఉలిక్కిపడ్డారు.
"అవును - వాడు యిక్కడే వున్నాడు" కసికసిగా అని డాక్టర్ ను తాను కలుసుకోవడం గురించి చెప్పాడు.
అతనికి తరుణ్ అన్నావారి సత్రం వదిలి దూరంగా వెళ్ళుండడని అనిపించింది.
దాంతో అనాథ మహిళాసదన్ లోని గెస్ట్ రూమ్ లో మకాం పెట్టడమే కాకుండా అన్నావారి సత్రంలోని డాక్టర్ ని, ఎస్.ఐ.ని, ఆఫీస్ ఇంజనీర్ ని, పోస్ట్ మాస్టర్ ని కలిసి తరుణ్ ఫోటోలిచ్చాడు.
"ఈ వ్యక్తి కనిపిస్తే నాకు వెంటనే తెలియజేయండి" అని కూడా చెప్పాడు. ఒక్క ఎస్.ఐ. మాత్రం సవాలక్ష ప్రశ్నలతో విసిగించాడు. తరుణ్ తన దగ్గర పనిచేస్తూ డబ్బులతో పారిపోయాడని, అందుకోసం వెదుకుతున్నాననీ చెప్పాడు గణపతిరాజు.
ఫోటోలిచ్చాక అప్పుడప్పుడు వెళ్ళి ఫోటోలోని వ్యక్తి వచ్చాడేమోనని వాకబు చేసేవాడు.
ఆరోజు సాయంకాలం అన్నిచోట్లకూ వెళ్ళి చివరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
"రావయ్యా బాబు రావయ్యా! నీకోసమే చూస్తున్నాను" అన్నాడు డాక్టర్.
అంటే డాక్టర్ కి ఏదో విషయం తెలిసిందని అర్థమైంది గణపతి రాజుకి.
"నువ్విచ్చిన ఫోటోలోని వ్యక్తి మొన్న సాయంకాలం యిక్కడికి వచ్చాడు!"
ఒక్కసారిగా తన వంట్లోని రక్తం పైకి ఎగజిమ్మినట్లు అతను అదిరిపడ్డాడు.
"వచ్చాడా?"
"ఆఁ!"
"ఎందుకు?"
"ఎవరో ఓ అమ్మాయికి పాము కరిచింది. తీసుకువచ్చాడు. అతనితో పాటు చాలామంది అమ్మాయిలొచ్చారు" అన్నాడు డాక్టర్.
"ఎవరు వాళ్ళంతా?"
"తెలియదు. చివరలో అడుగుదామనుకున్నాను. కానీ మరిచిపోయాను."
