అంగుళీయక ప్రదానము
"భువనైక సుందరీ, నాకు మెలకువ వచ్చి నిన్ను వీక్షించి కన్నుల పండుగ చేసికొనవలెనన్న కోర్కె జనించినది. మరుక్షణముననె నీముందు ప్రత్యక్షమైనాను. నన్ను కరుణించుము. నీ పొందును నాకందించుము... నన్ను ఇంద్రుడు మున్నగు అష్టదిక్పాలకులునూ భయభక్తులతో సేవించెదరు"

లంకాపురిని సీతాదేవి జాడను తెలిసికొనుట రహస్యముగ జరుగవలెను కనుక హనుమంతుడు తన మేటి శరీరమును అణు మాత్రముగా కుదియించినాడు. రాత్రి ఆరంభమై రావణుని రాజధాని యందలి భవనము లందును గృహములందును పూరి పాకలందును దీపములు కాంతిని ప్రసరించుచున్నవి. హనుమంతుడు తన సూక్ష్మదేహముతో ఆ నివాస స్థలములనన్నింటిని ఒకదాని వెనుక మరియొక దానియందు సవ్వడి కాకుండ గవాక్షముల ద్వారా ప్రవేశించి జానకి కొరకు గాలించినాడు. ఆమె యెచ్చటను కనపడలేదు. "రావణుడు మైథిలి తనను అంగీకరించలేదన్న కోపముతో ఆమెను చంపియుండునా? కాక వాడు బలత్కరింపబోగా ఆమెయే ఆత్మహత్య చేసికొన్నదా? ఏమైయుండును?... నేను ఋశ్వమూకమునకు పోయి రామచంద్రునకు వైదేహి కనబడలేదన్న వార్తను తెలిపినచో అతడు దుఃఖముతో ప్రాణములను వదలును. అన్న గతించెనన్న శోకముతో సౌమిత్రియూ అసువులును బాయును. సుగ్రీవుడు 'శ్రీరామచంద్రునకు ప్రత్యుపకారమును చేయలేకపోయితిన'ని కుందును... నా శతయోజనముల సముద్ర లంఘనమును వ్యర్ధమై పోయినది!"
..వికల మానసుడైయున్న అంజనీ సుతునకపుడు 'కుహూ కుహూ' అన్న కోకిల రావము వినవచ్చినది. అతడా స్వరమేతించిన వైపు చూడగా ఆ పురమందలి అశోక వనము దృశ్యమైనది. "నేను సౌధములను మాత్రమే పరిశీలించితిని. నగరమందలి వనములనూ ఇతర ప్రాంతములనూ కూడ భూపుత్రికై శోధించవలెనని తోచినది కాదేమి?" అనుకొనుచు హనుమంతుడు పరుగెత్తిపోయి అశోక వనమును ప్రవేశించినాడు.
అతడిరువంకల శోధించుచు ముందుకుపోయినాడు. పోగా పోగా ఒకచోట మూర్తీభవించిన శోకము వలె తలవంచుకొని కూర్చుని ఒక తరుణి కనపడినది. భయంకరాకారలైన రాక్షసాంగనలు ఆ దీనురాలిని పరివేష్టించియున్నారు. "ఆమె జానకియై యుండున"ని తోచి అంగుష్ఠ మాత్ర పరిమాణ దేహుడై రాక్షసాంగనా వలయమును సమీపించి పరిశీలించినాడు. మున్ను రాముడు అంగుళీయకమిచ్చినప్పుడు వైదేహిని ఆనవాలు కట్టుటకు వీలుగా తనకామె రూపురేఖలను వర్ణించి చెప్పినాడు. ఈమె రాఘవుడు చెప్పినటులనే యున్నది. మైథిలి తన చీర చెంగును చింపి అందు మూటగట్టి ఋశ్యమూక పర్వతమున వానర సమూహము నడుమ పడునట్లు జారవిడిచిన నగలు కాక ఆమె తనువుపై గల తొడవులను సీతాపతి తనకు వివరించినాడు. ఆ శేష భూషణములన్నియూ ఇప్పుడీమె మేన మారుతికి కన్పట్టుచున్నవి. "సందేహమక్కరలేదు. లంకేశ్వరుడపహరించి తెచ్చిన భూపుత్రి ఈమెయే. నేను కృతార్థుడనైతిని!" అనుకొనుచు ఆంజనేయుడు ఆనందాబ్ది నోలనాడినాడు.
ఆ కపిశ్రేష్ఠుడు "నేనీ రాక్షస స్త్రీలకు తెలియకుండ ఈ సాధ్వీమణికి తెలియజేసి కొనుటయెట్లు?... సమయము చిక్కు వరకును వేచి యుండవలెను" అనుకొనుచు పరికించగా దగ్గరగనె ఒక శింశుపా వృక్షము గోచరించినది. అతడు ఆ పాదపమునధిరోహించి అందొక శాఖపై ఆసీనుడయ్యెను.
ఇంకనూ రాత్రి యున్నది. హనుమంతునకు కలకలము వినవచ్చెను. దృష్టిని సారించగా నాతనికి వెలుగుచున్న కాగడాల వెనుక సర్వాలంకార భూషితుడై వచ్చి రాక్షసాంగనల వలయమును సమీపించుచున్న రావణాసురుడు కనపడెను. లంకేశ్వరుని అంతఃపుర కాంతలు కొందరు అనుసరించి వచ్చినారు... దశకంఠుడు దనుజ స్త్రీల వలయమున కావల నిలిచి సీతాదేవితో ఇట్లనెను:
"భువనైక సుందరీ, నాకు మెలకువ వచ్చి నిన్ను వీక్షించి కన్నుల పండుగ చేసికొనవలెనన్న కోర్కె జనించినది. మరుక్షణముననె నీముందు ప్రత్యక్షమైనాను. నన్ను కరుణించుము. నీ పొందును నాకందించుము... నన్ను ఇంద్రుడు మున్నగు అష్టదిక్పాలకులునూ భయభక్తులతో సేవించెదరు. వారి సంపదల యందలి అమూల్య వస్తువులనెల్ల దెచ్చి కానుకలుగా నిచ్చి నా దయకు పాత్రులగుటకు ప్రయత్నింతురు; నేనన్న ముల్లోకములును హడలుచుండును. నీ యౌవనము నేల వృథా చేసికొందువు? మండోదరి మున్నగు రాణులందరిని నీ ఆజ్ఞానువర్తులుగ జేసెదను. నా అష్టైశ్వర్యములను నీ వశము చేసెదను... ఇంకనూ ఆ బక్క మానవుడు రాముని గూర్చి ఆలోచించుట ఎందులకు? వాడెన్నటికైన నూరు యోజనముల సముద్రమును దాటి రాగలడా? వచ్చినను వానిని నేను బ్రతుకనిచ్చెదనా?... దానవులు మానవుల కన్న శ్రేష్ఠులు. నరులు దనుజుల కాహారము కదా? నేను దనుజ చక్రవర్తిని. యముడు కూడ నేనన్న భయపడును. వాయువు నా ఆజ్ఞ లేనిదే వీచడు"
సీతాదేవి ఒక గడ్డి పరకను తీసి పట్టుకొని దానితో నిట్లు పలికెను:
