జాంబవంతుడు: "మిత్రులారా ధైర్యమును కోల్పోకుడు. వానరాధిపుడు సుగ్రీవుడు అలనాడు కిష్కింధలో మనలను దక్షిణదిశకు సీతాన్వేషకులుగా పంపినపుడేమన్నాడో జ్ఞప్తికి తెచ్చుకొనుడు.
అంగదుడు సుగ్రీవుడానాడు 'జానకీదేవి జాడను కనుగొన్నారన్న ఘనత బృందమునకే దక్కును' అన్నాడు.
జాంబవంతుడు: 'వానరాధిపుడు మరియొక వాక్యమును కూడ చేర్చినాడు. మీ బృందమునకా ఘనత ఈ ఆంజనేయుని వలన చేకూరును' అని మారుతి వైపు చూపినాడు.
అంగదుడు: ఔను. సుగ్రీవుడట్లు శ్లాఘించుటతోనే శ్రీరామచంద్రుడు తన ఉంగరమును తీసి వాయుపుత్రుని హస్తమునందుంచి 'హనుమా నీవు జానకిని కనుగొనుటతోనె ఆమెకీ అంగుళీయకము నిమ్ము. దీని జూచుటతోనే ఆమె నిన్ను రామదూతవని విశ్వసించును' అన్నాడు.
జాంబవంతుడు: అంజనీ సుతుడు బాల్యముననె ఒకనాడు ఉదయార్క బింబమును చూచి పక్వ ఫలమని భావించి దానిని పుణికి తెచ్చుకొనుటకు మూడువందల యోజనముల మేర కెగిరినాడు. వజ్రాయుధముతో దేవేంద్రుడు అడ్డువచ్చెను కాని బాలాంజనేయుడింకెన్నియో యోజన శతములకు ఎగిరి యుండెడివాడు. అట్టి విక్రమశాలి వాయుపుత్రునకిప్పుడు నూరు యోజనముల కావల గల లంకాపురికి పోయివచ్చుట యొక లెక్కలోనిది కాదు. సీతాదేవి లంకాపుతి యందున్నదని రూఢిగా తెలిసికొని వచ్చుటకు హనుమంతుడు చాలును. బృందములోని తక్కిన వారెవ్వరునూ పోనక్కరలేదు. కనుక మనలోని తక్కిన వారెవ్వరెంత దూరము లంఘించగలరన్న చర్చ ఇప్పుడు అనవసరము.
అప్పుడచ్చటకు హనుమంతుడేగుదెంచినాడు. అతడు జాంబవంతునితో "భల్లుకేశ్వరా సముద్ర లంఘనమును తీరము నుండి కాక మహేంద్ర పర్వత శృంగము నుండి ప్రారంభించినచో అనువుగా నుండునని తోచి అట్లు చేయుటకు నిర్ణయించుకొన్నాను" అన్నాడు.
జాంబవంతుడు: నీ నిర్ణయము సరియైనదే నోయి... నీవు లంకాపూరికెప్పుడు పోదలచినావు?
హనుమంతుడు: ఆలసింప తగదు కనుక ఇప్పుడే పోయెదను. మీ అందరికిని చెప్పి మీ ఆశీర్వాదమును పొందుటకు వచ్చినాను.
జాంబవంతుడు: విజయోస్తు!
హనుమంతుని సాగనంపుటకు అంగదుడు తన బృందముతో మహేంద్ర పర్వతము వరకునూ పోయినాడు. హనుమంతుడు పర్వత శిఖరముపై నిలిచి సముద్రునకు నమస్కరించి "జలనిధీ, రామకార్యమునకై నిన్ను లంఘించి లంకాపురికి పోవుచుంటిని అనుమతించుము" అని ప్రార్ధించినాడు. వాయుదేవుని ధ్యానించి "తండ్రీ నా లంఘనమునకు అనుకూలముగా వీచి తోడ్పడుము" అని వేడుకొన్నాడు. శ్రీరామచంద్రుడు ఆనవాలుగా వచ్చిన అంగుళీయకమును భద్రపరుచుకొని గిరిశిఖరము నుండి పైకి ఎగిరి ఆకసమున బోరగిలి హస్తములను ముందునకును పాదములను వెనుకకునూ చాచి సాగరమును దాటుచూ లంకాపురి వైపు పోయినాడు.
'మైనాకుడు' అను పర్వతశ్రేష్ఠుడు ఆకసములోనికి ఎదిగివచ్చి అత్యంత రయమున అక్కడ తనకెదురైన ఆంజనేయునితో ఇట్లన్నాడు:
"వాయుపుత్రా ఇరువదియైదు యోజనముల మేర లంఘించి అలసట చెందినావు. ఇంచుకసేపు నా శిఖరము మీద ఆగి విశ్రమించుము. నేను తెచ్చిన ఆహార పానీయములను ఆరగించి క్షుత్పిపాసలను శమింప చేసికొనుము"
ఆంజనేయుడు "గిరివరా, నీ ఆదరాభిమానములకు కృతజ్ఞుడను. నేను రామకార్యమున పోవుచున్నాను. నాకిప్పుడు అలసట కాని ఆకలి దప్పులు గాని లేవు. నన్ను పోనిమ్ము" అని మైనాకుని ఒప్పించి ముందుకు సాగిపోయినాడు...మైనాకునిది సదుద్దేశమే ఐననూ అది కాల హరణమునకు కారణమై ఆంజనేయున కాలస్యమైనది. ఒక్కొకప్పుడు సదుద్దేశము విఘ్న కారకములగుచుండును.
ఆంజనేయునకు రెండవ విఘ్నము 'సురస'యను నాగదేవత వలన కలిగినది. సురస వాయువేగమున మరొక్క పాతిక యోజనముల మేర జలనిధిని లంఘించి ముందునకు దూసుకొని పోవుచున్న అంజనీ సుతునితో 'ఆగుమాగుము. నా దారిని పోవు ప్రాణులను పట్టుకొని మ్రింగివేయు అధికారము నాకు బ్రహ్మదేవుని వరము వలన లభించినది. పుష్టిగా నున్న నీ మేనును నేను నేడు కబళించి సంతుష్టి చెందెదను!" అన్నది. ఆంజనేయుడు "అమ్మా నేనిప్పుడవతార పురుషుడగు రామచంద్రుని కార్యము నెరవేర్చుటకు పోవుచున్నాను. నేను తిరిగి వచ్చునపుడు నన్ను నీవు మ్రింగుము; ఇప్పుడు పోనిమ్ము" అన్నాడు.
సురస: చిక్కిన ఆహారమును వదలుకొను అవివేకిని కాను నేను!
నాగ జనని నోరు తెరిచినది. హనుమంతుడామె తనను మింగలేనంతగా తన దేహమును పెంచినాడు. ఆమెయూ నోరును పెంచి హనుమంతుని సమీపించినది. అతడు హఠాత్తుగా అంగుష్ఠ ప్రమాణ దేహుడై ఆమె వదన గహ్వరామును చొచ్చుకుపోయి మరుక్షణముననె అంత వేగముతోనూ ఉదరము నుండి బయటకు వచ్చినాడు.
హనుమంతుడు: అమ్మా నీకు కమలాసనుడిచ్చిన వరము ప్రకారము నేను నీచే మ్రింగుడు బడినాను. జీర్ణము కాకుండ వెలికి రాగలిగితిని కనుక ఇంక నేను పోయెదను.
సురస (మెచ్చుకొనుచూ) ఆంజనేయా నీ దేహబలమే గాక బుద్దిబలమునూ గొప్పది... నేను నిన్ను మ్రింగుటకు రాలేదు. నీవు రామ కార్యమును నెరవేర్చగలవో లేవో పరీక్షించుమని దేవతలు నన్నాదేశించి పంపగా వచ్చితిని. కృతార్థుడవయ్యెదవు, పొమ్ము.
హనుమంతుడాలస్యమై నందులకు వగచుచూ వేగమును హెచ్చించి సముద్ర లంఘనమును సాగించినాడు. మరియొక యిరువదియైదు ఆమడల దూరము పోయిన పిదప ఆ బలశాలికి తననెవరో క్రిందికి లాగుచున్నట్లనిపించినది. సముద్రము వైపు పరిశీలించి చూడగా తన నీడ కనిపించినది. అదృశ్య హస్తమెవరిదో ఆ ఛాయను పగ్గము వలె పట్టుకొని లాగుచున్నది. తన ఛాయతోపాటు జలధిలోనికి త్వరితముగ జారిపోవుచున్న హనుమంతునకు మున్ను తాను విన్న 'సింహిక'యను చాయాగ్రాహిణి వృత్తాంతము తటాలున జ్ఞప్తికి వచ్చినది. కడలిపై నుండి పోవు ప్రాణులను వాటి నీడలతో తన వద్దకు లాగితెచ్చుకొని భక్షించు ఆ క్రూర రక్కసి ఆ దక్షిణ సముద్రముననె ఉన్నదని అతడు విన్నాడు... మరుక్షణమున హనుమంతుడు అబ్ధిలోనున్న 'సింహిక' హస్తములలో పడినాడు. ఆ క్రూర రక్కసి నోరు గుహవలె తెరచియున్నది. హనుమంతుడాలసించక సూక్ష్మదేహుడై 'సింహిక' వదన గహ్వరమును ప్రవేశించి దాని గుండెలను తన బలమైన చేతులతో పట్టుకొని నులిమి పీకివేసినాడు. సింహిక దిక్కులు పిక్కటిల్లునట్లుఅరచుచు ప్రాణములు విడిచినది.
సింహిక మూలమున కలిగిన ఆలస్యమునకు హనుమంతుడు చింతించలేదు. లోకమునకా రక్కసి పీడను వదలించ కలిగితినని సంతసించినాడు.
పిమ్మట అతని సముద్ర లంఘనమునకెట్టి అంతరాయమును కలుగలేదు. సూర్యాస్తమయం సమయమున కాతడు లంకాపురిని చేరుకొన్నాడు.
* * *
