ఆమె తల పట్టుకుని అటూ ఇటూ ఊగించి చూచింది ఆమని.
రమోలా మఫ్లర్ మెడచుట్టూ త్రిప్పుకుంటూ "ఐడియా!" అంది.
"నీ తలలోపల అయిడియాలు కూడా ఉన్నాయా? చెప్పు అవేమిటో!" అంది.
"ఇవాళ మనం కాలక్షేపానికి ఏదో ఒకటి చేయాలి కదా?"
"అయితే ఏం చేస్తానంటావు? తలక్రిందులుగా నడుస్తానంటావా?"
"మిడ్డీమార్చినీ పాంటు వేసుకుంటే నిరభ్యంతరంగా నడవొచ్చు" అంది రమ్మీ.
"మీ టుమ్రీలు మానేసి నేను చెప్పేది వినండి!"
"వినకపోతే సినిమా టికెట్స్ కొనవుగా! వింటాంలే చెప్పు"
"ఒక అందమయిన అమ్మాయి ఉందనుకో ఏం జరుగుతుంది?"
"నీ బొంద జరుగుతుంది. అది కూడ ఒక ప్రశ్నే!"
"యూ ఆర్ ఆల్ ఇన్నోసెంట్స్!"
"నువ్వూ విమ్మీ ఫారెన్ సెంట్సా!"
"అయితే నేను చెప్పటం మానేస్తా!"
"వొద్దులే! వొద్దులే! చెప్పు వింటాం"
"మీరు మొదట్నించి విమెన్స్ కాలేజీలో చదువుతున్నారు కాబట్టి కో ఎడ్యుకేషన్ కాలేజీస్ మీకు తెలియవు. నేను ఇంటర్ అక్కడే చదివా!"
"ఆ అనుభవం నీకుందని మాకు తెలుసు."
"తంతాను. సరిగా మాటాడు. ఏ అనుభవం"
"కో ఎడ్యుకేషన్ అనుభవం. ఎందుకు తంతావు?"
"మరో అర్ధంలో అన్నావనుకున్నా!"
"యూ పూర్ క్రీచర్! నెలకి అయిదువేల రూపాయల ఐస్ క్రీంస్ చాలవు నీకు. నిన్ను ప్రేమించే గట్స్ ఎవరికుంటాయి కాని అసలు సంగతి చెప్పు!"
"కో ఎడ్యుకేషన్ కాలేజీస్ లో ఏమవుతుందో తెలుసా?"
"తెలియదు. తెలుసుకోవాలని కూడ లేదు. షటప్!"
"అయితే నేను వెళ్ళిపోతాను" అలిగింది రమోలా.
"ఎక్కడికీ వెడతావు. ఐస్ క్రీం షాపులన్నీ ఇవాళ సెలవు చెప్పమంటుంటే!"
"ఒక అందమయిన అమ్మాయి ఉంటే అందరూ ప్రేమించామంటారు. పదిమంది లౌ లెటర్స్ రాస్తారు"
"ఆ బాధ అందమయిన వాళ్ళది కదా! నీకు ఏముంది? యూ ఆర్ సో సేఫ్!"
"-అలాగే ఒక అందమయిన అబ్బాయి ఉంటే అతన్ని అయిదారుగురు ప్రేమించేశారనుకోండి. అప్పుడేమవుతుంది?"
"నీలాంటి తెలివితక్కువ దద్దమ్మలు చేస్తారా పని. ఒక అమ్మాయి ఓ యువకుడితో గాఢంగా లౌలో పడిందనుకుంటే మరో అమ్మాయి అతన్ని ప్రేమించదు. ప్రేమించానని అనదు" అని తీర్మానించింది ఆమని.
"యూ ఆర్ రైట్ కాని ఒకవేళ అలా జరిగితే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది?"
"ఇది మంచి సైకలాజికల్ పాయింట్" అందరూ మెచ్చుకున్నారు.
"అది సైకాలజీ స్టూడెంట్ కదా! మంచి పాయింట్ చెప్పింది"
"ఈ ట్రయిల్ మనం వేసి చూద్దాం"
"ఎక్కడ బస్ స్టాప్ లోనా ఎయిర్ పోర్టులోనా?"
"ఆసక్తి ఉన్న వారికి ప్రపంచమంతా పరిశోధనశాల!"
"డైలాగులు చెప్పకు. చేయాల్సిందేమిటో చెప్పు"
"సెర్చి పాయింటుకి సూటబుల్ అనుకున్న యువకుడిని సెలెక్ట్ చేసి ముందు నేను కలుస్తాను. మీరు దూరం నించి అతన్ని ఫాలో చేయండి. ప్రతి అరగంటకి ఒకరు కలిసి ప్రేమించామని చెప్పి నమ్మించాలి!" అన్నదామె! "ఓకే! ఓకే! అన్నారు.
11
రమోలా రిసెర్చి స్వభావం కలిగిన సైకాలజీ స్టూడెంట్!
జనసంచారం తక్కువగా వున్న సెంటర్స్ లో వారు కొద్దిసేపు విహారం చేశారు.
ఆ తరువాత ఒక యువకుణ్ణి సెలెక్ట్ చేసింది రమోలా?
అతను పబ్లిక్ గార్డెన్స్ లో పల్లీలు తింటూ కన్పించాడు.
కళ్ళు గడ్డం చిన్నవిగా ఉన్నాయి. పీలగా గడకర్రలా ఆరు అడుగుల ఎత్తున్నాడు. చెంపల మీద ట్రిమ్ చేయని వెంట్రుకలు!
మిడిల్ క్లాస్ దుస్తులు ధరించాడు!
కళ్ళజోడు ధరించాడు కాని దాని స్థానంలో స్థిరంగా ఉండనీయట్లేదు ఒకసారి తీయను మళ్ళీ పెట్టను అలా చేస్తున్నాడు.
పార్కులో జనం సందడిగానే ఉన్నారు.
కాని వారి అబ్జర్వేషన్ లో అతడు ఒంటరిగానే ఉన్నట్లు తేలింది. పల్లీలు తినటం పూర్తి అయింతరువాత పైపు దగ్గర మంచినీళ్ళు లాగించి మళ్ళీ తిరిగి వచ్చి బెంచిమీద కూర్చున్నాడు.
మన పాయింట్ మీద రిసెర్చికి ఇతడే సరయిన ఎయిడ్ అంది రమోలా!!
అతన్ని రిసెర్చి చేసే వస్తువుగా భావించి వారు రంగంలోకి దిగారు.
ముందు రమోలా అతని సమీపానికి వచ్చింది.
రెండుమీటర్ల దూరంలో నిలిచి మఫ్లర్ మెడచుట్టూ త్రిప్పుకుంటూ నవ్వింది.
"నేను మీకు తెలుసా?" అన్నాడు ఆరడుగుల యువకుడు అమాయకంగా!
"అయితే నేను మీకు గుర్తులేనన్నమాట?" అంటూ వచ్చి ప్రక్కనే కూర్చుంది రమోలా. అతడు సభ్యత కోసం కొంచెం దూరం జరిగాడు.
"ఎక్కడో చూచినట్లు మాత్రం అనిపిస్తోంది!" అన్నాడు అనుమానంగా!
"అప్పుడే మర్చిపోయారన్నమాట!"
"ఫ్లూట్ ప్రోగ్రాంలో పరిచయం అయిందా? స్టూడియోలోనా?"
అయితే ఈ మహానుభావుడు ఫ్లూట్ కళాకారుడన్నమాట అనుకుంది రమోలా! ప్రోగ్రాంలు ఇస్తాడన్న మాట? సినిమాలు టివిలకి పనిచేసి ఉండాలి!
"అవునండి. సారధి స్టూడియోలో చూచాను."
"అలాగా! రెండు సినిమాలకు పనిచేశాను గతంలో! ఈ మధ్య ఒక టివి ఫిలింకి కూడ పనిచేశాను. మీరెందుకు వచ్చారండి" అని అడిగాడు.
"ఫ్లూట్ వినటం అంటే నాకు చాలా సరదా అండీ కుమార్ గారూ!"
"నా పేరు కుమార్ కాదు! శరత్!"
"మీరు ఎక్కడుంటారు శరత్ గారూ!"
"సంజీవరెడ్డి నగర్ లో!"
"మీరు ఏం చేస్తుంటారు?"
"వేరే చేయాల్సింది ఏముంది? ప్రోగ్రాంలు బాగానే వస్తున్నాయి."
"మీరు పాడేప్పుడు వింటే నేను ఒళ్ళు మర్చిపోతానండి!"
"సంగీత ప్రియులన్నమాట? చదువుకుంటున్నారా?"
"అవును. నా పేరు రమోలా! మీతో పరిచయం కావటం నాకు చాల సంతోషంగా ఉంది. మీకెలా ఉంది!"
"నాకు కూడ చాలా ఆనందంగా ఉంది రమోలాగారూ!"
"స్టూడియోలో మీతో పరిచయం అయినప్పుడే అనుకున్నాను. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానని! భగవంతుడే మనల్ని ఇలా కలిపాడు కదండి!! భలే చిత్రాలు జరుగుతుంటాయి."
"అవును. ఎప్పుడేం జరుగుతుందో మనం ఊహించలేం"
"మనం కలిసి కాఫీ త్రాగితే ఎలా ఉంటుందంటారు?"
"బాగానే ఉంటుంది. బోల్డు బాగుంటుంది. ఎక్కడికి వెడదాం"
"మీరు కళాకారులు కదా!? మీకన్న అందమయిన చోటు నేను సెలక్ట్ చేయగలనా? మీ ఇష్టం! ఎక్కడికయినా సరే"
"ఎక్కడయినా అందమయిన గార్డెన్ కాఫీబార్ చూచుకుందాం. నా బండిమీద వస్తారా?" అని అనుమానంగా అడిగాడు.
"విత్ ప్లెజర్!" అంది రమోలా! అతడు లేచి ముందుకు నడిచాడు. ఎక్కి కూర్చుంది. ఒక బుష్ చాటున పొంచి ఈ తతంగం అంతా చూస్తున్న మిత్రమండలి చేతులు ఊపారు.
ఆమె వారివంక గర్వంతో నిండిన చూపులు విసిరింది.
గార్డెన్ కాఫీ అని ఓ చిన్న స్లిప్ మీద వ్రాసి నేలమీదికి విడిచిపెట్టింది.
ఈలోగా అతడు కళ్ళజోడు పెట్టుకుని యమహా స్టార్టు చేశాడు! రివ్వుమని గాలిలో దూసుకుపోతున్నట్టు అది వెళ్ళిపోయింది.
వారు అందరూ ఆ చోటుకి పరుగుతీశారు.
గార్డెన్ కాఫీ అని వ్రాసి ఉన్న స్లిప్ వంక చూచారు.
బుట్టలో పెట్టిందన్నమాట!
ఓ అరగంటలో తిరిగి రావచ్చు.
వంతుల వారీగా అతన్ని ప్రేమించామంటూ వెంటపడి వేధించే కార్యక్రమం మొదలు అవుతుంది. అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
నిముషాలు దొర్లుతున్నాయి. వారు వెంటనే తిరిగి వస్తారన్న ఆశ తీరలేదు!
"ఇది తిరిగి వస్తుందా ఇంటికి టెలిగ్రాం ఇవ్వాలా?"
"అంత పని కూడ కావచ్చు" అని వ్యాఖ్యానించింది విమ్మీ.
చాలా వేగంగా మోటారుబైకు మీద రమోలాని తీసుకుపోయాడు. ఎక్కడయినా గార్డెన్ కాఫీ దొరికే హోటల్ కి వెళ్ళాలి.
అది శలవుదినం కావటం వల్ల కాస్సేపు సరదాగా తిరిగినా తప్పు లేదు. కాస్తంత చిరునవ్వు నవ్వి పలకరిస్తే బండిమీద ఎక్కించేందుకు ఊరంతా తిప్పేందుకు సిద్ధమయాడు!
ఈ చిరునవ్వు నవ్వి పలకరించింది మరో మగవాడయితే అతనాలాంటి సాయం చెయ్యడు. ఎవరయినా మిత్రులు బాధతో ఉన్నా అంత రిస్క్ తీసుకోకపోవచ్చు! అపోజిట్ జండర్స్ మధ్య ఉండే ఆకర్షణ అలాంటిది.
కారణం లేకుండా ప్రేరణ ఇవ్వగలిగిందే ప్రేమ!
ఇది ప్రేమ కాదు. కేవలం పరిచయం! ఈ పరిచయం ప్రేమగా మారేందుకు కొన్ని అవకాశాలని మనిషి ఊహించుకుంటాడు.
