"ఇహ లాభంలేదండీ! మంచిమాటలతో ఇది లొంగేలా లేదు. ఎంతచెప్పినా, ఎంత తన్నినా 'బావను చేసుకోవడం నా కిష్టమే అత్తయ్యా!' అనదు. త్వరగా ఆమూడు ముళ్ళు వేయించేస్తే కుక్కినపేనులా పడివుంటుంది. సాయంత్రం పురోహితుడిని తీసుకురండి ముహూర్తం పెట్టించేద్దాం"
భార్య ఫర్మాయింపుతో సాయంకాలం పురోహితుడిని తీసుకువచ్చాడు బసవయ్య.
పురోహితుడు పంచాంగం త్రిప్పివేస్తూ, "పిల్ల నక్షత్రం ఏమిటన్నారు?" అని అడిగాడు.
కామమ్మ చెప్పింది.
"జాతకాలు ఇద్దరికీ బొత్తిగా.........సరిపడవు. పిల్ల, లేడి, పిల్లవాడు సింహము. సంవత్సరం తిరగకుండానే పిల్ల గుటుక్కు మంటుంది."
"ముహూర్తం పెట్టమని పిలిపిస్తే నిన్ను జాతకఫలాలు ఎవరు చెప్పమన్నారయ్యా?" కామమ్మ కస్సుమంది.
"పెళ్లంటే నూరేళ్ళ పంట కదమ్మా?"
"అదంతా నీ కనవసరం. ఈ నెలలో ముహూర్తాలు ఉన్నాయో లేదో ముందు చూడు!"
"చిత్తం. మళ్ళీ శుక్రవారం ఒక లగ్నముంది. పంచమిలగ్నం. అది తప్పితే దశమి లగ్నం ఉంది."
"పంచమి లగ్నమే ఖాయపర్చి పత్రిక వ్రాయండి."
లగ్నపత్రిక వ్రాసి తాంబూలం తీసుకుని వెళ్ళిపోయాడు పురోహితుడు.
లగ్నపత్రిక వ్రాసుకోవడం చూసి భోరుమంది పారిజాత.
"అంతా నీ ఇష్టమేనా, అత్తా? నా బ్రతుకు నిలా నాశనం చేయడానికి నీకేముంది అధికారం? కన్నదానివి కాదు. పెంచినదానివి కాదు. తల్లిలేని పిల్లనని ఒ్కనాడూ తిరిగిచూచిన దానివి కాదు. ఇప్పుడు ఎవరిచ్చారీ అధికారం?" ఏడుస్తూనే సాధించసాగింది.
"ఒకరిచ్చేదేమిటే? దిక్కూ మొక్కూ లేనిదానివి. ఏదో అన్న పిల్లవు కదాని నా కొడుక్కి చేసుకుంటున్నాను. నా కొడుకు కాస్త మెతకవాడే అనుకో వాడికేం తక్కువని? వంద ఎకరాల పొలం, తోట, ఏభై వేలమీద నడుస్తున్న వడ్డీ వ్యాపారం నువ్వు ఎంత పుణ్యం చేసుకొంటే ఈ సంబంధం పడాలి?"
"నీకూ నీ ఆస్తికీ ఓ దండం. నన్ను వదిలిపెట్టు అత్తా!"
"లగ్నం కూడా పెట్టించాను. ఇంకెక్కడికి వెడతావు? నోరుమూసుకు పడు. మొన్నటి వాతలు మాసిపోయినట్టున్నాయి. మళ్ళీ నోరు చేసుకొంటున్నావు!"
"నాన్నా! నువ్వెక్కడున్నావు నాన్నా! వచ్చి నేనెలాటి సుడిగుండంలో చిక్కుకొన్నానో చూస్తున్నావా, నాన్నా?" పెద్దగా ఏడ్చేసింది పారిజాత.
కాస్సేపు తిట్టి, తల్లి అక్కడినుండి నిష్క్రమించడంతో నెమ్మదిగా ప్రవేశించాడు హనుమంతు. "అబ్బ! ఏడవకు పారూ! నువ్వలా ఏడుస్తూంటే నేను చూడలేను. నీకిష్టం లేకపోతే మనం పెళ్ళి చేసుకోవడం మానేద్దాం" అన్నాడు.
గురువారం వచ్చేసింది.
తెల్లవారితే శుక్రవారం రాత్రిమూడు గంటల పది హేను నిమిషాలకు ముహూర్తం.
లగ్నం ఖాయమైనప్పటినుండి ప్రతిక్షణం పారిపోవడానికే ప్రయత్నిస్తున్నది పారిజాత.
కామమ్మ అసాధ్యురాలు ఇరవై నాలుగు గంటలూ కాపలా ఉండడానికి ఒక మనిషిని పెట్టింది పారిజాత కూర్చొన్నా, నిలుచున్నా, స్నానానికి వెడుతున్నా, దొడ్డికి వెడుతున్నా తన డేగకళ్ళతో జాగ్రత్తగా కాలా కాస్తూంటుంది ఆ మనిషి.
"అమ్మా? వధువుకు మంగళ స్నానం చేయించి గౌరీ పూజకు కూర్చోబెట్టండి" పురోహితుడు కేకపెట్టాడు.
"రా అమ్మా, తలంటుతాను" పారిజాతకు తలంటడానికి నూనెగిన్నె తీసుకువచ్చింది ఒక ముత్తయిదువ.
"నేను దొడ్డికి వెళ్ళివస్తాను"
"పద" కాపలా ఉండే మంగమ్మ అనుసరించింది.
పారిజాత దొడ్డిలోకి వెళ్ళింది.
కామమ్మ ఇంటి వెనుకభాగం విశాలంగా ఉంటుంది మరుగు దొడ్డి ఆచివర ఉంటుంది. నాలుగు మొండిగోడలుగా ఉంటుంది. ఓ పక్క గోడపడిపోయి దడిలా కట్టారు. ఆవైపు గోడ అంత ఎత్తుగాలేదు. ఒక రాయిమీద కాలుపెట్టి గోడ ప్రాకి అవతలికి తొంగి చూచింది పారిజాత.
రాత్రి రెండుగంటల సమయం, ఊరంతా నిద్రలో ఉంది, మసక చీకటిగా ఉంది.
