"వాళ్ళయితే వచ్చిచూడనీ, అన్నీ సక్రమంగా కుదిరితే చేసేదే!" అని లేచారు సూర్యదేవులు.
తిరుమలాపురం వాళ్ళు పెళ్ళి చూపులకు వస్తారన్న రోజు దేవదాసి మనఃస్థితి వర్ణనాతీతం! ఇక పెళ్ళి చేసుకోవాలని లేదు. మనసులోని మాటను ఎలా బయట పెట్టగలదు? "ఎందుకని అడుగుతారు, నా మనసు బావమీద నిలిచిపోయిందని చెప్పగలనా? బైరాగి వాడిమీద ప్రేమేమిటని అది పరిహాస కారణమౌతుందేమో!" గదిలో ఒక్కతే ఉండిపోయి ఇదే ఆలోచిస్తున్నది.
తాతయ్య తన పెళ్ళి చూచి పోతానంటున్నాడు పరమపదానికి వేంచేస్తున్న వేళ ఆ మనిషి అంతిమ కోరిక తీర్చకపోవడం మహాపరాధమే అవుతుంది. తననెక్కువగా ప్రేమిస్తున్న తాతయ్యకోరిక నిరాకరించడమూ అసాధ్యమే. పోతే ఆడది బ్రహ్మచారిణిగా ఉండడం సమాజమూ, తల్లిదండ్రులూ అంగీకరించరు! మనసు చంపుకుని ఏది జరిగినా తలవంచక తప్పదు, బావ చెప్పినట్లు అది నాటకమే కానీ అదే రాజయోగమని సంతృప్తిపడకా తప్పదు. ఒకనాడు బావకు చెప్పిన బుద్ధి ఇప్పుడు తన మనసుకే చెప్పుకోక చేసేది లేదు! ప్రాపంచిక సుఖాలయందు ఒక కారణంగా బావకు ఆసక్తి నశించితే, తనకు మరొక విధంగా ఆసక్తి తప్పిపోయింది. మార్గాలు ఏమైనప్పటికి ఇద్దరున్న పరిస్థితి ఒక్కటే. తన ఆకర్షణ నుండి తప్పించుకొని ఆధ్యాత్మిక పథంలో మనసును స్థిరంగా ఉంచుకొనలేక బావ, బావను పొందలేక తనూ వేదనాగ్నిలో దహింపబడుతున్నారు.
తిరుమలాపురం వాళ్ళు వచ్చారు. తల్లి వెంటనే వెళ్ళి చూపులకు మరబొమ్మలాగే వెళ్ళి నిల్చుంది దేవదాసి. పిల్ల నచ్చకపోవడమన్న సందేహం ఎవరికీ లేదు. ఆ నోటా ఆ నోటా పిల్ల సౌందర్య ప్రశంస వినే, వాళ్ళు ఈ సంబంధానికి వచ్చారు, దేవదాసిని తల్లి చూచాయగా ప్రశ్నిస్తే అంగీకారమో అనంగీకారమో స్పష్టంగా తెలియకుండా మందమతివలెతలూపి పారిపోయిందక్కడినుండి ఆమె.
మంచిరోజు చూచివచ్చి తాంబూలాలు పుచ్చుకొంటామని, ఆ రోజే వివాహానికి సుమూహర్తం నిశ్చయించుకొందామని చెప్పి వెళ్ళిపోయారు పెళ్ళివారు.
12
శ్రీలక్ష్మి భయపడుతూనే ఉంది. పెద్దాయన పరిస్థితి నమ్మతగ్గదిగా లేదు. పిల్లపెళ్ళి దాటిపోతే ఏమైనా పరవాలేదు అని. సరిగ్గా పెళ్ళివారు తాంబూలాలు పుచ్చుకోవడానికి వచ్చినరోజే ముసలాయన క్రిందమీదా చేశాడు. రాత్రి నుండి సుస్తీ ఎక్కువయిపోయి ఉదయానికల్లా అపభ్రంశపు మాటలు మొదలయ్యాయి గోపాలదేవులకు.
"ఈ వాపుల రోగం నమ్మతగ్గదికాదు మాట్లాడుతూ మాట్లాడుతూనే పోతారు" ఆయనను చూచిపోవడానికి వచ్చిన వాళ్ళల్లో ఒకరు చాటుగా అన్నారు.
కాళ్ళమీద, చేతులమీద వచ్చిన నీరు దిగి అంతా కడుపులోకి వచ్చేసింది. పడకమీద పిచ్చి చూపులు చూస్తూ, ఆయాసపడుతున్నారు, గోపాలదేవులు; రకరకాల భావాలను ప్రతిబింబించే కాంతివంతమైన ఆ కన్నులు గాజు పెంకుల్లా తెల్లబడ్డాయి. ముఖంలో ప్రేతకళపడింది.
ఆయన బలగమంతా ఆయనచుట్టూ ఉన్నది. తలదగ్గర కొడుకు కూర్చొన్నాడు. పాదాలవద్ద కోడలు కూర్చొంది. రాత్రే కబురందుకొని ఉదయానికల్లా వచ్చిన కృష్ణవేణి ఒక ప్రక్క, పెద్దమనుమరాలు దేవదాసి ఒక ప్రక్క కూర్చొన్నారు. అందరినీ వరుసగా కలియజూస్తున్నారు. గోపాల దేవులు. "అల్లుడు...." అన్నారు అస్ఫష్టంగా.
అవతలి గదిలో ఉన్న శ్రీనివాసరావు వచ్చాడు.
"నా మనుమడు.... ఏ.....కృష్ణా....?" జీవుడు అంతిమ యాత్ర చేయబోతున్నప్పుడు తన బలగమంతా చెంతనుండాలనుకొంటాడు. ఎందుకో?"
కృష్ణవేణి కన్నీరు నించుకొంది.నోటమాట పెగలలేదు. శ్రీనివాసరావే చెప్పాడు సాధ్యమైనంతవరకూ ఆయనకు బోధపడే విధంగా, "మీ మనుమడు అక్కర్లేదు. ఉంటే వచ్చేవాడే. విశ్వభారతి ప్రొఫెసరుగా వెళ్ళాడు. ఎనిమిది రోజులయింది వెళ్ళి."
ముసలాయన ముఖంలో ఒక సంతృప్తిరేఖ మెరిసింది బాధగా అనుకొంది కృష్ణవేణి.
మనుమడు ఒకప్రయోజకుడయ్యాడని అనుకున్నాడేమో? నాపోరు పడలేక ఉద్యోగం నెపంతో పారిపోయాడని ఏం తెలుసు?'
"సూ.....ర్య....దేవా!"
"నాన్నా" దగ్గుత్తికతో అన్నారు సూర్యదేవులు.
"సూర్యదేవుడెక్కడ?"
"ఇక్కడ."
