Previous Page Next Page 
అగ్ని కెరటాలు  పేజి 32


    "మాటలు వేరు, జీవితం వేరు, నీకింకా అర్దమయ్యే వయసురాలేదు!"


                       *    *    *    *

       
    దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయాక ఒకరోజు -

    హరిత కాలేజీకి సెలవు కావడం వలన ఇంటిలోనే వుంది.

    సుమారు ఏభై సంవత్సరాలున్న ఒకామె  గుమ్మం  దగ్గర సంకోచంగా ఆగిపోయి కనిపించింది.
 
    హరిత లేచివస్తూ "ఎవరు కావాలి?" అని అడిగింది.

    ఆవిడ గొంతు పెగల్చుకొంటూ "నేను... ప్రమీల తల్లిని" అంది.

    "అలాగా? లోపలికి రండి" ఆవిడ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చోవడానికి సంకోచపడుతూంటే, "ఫర్వాలేదు కూర్చోండి! అమ్మను పిలుస్తాను!" అని, లోపలికి  వచ్చి, "ప్రమీల అమ్మగారట వచ్చారు!' అని చెప్పింది తల్లితో.

    చేస్తున్న పని ఆపేసి చేతులు తుడుచుకొంటూ వచ్చింది హేమలత. "ప్రమీలని తీసుకు వచ్చారా?" అంది.
 
    "అవునమ్మా! పిల్లకి బారసాల చేసి నెలలోపలే తీసుకు వచ్చాను!"

    "ఎవరి పిల్ల?"

    "ప్రమీలకి కూతురు పుట్టిందమ్మా! పిల్లని కాపురానికి పంపుతారా, వేరే పెళ్లిచేసుకోనా" అని అల్లుడు గారు బెదిరించడం ఎక్కువైపోవడంతో పచ్చి బాలింత అయినా తీసుకురాక  తప్పలేదు?"

    "తీసుకు వచ్చి మంచిపని చేశారు. తెగేదాకా త్రాడు లాగడం విజ్ఞత కాదు కదా?" అంది హేమలత.

    "గుండె రాయి చేసుకొని తీసుకు వచ్చానేగాని  వదిలి వెళ్లాలంటే కాళ్లాడ్డంలేదు!  పచ్చి బాలింత!  కిరాతకంగా  కొట్టి చంపుతాడేమోనని భయం!" ఆవిడ  గొంతు దుఃఖంతో పట్టుకుపోయినట్టుగా అయింది. "కాని, ఏం చేయను? నాకింకా పెళ్లి కావలసిన ఆడపిల్లలున్నారు.  వాళ్లకి పెళ్లిచేసి ఎప్పుడు పంపుతానా అన్న ఆలోచనలతో నిద్రపట్టక చస్తుంటాను! ఇక పెళ్లయిన పిల్లను కూడా కాపురం వదిలించి ఇంట్లో ఎలా కూర్చో బెట్టుకోను? మేమంతా మగడితో, అత్తతో దెబ్బలు తినకుండా, చీవాట్లు తినకుండా కాపురాలు చేశామా? ఆడజన్మ ఎత్తాక ఈ కష్టాలన్నీ తప్పవు! ప్రమీలకు అదే నచ్చజెప్పి తీసుకువచ్చాను!"

    "ఇప్పుడు ఇద్దరి మధ్యకు ఒక పాప వచ్చింది. పిల్లలు పుట్టాక  మగవాళ్లు మారుతారులెండి" ఆవిడకు ఊరట కలిగిస్తున్నట్టుగా అంది హేమలత.

    "తనంటే మీకు అభిమానమని చెప్పింది మా ప్రమీల కొంచెం కనిపెట్టి ఉండండి!" ఆ మాట చెప్పి పోదామనే వచ్చాను"

    "ఇరుగు పొరుగున వుండి ఆ మాత్రం చూడకుండా ఎలా వుంటాం?"

    "నాకదే ధైర్యం! పొరుగున మీ బోటి సహృదయు లుండడం కొద్దిలో కొద్ది పుణ్యం చేసుకుందామనుకోవాలి!" ఆవిడ కొంచెం ఆగి, కళ్లనీళ్లు పెట్టుకుని అంది! "బిడ్డ వచ్చినరోజు ఒళ్లంతా కందిన దెబ్బలు చూసేసరికి "ఇహ చచ్చినా బిడ్డను అత్తవారింటికి పంపించకూడదు" అనుకొన్నాను. "కడుపులో పెట్టుకు దాచుకొంటాను" అనుకొన్నాను! కాని, తల్లి మమకారాన్ని కూడా పరిస్థితులు   ఓడిస్తాయండీ! మగణ్నీ సంసారాన్ని పోగొట్టుకున్న పిల్లను కడుపులో దాచుకొని ఏం చేస్తాను? అప్పుడు కడుపులో దాచుకొనేది బిడ్డను కాదు, నిప్పును అనిపించింది రోజులు గడిచినకొద్దీ"

    "ఆ మాట నిజమే లెండి" అంది హేమలత.

    "భర్త దగ్గర సంసారం చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమెను ఆదుకోవడం తల్లిదండ్రుల బాద్యతకాదా?" చురుగ్గా అడిగింది హరిత.

    "మధ్య తరగతి ఆర్దిక పరిస్థితులు ఒక స్త్రీ భర్తనూ, కాపురాన్నీ వదిలేసి వస్తానంటే ఆమెకు అండగా నిలవడానికి ఒప్పుకోవమ్మా!"

    "ఏ స్త్రీ కూడా కాపురం వదిలేసుకోవాలనుకోదు! ఎంత దుర్బరమైన బాధ అనుభవిస్తేనో, ఆ నిర్ణయానికి వస్తుంది. అటువంటప్పుడు ఆమె బాధనూ, ఆమె పరిస్థితిని  మనం అర్దం చేసుకోవాలి. ముందు దాన్ని గుర్తించాల్సింది తల్లిదండ్రులు. భర్తను వదిలేసినంత మాత్రాన ఆమెను మీరు కడుపులో నిప్పుగా ఎందుకు బావించాలి? "నా బిడ్డకు ఈ భర్త లేకుంటే పీడాపోయె!  అది తన కాళ్లమీద తను నిలబడే స్తోమత, ఒంటరిగా  బ్రతకగల ఆత్మ స్థయిర్యం కలిగిస్తాము" అని మీరు ఎందుకు  అనుకోలేరు?"

    "దీనికి మధ్య తరగతి ఆర్దిక పరిస్థితులే కాదు, మేం జీర్ణించుకున్న సంప్రదాయాలు కూడా కారణమమ్మా!కష్టమో, సుఖమో భర్త దగ్గరున్న గౌరవం, మర్యాద అతడిని వదిలేసి ఒంటరిగా వుంటానంటే  వుండవు కదా, మన హిందూ సమాజంలో అసలు, మన సమాజంలో స్త్రీ ఒంటరిగా జీవించగల పరిస్థితులు ఏర్పడ లేదమ్మా. భర్త కొడుతున్నాడు, తిడుతున్నాడని ఇంట్లో పెట్టుకొన్నామనుకో.  కాదూ! భర్తను వదిలేసిందన్న మాట చులకన భావానికి తోడు బ్రతుకు తెరువు సమస్య  అవుతుంది. అయినా, ఇప్పుడు తను ఒక్కతెకాదు! ఒక నలుసుకూడా. ఆ నలుసు భవిష్యత్తు ఆలోచించినా తండ్రి దగ్గరుండడమే సమంజసం కదా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS