"కాఫీ టిఫిన్ ఏమయినా తీసుకురమ్మంటారాసార్?" అనడిగాడు వెయిటర్ వచ్చి.
"ఇడ్లీ దోసి-సాంబారుతో, పూరీ కుర్మాకూరతో రెండేసి ప్లేటులతో తీసుకురా! కాఫీస్ట్రాంగ్ గా వుండాలి!"
మాధవరావు చెప్పిన తరువాత వెళ్ళిపోయాడు.
"ముఖం కడుక్కుని రా! యిది బాత్ రూం! నీళ్ళు యిలా తిప్పుకోవాలి! యిలా కట్టేయాలి! యిది లావెటరీ!"
ఎలా కూర్చోవాలో తను కూర్చుని చూపించాడు.
"వేప పుల్లలేదు! ముఖం తోముకునేటందుకు సబ్బులేదు!" అంది.
"అవన్నీ నేను తరువతః తీసుకుని వస్తానుగా? నీళ్ళతోనే కడిగేసుకూనిరా!" అన్నాడు బకెట్ లోకి నీళ్ళు తిప్పి-
అతను చెప్పినట్లుగానే చేసి పమిటి చెంగుతో ముఖం తుడుచుకుంటూ ఇవతలికి వచ్చింది....యింతలో సప్లయర్ ట్రేలో ఆరు ప్లేటులు, గిన్నెలూ పెట్టుకుని వచ్చి టీపాయ్ ని మధ్యకి లాగి దానిమీద ట్రే వుంచి కూజాలోని నీళ్ళు గ్లాసులలో నింపి తీసుకుని వచ్చి అక్కడ వుంచి వెళ్ళిపోయాడు. వాటిని చూడగానే కావేరి కళ్ళు యింతింత అయ్యాయి ఆకలి కూడా వేసింది. రాత్రి భోజనం ముందు కూర్చోగానే తినటానికి యిష్టంలేక పోయింది. తనేదో తప్పు చేస్తున్నట్లుగా బాధపడటంతో నాలుగు ముద్దలు కూడా తినలేకపోయింది. యిప్పుడు అన్ని రకాల టిఫిన్లుని చూడగానే ఆకలి విజ్రుంభించింది.
యితను చాల మంచివాడు? లేకపోతే తనకోసం యింత శ్రద్ద తీసుకుంటాడా? మద్రాసు నగరంలో కాలు పెట్టగానే తనకి అసిస్టెంటు డైరెక్టరే తారసపడటం తన అదృష్టంగానే భావించింది. యితని ద్వారా తను తారాపధాన్ని యిట్టే అధిగమించి త్వరలోనే తను గొప్ప హీరోయిన్ కాగలను! మగవాళ్ళు మంచివాళ్ళు కాదని తను కధల్లో చదివింది. తన తల్లి తండ్రులు కూడా ఒక్క వినాయకం బావతో తప్ప యింకెవ్వరితోనూ మాట్లాడనిచ్చే వారేకాదు! బావ అని అనుకోగానే గతరాత్రి తను ఆ యింటినే ఆ ఊరినే వదిలి వచ్చేసి తరువాత తను లేనట్టు ఎప్పటికి చూసుకుని వుంటారు?...ఈ సరికి అందరి మొహాలూ వేలాడిపోయి వుంటాయి. బావ ఎలా వున్నాడో? కామాక్షి అత్తయ్య తనను ఎంతగా తిట్టుకుంటున్నారో?.... పాపం! తనకున్న వస్తువులన్నీ నాకు పెట్టింది. అవన్నీ తీసుకుని వచ్చినందుకు తనను ఎంతగా తిట్టుకుంటున్నారో? పెళ్ళయితే సినిమాలూ నాటకాలు కూడా మానివేయాలట! ఎంత చక్కగా చెప్పింది? యిప్పుడు బాగా తిక్క అణిగిందిగా? తను గొప్ప సినిమాతార అయినా తరువాత కొత్తరకం కారు కొనుక్కుని ఎంతో దర్జాగా ఆగ్రామం వెళ్ళుతుంది....తను తీసుకువచ్చిన అత్తయ్య వస్తువులను తిరిగి కొత్తవి చేయించి అంతకంటే ఎక్కువ బంగారం తీసుకెళ్ళి యివ్వవలసిందే! అప్పుడుగాని త్ర్హన ప్రతిభ ఏమిటో తెలుసుకోలేరు.
"ఏమిటి ఆలోచించుతున్నావు కావేరీ?" తింటున్నదల్లా ఒక్కసారే ఆగిపోయి నిశ్శబ్దం అయిపోవటంతో అడిగాడు మాధవరావు తను తినటం ఆగి!
"మా యింటిలోని వాళ్ళగురించి!" అంది అప్రయత్నంగా.
"చీర కట్టుకుంటే అనుమానం వస్తుందని ఈ చీరకట్టుకున్నాను." అంది మంచినీళ్ళు త్రాగటం ఆపి.
"ఇలా వచ్చేయతానికి గల కారణం ఏమిటి? న దగ్గిర ఏ చిన్న విషయమూ దాచకుండా చెప్పు కావేరీ?" అనడిగాడు.
ఏం చెప్పితే బాగుంటుందా? ఎలా చెప్పితే అతనికి నచ్చుతుంది. అసలు చెప్పాలా? వద్దా? అన్నమీ మాంసలో పడిపోయి మౌనం వహించింది.
ఎంతకీ మాట్లాడని కావేరిని చూసి నవ్వుతూ....
ఇకనయినా నీ విషయం చెప్పుతావా? అసలు నీ ఆశయం ఏమిటో? ఎందుకు యిల్లువిడిచి వంటరిగా వచ్చావో?...వివరంగా చెప్పితే నీకేదయినా సహాయం చేయాలని నాకనిపించుతుంది. చెప్పు కావేరి? ఏ విషయానికి భయపడవద్దు!...నీకు నేనున్నాను!" అంటూ ఎంతో చనువుగా భుజంమీద చెయ్యివేశాడు మాధవరావు.
అతనలా చెయ్యి వెయ్యగానే కావేరీ శరీరంలో గగుర్పాటు కలిగింది. చిన్నగా ఉలిక్కిపడింది.
కావేరీలోని ప్రకంపన చూసి మాధవరావు చప్పున భుజంమీద నుంచి తనచెయ్యి తీసేసి చిన్నగా నవ్వుతూ అన్నాడు.
"సారీ కావేరీ?...ఏదో భావావేశంతో నిన్ను తాకాను. ఇక ముందెప్పుడూ అలా తొందరపడను. అలాగని నీకు ఆ భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను."
అప్పటికి కావేరి మనసు తేలికయినది. మాధవరావు అంత నమ్మకంగా చెప్పిన తరువతః అంత తేలికగా అతన్ని తీసి పారవేయకూడదు. యితని అండతో తను పెద్ద హీరోయిన్ అవగల అవకాశాలు కూడా ఎక్కువే వున్నాయి. పైగా అతడు అసిస్టెంటు డైరెక్టర్ కూడాను!....వంటరిగా వుండేకంటే ఈ మాధవరావు అండలోనే వుండటం మంచిది. యింక తను ఏ విషయమూ దాయకుండా చెప్పేస్తే తనకి సహాయకారి కాగలడని నమ్మింది.
ఏ చిన్న విషయమూ దాయకుండా, తన చిరకాలవాంఛ!....తన ఆశయము!....తన నాటకానుభావం!...తనకి పెళ్ళి నిశ్చయం అవటం. పెళ్ళి చేసుకుంటే తన ఆశయాలు అడియాశలవుతాయన్న ఉద్దేశంతోనే తను సాహసించి యిలా వచ్చేయటం జరిగిందని చెప్పింది కావేరి.
అంతా ఎంతో శ్రద్దగా విన్న తరువాత ఆలోచించి అన్నాడు-
"ఆలోచన చాలామంచిదే! సినిమా హీరోయిన్ అవగల అందచందాలు నీలో వున్నాయి. పచ్చని శరీర చాయ! అన్నిటికంటే ముఖ్యమయినది నీ అందమయిన పర్సనాలిటీ! నడుస్తుంటే పిరుదులుని తాకే నీ వాలుజడ! ఏ నిర్మాత అయినా చూడగానే తన చిత్రంలో వెంటనే బుక్ చేసుకుంటాడు. యిది మాత్రం గ్యారంటీ యివ్వగలను!"
అంటూ కావేరివైపుకి చూశాడు మాధవరావు.
అతనలా అనటం, తన వైపుకే గుచ్చి గుచ్చి చూడటంతో కావేరికి సిగ్గు ముంచుకువచ్చింది.
"ఇలా సిగ్గుపడితే లాభంలేదు. అందరితో క్లోజ్ గా వుండాలి! నాకెంతో తెలుసు అన్నట్లుగా వుండాలి! నమస్కారం పెట్టినవారికి నమస్కారం పెట్టాలి! షేక్ హాండ్ యిచ్చేవారిని వద్దనకూడదు. నువ్వెంతో ధనవంతురాలివి! అంటే జమిందారీ యింటి పిల్లవు. సినిమా కళమీద వ్యామోహంతో చదువుకి స్వస్థి చెప్పి ఈ ఫీల్డులోకి వచ్చానని, ఎవరయినా అడిగినప్పుడు చెప్పాలి! నాకు తెలిసిన కొంతమంది ప్రొడ్యూసర్సు వున్నారు. వారి దగ్గిరకు తీసుకెళ్ళి నిన్ను పరిచయం చేస్తాను. సినిమా షూటింగ్ లు చూపించుతాను. వారెలా నటించుతున్నారో చూడు! కెమెరా ముందుకి రాగానే ఏమాత్రం సిగ్గుపడకూడదు!"
"అంటే?..." అర్ధం కాక అడిగింది.
