"చూశావంటే నారు పోసినవాడే నీరు పోస్తాడని నేను అంటూ వుంటాను గదూ? చూడు! ఇప్పుడు ఆ భగవంతుడే అంజికి మనింటి త్రోవ చూపించాడు" అన్నాడు భార్యతో ఉత్సాహంగా కుటుంబయ్య.
రామసుబ్బమ్మ ఓ నిట్టూర్పు విడిచింది.
"నీ శ్రార్ధం. అంజిని పంపించింది భగవంతుడు కాదు. పదివేలు" అనాలనిపించింది రమకు.
"నీకు కావాల్సినంత మందిని తీసుకెళ్ళు బాబూ! మొహమాటపడకు" దొడ్లో విరగకాసిన సొరకాయల్ని ఇస్తున్నట్టు ఉదారంగా అన్నాడు.
"ఎంతమందో ఎందుకు? ఒక పిల్ల చాలు. ఆడపిల్ల కావాలి" అన్నాడు అంజి.
"ఆడపిల్లను పెంచుకుంటావా?" ఆశ్చర్యంగా అడిగాడు కుటుంబయ్య.
"అవునండీ ముందు ముందు ఆడపిల్లకే మంచి భవిష్యత్తు వుంది. కనీసం చీఫ్ మినిష్టరయినా అవుతుంది ఆడపిల్ల అయితే" అన్నాడు అంజి.
ఐదు వందలకు అతి కష్టంమీద బేరం కుదిరింది. రామసుబ్బమ్మకు కడుపులో పిల్ల కదులుతున్నట్టు అనిపించింది.
"పదివేలలో ఐదు వందలు తగ్గాయి" అనుకున్నాడు అంజి.
కుటుంబయ్య పిల్లలందర్నీ వరసగా నిలుచోబెట్టాడు. ఆరోయేడు వచ్చిన పిల్లను ఎంచుకున్నాడు అంజి.
ఆ పిల్ల జంకూ గొంకూ లేకుండా రమ చెయ్యి పట్టుకొని బయలుదేరుతూంటే రామసుబ్బమ్మ కళ్ళు ఒత్తుకుంది.
"నాకు బిస్కెట్లు పెడతారా అన్నీ నేనే తింటాను" అంది ఆ పిల్ల.
రమకు ఆ పిల్ల నెత్తిమీద మొట్టికాయ వెయ్యాలనిపించింది.
రోడ్డుమీద నడుస్తూ ఆ పిల్ల నానా అల్లరి చెయ్యసాగింది.
"నీ పేరేమిటి" అంజి అడిగాడు.
"అలివేలు!" అని చెప్పింది ఆ పిల్ల.
"అలివేలు కాదు నీ పేరు పదివేలు" అన్నాడు అంజి.
"ఉహు! నా పేరు అలిమేలే!"
"నీ పేరు పదివేలు. ఆ పేరే చెప్పాలి. లేకపోతే నిన్ను మీ ఇంటికి పంపిస్తాను." బెదిరించాడు అంజి.
"ఇప్పుడు చెప్పు నీ పేరేమిటి?" రెట్టించాడు అంజి.
"అలి...కాదు పదివేలు" అన్నది అలివేలు.
"గుడ్!" అన్నాడు అంజి ఉత్సాహంగా.
దారిలో కనబడిన ప్రతి వస్తువూ కొనమని మారాం చేయసాగింది. కోప్పడితే వెళ్ళిపోతాను అంటూ మొండికేసి రోడ్డుమీద నిలబడిపోసాగింది.
అంజికి నాలుగు తనని తరిమెయ్యాలనిపించింది. కాని "పదివేలు" కోపాన్నీ, విసుగుల్నీ దిగమ్రింగి బ్రతిమిలాడసాగాడు.
"ఆకలేస్తూంది" అన్నది అలివేలు హోటలు దగ్గరకు రాగానే.
హోటల్లో ఆ పిల్ల అడిగిన ప్రతి వస్తువూ తినిపించాడు. ఆ పిల్ల తింటూ వుంటే బాల్ - బేబీ కథ వినిపించాడు. అలివేలు శ్రద్ధగా వింటూ తిన్నది.
హోటల్ బయటకి వచ్చాక ఆ పిల్లకు చెప్పిన కథ తిరిగి చెప్పమని అడిగాడు.
"మరి నాకు కీ ఇస్తే చప్పట్లు కొట్టే కోతిబొమ్మను కొనిపెడతావా?" అడిగింది అలివేలు.
అంజికి ఒళ్ళుమండిపోయింది. మొట్టికాయ వేయబోయి ఆగిపోయాడు.
"బొమ్మా లేదు గిమ్మా లేదు పద!" అంది రమ.
అలివేలు గిర్రున తిరిగి పరుగెత్త సాగింది. అంజి వెంటబడి పట్టుకున్నాడు.
"నేనెప్పుడూ నీళ్ళలోకి పళ్ళేదు. ఆ చెరువు కూడా చూళ్ళేదు. నువ్వు చెప్పిందంతా అబద్ధం!" అంది అలివేలు.
టాయ్ ఎంపోరియంలోకి తీసుకెళ్ళి కీ ఇస్తే చప్పట్లు కొట్టే కోతి బొమ్మను కొని ఇచ్చాడు.
"అంజి ఏదో పరుగెత్తే రైలు కావాలి" అంది అలివేలు.
"అంజీ అనకూడదు. మమ్మల్ని అమ్మా, నాన్నా అని పిలవాలి?" అన్నది రమ.
"ఆ రైలు కొనిస్తే పిలుస్తాను" అన్నది అలివేలు.
అంజి నెత్తి బాదుకున్నాడు. చేసేది లేక రైలుకొని పిల్లకు ఇచ్చాడు. అలివేలు ఉత్సాహంగా బయటకి వచ్చింది. రెండు బొమ్మల్నీ రెండు చేతులతో పట్టుకొని.
"మరో యాభై బొర్రి పడింది పదివేలకు" అనుకున్నాడు.
అంజి, రమా ప్రాక్టికల్ గా బాల్ - బేబీ సంఘటన చూడటానికి చెరువు గట్టుకు వెళ్ళారు.
అంజి అలివేలును నీళ్ళలోకి దిగమన్నాడు. ఆ పిల్ల భయపడింది. అంజి బలవంతంగా ముంచడానికి ప్రయత్నిస్తూ వుంటే, అలివేలు అంజిని నీళ్ళలోకి తోసింది. అంజి నీళ్ళలో పడ్డాడు. తడిసి ఒడ్డుకు చేరుకుంటున్న అంజిని చూస్తూ కిలకిల నవ్వింది అలివేలు.
అంజి ఒక్కసారిగా అలివేలును ఎత్తి నీళ్ళలోకి విసరబోయి భుజాలమీద కూర్చోబెట్టుకున్నాడు.
26
టేబుల్ క్యాలండర్ లో అక్టోబరు 20 వ తారీఖు కన్పిస్తున్నది. రవి కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్నాడు. పేజీలు తిరిగిపోతున్నాయి. కాని ఏం చదువుతున్నాడో అర్థం కావడం లేదు.
జగన్నాథం పది అంతస్తుల మేడ పిట్ట గోడమీద కూర్చున్న వాడిలా బిగుసుకొని కూర్చున్నాడు.
