ఒక్కొక్కసారి అటువంటి విష వలయంలో చిక్కుకున్నప్పుడు బయటపడటం కూడా కష్టమే.
విజయ్ మీద అసంఖ్యాకంగా ప్రెస్ లో వచ్చిన అభియోగాలు పోలీసు ఉన్నతాధికారులను, పోలీస్ సిబ్బంది యావన్మందిని కలవరపరచింది.
న్యాయానికి ధర్మానికి, నీతికి నిజాయితీకి, ఆదర్శాలకు మారు పేరుగా వున్న విజయ్ మీద వచ్చిన అభియోగాన్ని అందరూ ఖండించారు.
ఉన్నతాధికారులు పోలీసుశాఖ గౌరవ మర్యాదలకు భంగం కలిగిందని ; జరిగిన వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజల ముందు వుంచటం కోసమని ప్రెస్ మీట్ పెట్టారు.
ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం విషయం తెలిసే వరకు విజయ్ ఉన్నతాధికార్ల మీటింగ్ జరుగుతుంటే హెడ్ క్వార్టర్సులో వున్నాడు. ఆ విషయం హెడ్ క్వార్టర్సులో వున్న ఆఫీసర్లు, విజయ్ ని పలకరించిన జిల్లా పోలీసు ఆఫీసులోని స్టాఫ్ కూడా చెప్పారు. అంతేకాక విజయ్ మార్చిన బస్ వారంట్లు కూడ విజయ్ రాయుడిపాలెం నుండి బయలుదేరిన వేళను తెలియజేస్తాయి. విజయ్ వెళ్ళిన తరువాత పనిపిల్ల వంట పూర్తిచేసి క్యారియర్ లో టింకుకు భోజనం తీసుకుని కాన్వెంట్ కు వచ్చినట్లు కాన్వెంట్ టీచర్లు అంతా చెప్పారు. కాన్వెంట్ నుండి యింటికి తిరిగి వస్తున్నప్పుడు మార్గమధ్యంలో ఈ అరాచకం జరిగిందని తరువాత ఆ నేరాన్ని విజయ్ మీద నెట్టి అతన్ని సాధిద్దామని విజయ్ అంటే గిట్టనివారు చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఇది అంతా రాయుడి ప్లాను అయివుంటుందని ఉన్నతాధికార్లతో సహా విజయ్ కూడా అనుమానం వచ్చింది. రాయుడే పనిపిల్లని రేప్ చేసి చంపి వుండవచ్చన్న అనుమానంతో రాయుడిని ఇంటరాగేట్ చేయాలని సిబ్బందిని తీసుకుని రాయుడు ఇంటిని చుట్టుముట్టాడు విజయ్. అప్పటికే రాయుడు వూరు వదిలి పారిపోయాడు. దాంతో రాయుడిమీద అనుమానం మరింత బలపడింది.
సైంటిఫిక్ ఎయిడ్స్, మెడికల్ ఎవిడెన్స్ తో ఆ నేరం రాయుడు చేసినట్లుగానే దర్యాప్తులో తేలింది. రాయుడిని అరెస్ట్ చేయటానికి సరిపడ్డా ఆధారాలు లభించాయి.
* * *
విలేఖరులు అంతా విజయ్ దగ్గరకు వచ్చారు. వారంతా విజయ్ తో జరిగింది, రాయుడు వాళ్ళను ఎలా మోసగించి ప్రెస్ మీట్ లో నమ్మించింది చెప్పటానికి ప్రయత్నించారు.
విజయ్ తను ఊహించగలనని చిరునవ్వు నవ్వాడు. ప్రజల మనస్తత్వంలో మార్పు రానప్పుడు, పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు ; పోలీసు ఆఫీసర్ల మీద గౌరవ మర్యాదలు ఎందుకు వుంటాయి.
విలేఖరులు కూడా ప్రజలనుండి వచ్చినవారే. తమని తాము తృప్తిప్రచుకోవటంకన్నా ప్రజలను తృప్తి పరచటం కోసం; పేపరును బ్రతికించటంకోసం కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మషాలాలు దట్టించి రాస్తున్నారు. తప్పదు. ప్రతి మనిషి ఆశాజీవి. సంఘజీవి కూడా.
కొన్ని కొన్ని సందర్భాలలో అమాయకులు, అల్లరిపాలు అవుతున్నారు. అసలు సిసలు ముద్దాయిలు తెలివిగా తప్పించుకుంటున్నారు.
దర్యాప్తులో రాయుడు నేరస్తుడని, విజయ్ నిర్దోషి అని రుజువయ్యింది. అంతకుముందు పోలీసు ఆఫీసర్ ను అనుమానించి రాసిన పత్రికలు ఇప్పుడు ఆ సమాచారాన్నే ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దర్యాప్తు పూర్తి అవ్వకుండా పంపిన ఫ్లాష్ న్యూస్ కి దర్యాప్తు పూర్తి అయ్యాక పంపిన న్యూస్ కి తేడా కేవలం 12 గంటలు.
ఈ మధ్యకాలంలో నలిగిపోయింది ఇన్ స్పెక్టర్ విజయ్. తరువాత విలేఖరులు.
ఈ వ్యవస్థ మారనంతవరకు, ప్రజలలో అసలు వార్తాపత్రికల గురించి సరియైన అవగాహన లేనంతవరకు "ఎల్లో జర్నలిజం" కొనసాగవల్సిందేనేమో! వార్తాపత్రికలు జోక్ బుక్స్ కాదు, పోలీసులు జోకర్లు కాదు, కాని పోలీసు వ్యవస్థ మీద అసభ్యంగా రాయని పత్రికంటూ, వార్తరాని రోజంటూ లేదు! విజయ్ మనసు ఆక్రోశించింది.
పోలీసు ఆఫీసర్ కు కావలసిన అర్హతలు, శిక్షణ, సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు, కష్ట నష్టాలు అందరికి క్షుణ్ణంగా తెలుస్తేగా! పోలీసులు తమ తమ జీవితాలను ప్రజల సేవ కొరకు ఎలా త్యాగం చేస్తున్నారో అర్థం చేసుకునేవారు అసలు ఈ సమాజంలో వున్నారా? శత్రు సైన్యాన్ని ప్రాణాలకు తెగించి పోరాడి దేశాన్ని రక్షిస్తున్నాడు వీర జవాన్.
సమాజంలోని దుష్టశక్తుల బారినుండి ప్రజలను రక్షిస్తూ కొన్ని సందర్భాలలో అతివాదుల అక్రమాలకూ ప్రాణాలను పోగొట్టుకున్న పోలీసు ఆఫీసర్లు వున్నారన్న సంగతి ఎంతమందికి గుర్తు వుంటుంది ?
విజయ్ తను ఏ పరిస్థితులలో, ఏ ఆశయాలతో పోలీసుశాఖలో చేరింది, న్యాయం, ధర్మం, చట్టం, ప్రజాసేవయే పరమార్థం అంటూ తను ఎంత నష్టపోయాడో తెలిసిన క్షణంలో సభ్యసమాజం అతనిని అనుమానించినదానికి సిగ్గుతో తలవంచుకోవాల్సింద!
