"ఈ డిండిమాన్ని పగులగొట్టటానికి ఈ సభికులందరి సమక్షంలో అనుజ్జయయినది" ప్రకటించారు రాయలు. దగ్గువల్లి దుగ్గన్న బ్రహ్మతేజస్సుతో సభను పునీతం చేస్తూ ముందుకు సాగాడు. కంచుఢక్కను సమీపించాడు.
అతని మనసులో వేమాంబరూపు కదలాడింది. కన్నులు విశాలమయ్యాయి. పరశువునెత్తి ఆ సభా మధ్యన అందరు పురప్రముఖులు, పండితుల సమక్షాన కంచుఢక్కను ఒక్క వ్రేటు తగిలించాడు. వెనువెంటనే సైనికుల గొడ్డళ్ళు ఆ కంచుఢక్కమీద వ్రాలాయి. ఆ దెబ్బలకు అది తుత్తునియలై పోయింది. పోతూ అది చేసిన ఆర్తనాదాలకు విజయనగరం ఊగిపోయింది. ముసిలాయన (చంద్రభూషక్రియాశక్తి) మూర్ఛపోయాడు. తెగ చదివానని విర్రవీగుతున్న భట్టుగారి ప్రతాపం ఈ దెబ్బతో బ్రద్దలైపోయింది. గీతా స్పర్శతో మోహవిముక్తుడైన అర్జునునివలె ఆయన భ్రాంతి నుండి విముక్తి పొందాడు. కంటిమీద అహంకారపు పొరలు తెగిపోయాయి. నన్ను ఎదిరించినందువల్ల శ్రీనాధుడు యశోవర్ధను డౌతాడని లోగడ భట్టు అని వున్నాడు. కాని శ్రీనాధునివల్ల ఆయన చిరస్థాయిగా చరిత్రలో స్థానం సంపాదించుకోగలిగాడు.
శ్రీనాధయ్య నిర్లిప్తుడై చింతామణి జపిస్తూ కూర్చున్నాడు. కాండ పూర్తికాగానే ఆయనకు శలవు దొరికింది.
సోమదేవునీ, దుగ్గన్ననూ వెంటపెట్టుకుని కొండవీడుకి అభిముఖంగా ప్రయాణం కట్టాడు. దుగ్గన్న చెవుల్లో కంచు ఢక్క ఢమఢమలు వినిపిస్తున్నాయి.
8
ఇంకా తెల్లవారలేదు. పెఠిల్లు పెఠిల్లుమని ఇప్పటికింకా ఆ శబ్దాలు నా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. దగ్గుపల్లి దుగ్గయ్య రూపం నా కళ్ళముందు కదలాడుతున్నట్లే వుంది. పెఠిల్లు మ్రోత! ఆ శబ్దానికి మేలుకున్నాను. చుట్టూ చీకటి. ఆకాశం మేఘావృతమయింది. మధ్య మధ్య మెరుపులు, ఉరుములు. నేను విన్న శబ్దాలేమిటి? ఉరుములో, కంచుఢక్క బ్రద్దలవుతున్న శబ్దాలో నాకు సరిగా అర్థం కాలేదు.
అయితే ఆ కాంతి ప్రవాహం లేదు. మణిశిల లేదు. నేను మేల్కొన్నానన్నమాట. మరి పెద్దియజ్వ ఏరి? ఎక్కడా ఆయన ఛాయలేదు. అక్కడ నర సంచారమే ఉన్నట్టు లేదు. ఏవో గురగురలూ, గర్జింపులూ వినిపిస్తూ వున్నాయి. అవి కొండవీటి అడవిలోని జంతువులు చేస్తున్న శబ్దాలు.
కొండవీడు చేరిన తరువాత శ్రీనాధయ్య ఏమి చేశాడు? సోమదేవుడు వేమాంబికను పెళ్ళి చేసుకున్నాడా? తిరిగి కళ్ళు మూసుకుని ఆ దృశ్యాలు చూడాలని వ్యర్థ ప్రయత్నం చేశాను. కళ్ళు మూసుకుంటే చీకటి తప్ప మరేమీ కన్పించటంలేదు. ఆ వెలుగు మళ్ళీ ప్రత్యక్షం కాలేదు. దానిని చూడటం నా ప్రయత్నం అయ్యేపని కాదని అర్థమయింది.
లేచాను. దారి మెరుపుల మధ్య చూచాయగా కంపిస్తోంది. నడువసాగాను. అవ్వ జ్ఞాపకానికొచ్చింది.
ఆ ముసిలాయన ఎవరు? ఎక్కడో నార్తులో రాజకీయాల్లో మునిగితేలే మహాశయుడికి కొండవీడు చూడాలని అనిపించింది. ఆయన మాటలు చాలా అర్ధవంతంగా ఉన్నాయి. మొత్తంమీద ఆయన వేదాంతానికి, పరధ్యానానికి వెనుక ఆసక్తి దాయకమయిన కథ ఏదో వుండి వుండాలి అనిపించింది. తెలుసుకోవాలి.
కొంతదూరం నడిచాక తూర్పు తెల్లవారుతున్నదనిపించింది. అలవాటుచొప్పున నడుస్తున్నాను.
బంగళాకు చేరేసరికి బాగా తెల్లవారింది. చెట్టుక్రింద అవ్వ మునగ తీసుకుని వుంది. ఏవో జ్ఞాపకాలను నెమరువేస్తోంది కాబోలు. కళ్ళు అర్ధనిమీలితాలై వున్నాయి. చుట్టుప్రక్కల వినిపించే చిన్ని చిన్ని శబ్దాలు ఆమె గుర్తిస్తున్నట్లుగా లేదు.
"డాడీ! ఈ చలిలో మీరెందుకు? లోపలకు రండి" అంటున్నాడా యువకుడు. ముసలాయన అతడి మాటల్ని కాతరు చేయలేదు. ఆలోచనా సముద్రంలో మునిగిపోయి వున్నాడు. అవతల అవ్వ, ఇక్కడీయన. చిత్రమే.
"వచ్చావా నా తండ్రీ! రాత్రంతా ఏ దయ్యాల్తో తిరిగొచ్చావు?" పలకరించాడు కవి. చిన్నగా నవ్వాను.
"నవ్వుల పువ్వులు నాలుగు మా మొహాన విదిలించి హీరోలాగా తిరుగుతున్నావు. ఈరోజు నిన్ను వదిలేదిలేదు. పద పోదాం." కవిగారి పురమాయింపు.
"తిరోగమనానికి తొందర పాటెందుకు? అది నీకెలాగూ నిత్య కవిత్వమేననుకో!" వెక్కిరించాడు రమణ.
