"ఓ అభాగ్యురాలు. పేరు మాయ." వీరేష్ ఆమెను అందరికీ పరిచయం చేశాడు.
మాయ విధిగా అందరికీ నమస్కారం పెట్టింది.
"మీ అర్ధాంగి ఎప్పుడు పోయింది సార్!" అనూష వేసిన ప్రశ్నకు క్షణం ఆలోచనలో పడ్డాడు వీరేష్.
"సారీ! మీ వ్యక్తిగత విషయాలను గుర్తుచేసి మిమ్మల్ని బాధపెట్టినట్టున్నాము!" అంది బిందుమాధవి సానుభూతి స్వరంతో.
"అదేం లేదు మేడమ్! అయినా అది ఇప్పటి విషాద గాధ కాదు. ఒక రోజు బాధతో మరిచిపోయేదీ కాదు. రాతి గుండె నాది. నేను దేనికీ బాధపడే ఘటాన్ని కాదు. ముందు టీ తీసుకోండి, చల్లారిపోతున్నది!" అన్నాడు.
అందరూ టీ తీసుకున్నారు.
మాయ ఖాళీ కప్పులను టీపాయ్ మీద నుంచి తీసేసింది.
"మాయా! టైమ్ అవుతున్నది. వెళ్ళి తొందరగా స్టేషన్ లో సంతకం పెట్టి, రా!" అన్నాడు గుర్తుచేస్తూ వీరేష్.
"అదేమిటి అంకుల్! పోలీస్ స్టేషన్ లో ఆడపిల్ల సంతకం పెట్టడమేమిటి?" వింతగా తోచి అడిగింది సాహితి.
"అదా!" అంటూ ఓసారి మాయకేసి చూశాడు.
మాయ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కళ్ళు తుడుచుకుని వడివడిగా బయటకు వెళ్ళిపోయింది.
"మాయ ఒక అమాయకురాలు. ఒక దుర్మార్గుని వలలో పడింది. అతను ఈమెను మోసం చేసి ఇంకో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. మాయ ఆత్మహత్య చేసుకోబోయింది. కాని, ఆమెను రక్షించారు. అతను చేసిన మోసానికి ప్రతీకారం చేయాలనుకుంది మాయ. ఒక రోజున అతన్ని హత్య చేసింది.
"ఆమెను అరెస్టు చేశాము. ఆత్మహత్య చేసుకోబోయింది. నేను కాపాడాను. కండిషన్ బెయిల్ మీద విడుదల చేయించాను. అందుకే ప్రతిరోజూ మాయ ఈ వేళకు స్టేషన్ లో సంతకం పెట్టి రావాలి" చెప్పి నిట్టూర్చాడు.
"మాయ హత్య చేసిందా! నిజంగానా? బెయిల్ మీద మీరే విడిపించారా!" ఆశ్చర్యం, అనుమానం మిళితమయ్యాయి అనూష మాటలలో.
నిజమేనన్నట్టు వీరేష్ తల ఊపాడు.
"సెభాష్! మాయ చాలా ధైర్యం చేసింది. అలాంటి స్వార్ధపరునికి చక్కని శిక్ష వేసింది" అంది కసిగా బిందుమాధవి.
అనూష, సాహితి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
"జీవితంలో అన్నీ పోగొట్టుకున్న మీరు ఎలా ఒంటరిగా ఉండగలుగుతున్నారు?" జాలిగా అడిగింది అనూష.
"మీది చిన్న వయసేగా! మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చుగా. ఎందుకు చేసుకోలేదు?" సాహితి తన సందేహాన్ని వెలిబుచ్చింది.
"నా భార్య ఇక్కడే ఉండగా నాకు మళ్ళీ పెళ్ళా?" వేదాంత ధోరణిలో అన్నాడు వీరేష్.
"ఏమిటీ! మీ శ్రీమతి ఇక్కడే ఉన్నారా?" ముగ్గురూ ఆశ్చర్యపోతూ ఒకేసారి అడిగారు.
వీరేష్ నవ్వుతూ గోడ వైపు చేయి చూపాడు. ఎదురుగా గోడకు వేలాడుతున్న ఒక ఆడ మనిషి ఫోటోకు పూల దండ వేసి వుంది.
"బాగుంది! అలా అని మీరు సంతృప్తి పడితే సరిపోతుందా? ఒంటరిగా ఎన్నాళ్ళుంటారు?" సూటిగా అడిగింది బిందుమాధవి.
"ఆమె రూపం నా హృదయంలోనే వుంది మేడమ్! ఆమెను మరచిపోలేకపోతున్నాను. ఇహ, నా జీవితంలోకి వేరొకరిని ఎలా ఆహ్వానించమంటారు?" అన్నాడు ముఖం పక్కకు తిప్పుకుని, కళ్ళు తుడుచుకుంటూ.
"సారీ ఇన్ స్పెక్టర్! నేను చనువు తీసుకుని అన్నాను" బిందుమాధవి నొచ్చుకుంటూ అంది.
"లేదు మేడమ్! మీకు మా ప్రేమ గురించి తెలియకే ఆ సలహా ఇచ్చారు. తెలిసివుంటే అలా సలహా ఇచ్చేవారు కాదు."
"మళ్ళీ పాత జీవితాన్ని గుర్తుచేసి బాధపెడుతున్నామేమో!" అంది అనుమానంగా.
"ఫరవాలేదు మేడమ్! ఆ బాధలో కూడా ఆనందం ఉంది."
ముగ్గురూ వీరేష్ గురించే ఆలోచిస్తున్నారు.
"నేను చదువుకునే రోజుల్లో సుందరిని ప్రేమించాను. నా చదువు పూర్తయింది. తరువాత పోలీసాఫీసరుగా సెలెక్టయ్యాను. ట్రైనింగ్ ఆర్డర్స్ వచ్చాయి. సుందరి నన్ను చూడందే ఒక్క క్షణం కూడా ఉండలేనంది. నాకు ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధం చూసి పెళ్లి ఖాయం చేశారని చెప్పాను. ట్రైనింగ్ పూర్తి అవగానే ఆ సంబంధమే చేసుకోవాలి, నన్ను మరచిపోమని చెప్పాను. ఆ అదృష్టవంతురాలెవరో చెప్పమంది. ఫోటో చూపిస్తానన్నాను. ఈలోగా నాకోసం స్నేహితులు రావడంతో సుందరి వెళ్ళిపోయింది" చెప్పడం ఆపి, వాళ్ళవైపు చూశాడు.
బేతాళ కథ వింటున్నట్టు "తరువాత ఏం జరిగిందో చెప్పండి అంకుల్!" అంది కుతూహలంగా సాహితి.
"ఆ వెళ్ళిపోవడం సుందరి తిరిగిరాలేదు. ఆత్మహత్య చేసుకుందని కొందరన్నారు. వాళ్ళవాళ్ళు ఆమెను దూరంగా తీసుకువెళ్ళి వేరే సంబంధం చూసి పెళ్ళి చేసి ఉంటారని మరికొందరన్నారు. సుందరి మరొకరిని పెళ్ళి చేసుకోదని నా మనసుకు తెలుసు. సుందరి బతికివుంటే నన్ను చూడకుండా క్షణమైనా ఉండలేదనీ తెలుసు. సుందరికి నేను అన్యాయం చేశాను. అవునా?"
"మగవాళ్ళ ప్రేమ ఎప్పుడూ స్వార్థంతో కూడుకున్నదే. మగవాళ్ళెప్పుడూ అవకాశావ్వాదులే!" అంది సాహితి ఆవేశంగా.
వీరేష్ దోషిలా తలవంచుకున్నాడు.
"సారీ ఇన్ స్పెక్టర్! సాహితి ఏదో తెలిసీ తెలియక అంది. మీరు మనసు కష్టపెట్టుకోవద్దు." అతను నొచ్చుకున్నాడని అంది బిందుమాధవి.
"మీరు సుందరికి చూపిస్తానన్న అమ్మాయిని పెళ్ళి చేసుకోలేదా?" అనూష అనుమానంగా అడిగింది.
"అడగవలసిన ప్రశ్నే అడిగారు. అసలు ఆ ప్రశ్న అడుగుతారో లేదోననుకున్నాను. మీ మెదడు చురుగ్గానే పనిచేస్తున్నది!" నవ్వుతూ ప్రశంసగా అన్నాడు.
"చెప్పండి అంకుల్! సస్పెన్స్ తో చంపవద్దు" అంది సాహితి ఆత్రుతగా.
"చెబుతానమ్మా! నేను సుందరికి చూపిస్తానన్న ఫోటో ఎవరిదంటే...." క్షణం ఆగాడు.
అంతా అతని సమాధానం కోసం చూశారు.
"నేను చూపిస్తానన్న ఫోటో ఎవరిదో కాదు, సుందరిదే! ఆరోజే నిశ్చితార్థం పెట్టుకుందామనుకున్నాము. సుందరిని, వాళ్ళ వాళ్ళను ఆశ్చర్యపరుద్దామని అప్పటివరకు వాళ్ళకు విషయం తెలియనివ్వలేదు. పై పెచ్చు సుందరితో అబద్ధం చెప్పాను. ఈలోగా ఈ ఘోరం జరిగిపోయింది" చెప్పడం ఆపి జేబురుమాలుతో కళ్ళు తుడుచుకున్నాడు.
