Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 32

మగవాళ్ళ సంభాషణ ఇలా వుంటే, ఆడవాళ్ళ మాటలు మరొక రకంగా సాగుతున్నాయి.
"సంవత్సరం పాటు చీటీలు కట్టి మొన్ననే ఈ గాజులు జత చేయించుకున్నాను. ఆ దొంగ వెధవలు ఎక్కడ ఇమ్మంటారో అని, నా గుండెలు పింజాం పింజాం అంటూనే వున్నాయి అంది ఒకామె చేతికి వున్న క్రొత్తగాజుల తళతళలను చూస్తూ.
"నువ్వొక గాజుల జతకి అలా అంటున్నావు. నా వంటిమీద ఇరవై కాసుల బంగారం వుంది. వాళ్ళు దోచుకుంటే నాపని ఏమయ్యేది?"
"వాళ్ళు దొంగలు అయివుండరు."
"మరి ఎవరంటావ్?"
"అది నాకెలా తెలుస్తుంది? దొంగలు పడ్డ ఇల్లు ఆముదం త్రాగిన కడుపూ ఖాళీ కావల్సిందేనని, మా బామ్మ బ్రతికి వున్న రోజుల్లో తరచూ అంటూ వుండేది."
ఇలా సాగుతున్నాయి ఆడవాళ్ళ కబుర్లు.
జరిగింది ఏమిటో ఎవరికీ అర్థంకాక పోయినా, రోడ్డుకి అడ్డంగా వున్న బస్సులో ఏముందో చూద్దామని కొందరు ఆ బస్సుకేసి నడిచారు.
రెండు నిమిషాల తరువాత ఆ ప్రదేశమంతా రణగొణ ధ్వని, రాళ్ళ వానగా తయారయ్యింది.
ఇప్పుడు బస్సులో వెళ్ళిపోయిన దుండగులు చంపి వుంటారు. ఆగివున్న బస్సులో తొమ్మిది మంది మగవాళ్ళూ, ఇద్దరు ఆడవాళ్ళు చెదురు మొదురుగా బస్సులో పడి చనిపోయి వున్నారు. కొందరు సీట్లలోనే ఒరిగిపోయి వున్నారు. బస్సు రక్త ప్రవాహంతో తడిసిపోయి వుంది. రివాల్వర్ కాల్పులు, కత్తిపోట్లు బలమైన గాయాలతో మరణించి వున్నారు.
అది చూసి అందరూ అవాక్కయి నిలుచుండిపోయారు.
అందరి మనస్సులో ఒకటే ప్రశ్న ఉదయిస్తున్నది.
"ఈ బస్సులోని అందరినీ చంపేసిన దుండగులు తాము వచ్చిన బస్సులోని డ్రైవర్ ని తప్ప, ఎవరినీ చంపకపోవటానికి కారణం ఏమిటి?"

                                        14

అక్కడ వున్న అందరూ చాలా విషమ పరిస్థితిలో పడ్డారు. దరిదాపులో వూరులేదు. రోడ్డున పడి వెనక్కో ముందుకో "మనం ఇక్కడ వుంటే మనమీదికి కేసు వస్తుంది. ఒకటా, రెండా, సరిగ్గా పన్నెండు మంది ఘోరంగా హత్య చెయ్యబడి వున్నారు." ప్రతి చిన్న విషయానికీ భయపడే ఒకాయన అన్నాడు.
"ఎవరో ఎవర్నో చంపితే మనమీదికి ఎందుకు వస్తుంది! అంతా మీ భయం ఊరుకోండి!" అన్నాడు ఇంకో ఆయన.
మనమీదికి వస్తుందీ అంటే మన హత్య చెయ్యాలనే లేదు, పోలీసులు కోర్టులూ సాక్ష్యాలు, వాటిని తప్పించుకోలేము కదా!" నీరసపడిపోతూ అన్నాడు ఆయన.
ఆయన చాలాసార్లు చాలా విషయాల్లో, కోర్టుకి ఎక్కి వున్నాడు. ఆయన జన్మ అంతా కోర్టుల చుట్టూ తిరగటం, సాక్ష్యాలు చెప్పటం. ఇప్పుడు కూడా అర్జెంట్ గా కోర్టు పని మీదనే వూరువెడుతూ ఇక్కడ దిగిబడిపోయాడు. ఆయన భయం ఆయనది. మళ్ళీ కోర్టూ, సాక్ష్యాలు, పోలీసులు.
"మనం అంతా మారు మాట్లాడకుండా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతామనుకో ఆ తరువాత పోలీసులకి తెలిస్తే అది ఇంకా పెద్ద నేరమవుతుంది కదా!"
"నిజమేనండోయ్ నాకు ఆ ఆలోచనే రాలేదు సుమా"
అప్పుడు పెదవి విప్పాడు పుండరీకాక్షయ్య.
"పోలీసు వాళ్లకి కబురు వెళ్ళి వాళ్ళు వచ్చేదాకా మనకీ రోడ్డు మీద నరకం తప్పదన్న మాట. ఇలా ఎంతసేపు?" అఅప్పుడు తట్టింది అక్కడున్న అందరికీ ఒకే మాట.
"ఇక్కడ దారుణం జరిగినట్లు ఈ వార్త పోలీసుల ఎవరు చేరవేస్తారు?"
"ఎవరో ఒకరు నడిచి ముందుకో వెనక్కో వెళ్ళాలి. అప్పుడీ ఘోరం సంగతి ఎవరికైనా తెలియపరచ వచ్చు. అప్పుడు వాళ్ళు, ఈ వార్త మోసుకెళ్ళిన వాడూ, ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. ఇదంతా జరిగే సరికి, ఎంత సమయం పడుతుందో ఎవరికీ తెలియదు. ఆ తరువాత బోల్డు తతంగం వుంది. అప్పుడు ఎవరి ఇళ్ళకు వాళ్ళు... ... ..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS