కాలక్షేపం కోసం ఉద్యోగం చేస్తున్న సావిత్రిని అలాగే వుంచి తననే ఊస్ట్ చెయ్యాలా? తనే సావిత్రి పరిస్థితిలో వుండి వుంటే? తనలాంటి అమ్మాయి ఉద్యోగం కోసం రాజీనామా ఇచ్చి వుండేది.
దేవుడు కూడా దురదృష్టవంతుల ప్రార్థనలు వినిపించుకోడు. ఈ ఉద్యోగం నిలబెట్టమని ఎంతమంది దేవుళ్ళకు మొక్కుకుంది? అసలు ఆ దేవుడు వున్నాడా?
"న్యాయం ధర్మం అంటూ వుంటారు?
ఆ ధర్మదేవత మాటేమిటి?
తనలాంటి వారి కన్నీళ్ళూ, రక్త మాంసాలూ - ఆ దేవతకు ఇష్టమా? ఇంకా ఆ దేవత అనాగరికంగానే ఉందా!
ఇరవై ఏళ్ళయినా నిండీ నిండని తను ఎం పాపం చేసింది? గుమస్తా ఉద్యోగం చేస్తూ ఏదో విధంగా కుటుంబాన్ని బ్రతికిస్తుందే!
నాన్న నాలుగు కాలాలపాటు ఎందుకు బ్రతికి ఉండకూడదు. అవినీతి, అన్యాయం అంటే ఆమడ దూరంగా వుండే నాన్నకు అకస్మాత్తుగా ఆ గుండె జబ్బు ఎందుకు రావాలి? ఆనాటి నుంచి రోగిష్టి తల్లీ, పదేళ్ళ తమ్ముడి బాధ్యతలు తన నెత్తి మీద పడినై. టైపిస్టుగా చేస్తూ సమత్సరం అంతా ఎలాగో కుటుంబాన్ని లాక్కొచ్చింది.
మళ్ళీ ఎంత మంది చుట్టూ తిరిగితే ఎన్నాళ్ళకు ఉద్యోగం దొరుకుతుందో? అంత వరకూ ...
జానకి మనసు అంతూ పొంతూ లేని ఆలోచనలతో గిజగిజ లాడిపోతూ వుంది. బస్సులు వస్తున్నాయ్. కాని ఒక్కటీ ఆగటం లేదు.
కొందరు మగవాళ్ళు బస్ తోపాటు పరిగెత్తి అందుకుంటున్నారు. కొందరు మళ్ళీ వెనక్కు వచ్చి రొప్పుతూ నిల్చుంటున్నారు.
క్రమక్రమంగా గండు చీమల పుట్ట పగిలినట్టు జనం కూడుతున్నారు.
జానకి ఆ జనాన్ని చూసి బెదిరిపోతూ, పక్కనే నిల్చుని వున్న యువతిని టైం అడిగింది.
"ఏడున్నర!"
"తను అక్కడికి వొచ్చి గంటన్నర అయింది. నిలబడే శక్తి లేనట్టు అనిపిస్తూ వుంది.
తనలోని జీవశక్తిని పాదాల ద్వారా భూదేవి లాగేస్తున్నట్టు అనిపిస్తూ వుంది.
ఒక బస్ వచ్చి ఆగింది. అది జానకి ఎక్కవలసిన బస్ కాదు.
తనంత వరకూ సరిగా చూడలేదు. కాని తన బస్ ఒకటి కంటే ఎక్కువ పోయి వుండదు. పేరుకు నూట నలభై నాలుగు నంబరు బస్ నలభై నిముషాలకు ఒకటని, కాని గంటకు తక్కువ కాలంలో తనకు ఆ బస్ ఏనాడూ దొరకలేదు. హైదరాబాద్ లో అన్ని బస్ లు ఒక ఎత్తు. ఈ నూట నలభై నాలుగో నంబరు బస్ ఒక ఎత్తు. అన్ని వేళలా జనంతో కిటకిట లాడుతూ వుంటుంది. రాణీగంజి నుంచి బజార్ ఘాట్ మీదగా నాంపల్లి వెళుతుంది.
తొక్కిసలాడుతూ జనంతో బస్ వచ్చి ఆగింది. జానకి కొందరు మగవాళ్ళను తోసుకుంటూ వెళ్ళి ఫుట్ బోర్డు మీద కాలు పెట్టడానికి ప్రయత్నించింది.
ఎవరో ఆమెను వెనక్కు నెట్టేసి బస్ ఎక్కారు. బస్ ముందుకు కదిలింది. వెనక్కి పడబోయిన జానకి నిలదొక్కుకుంది.
"ఇంత రద్దీలో మగవాళ్ళను తోసుకుంటూ పోయి ఆడవాళ్ళు బస్ ఎక్కాలని ప్రయత్నించడం ఎందుకో!" ఈసడింపుగా అన్నారు ఎవరో!
వీపు మీద చెళ్ళున చరచినట్టయి జానకి వెనక్కు తిరిగి చూసింది.
ఓ పొడుగాటి యువకుడు చేతిలో రెండు మూడు రకాల వార పత్రికలు మడిచిపట్టుకొని నిల్చుని వున్నాడు. మనిషిలో నాగరికత కంటే నాజూకుతనం ఎక్కువగా కన్పిస్తూ వుంది.
దెబ్బ తగిలిన కంటికి చల్లగాలి కూడా కంటికి బాధాకరంగానే వుంటుంది.
జానకి మనసు భగ్గుమంది.
"ఇంత పొద్దుపోయి ఒక స్త్రీ తమ కళ్ళఎదుటే రెండు గంటలనుంచీ నిల్చోవడం చూసి కూడా, వెనక్కు నెట్టేసి ఎక్కిన మీ మగవాళ్ళకు చెప్పండి బుద్ధి" విసురుగా అన్నది జానకి.
"అందర్నీ కలిపి తిడతారేం?" అన్నాడు ఆ యువకుడు రోషంగా!
