Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 32


    "చాలా కరెక్టుగా చెప్పానుసార్! ముందు ఎనిమిది వస్తుంది. చివర ఎనిమిది వస్తుంది. కావాలంటే ఎవరినన్నా అడిగి చూడండి" అన్నాను.


    "ఎవర్నో అడగడం ఎందుకోయ్! ఆ మాత్రం నాకు తెలీదా! కాకపోతే మిమ్మల్ని పరీక్ష చెయ్యటానికి అడిగాను అంతే" అని అంతలోనే సీరియస్ గా ముఖంపెట్టి "అంటే మా అమ్మ ఎనిమిదివేల తొమ్మిది వందల ఇరవైఎనిమిది అబద్ధాలు ఆడిందన్నమాట! అంతేకదా నీ మాటలకి అర్థం."


    వాళ్ళమ్మ అన్ని అబద్ధాలు ఆడటానికి నేను చెప్పిన దానికీ సంబంధం ఏమిటో నాకు పూర్తిగా అర్థమయ్యేలోపలే_


    "మా అమ్మకి ఎనిమిదిమంది ఆడపిల్లలు, వోన్లీవన్ మగ నలుసు. వాడెవడో తెలుసా? ది గ్రేట్ ఇన్ స్పెక్టర్ వర్ధనరావు. అంటే నేనే. నీవు చెప్పిన మాటలను బట్టి మా అమ్మ అన్ని అబద్ధాలు ఆడిందని అనుకోవాలా? అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి? మహా-చూసొచ్చినట్లుగా అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని చెబుతావా? పైగా ఒక అబద్ధం కాదు, రెండు అబద్ధాలు కాదు, ఒక్కొక్క ఆడపిల్లకి వెయ్యినూటపదహారు అబద్ధాలా? మా అమ్మని అబద్ధాల కోరు చెయ్యటంలో నీ ఉద్దేశ్యం ఏమిటి?" నన్నే తీక్షణంగా చూస్తూ అడిగాడు వర్ధనరావు.


    విషయం అర్థమయ్యేసరికి నా బుర్ర గిర్రున తిరగటం ఆవెంటనే పాదరసంలా పని చెయ్యటమూ జరిగింది.


    'మీ అమ్మగారు పూర్వ జన్మలో దేవతసార్!' వినయంగా అన్నాను.


    "ఇందాకేమో మా అమ్మని అబద్ధాలకోరు అన్నావు! ఇప్పుడేమో దేవత అంటున్నావు! తింగిరి మాటలు మాట్లాడావూ అంటే నా చేతిలో మక్కెలు విరిగిపోతాయి. ఆ తరువాత మక్కు పెట్టినా అతుక్కోవు జాగ్రత్త!"


    "అదికాదు సార్! నేను చెప్పేది జాగ్రత్తగా వినండి! అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు అంతవరకూ కరెక్టు సార్! అయితే ఆ మాట ఒకళ్ళో ఇద్దరో పుట్టిన ఆడపిల్లల తల్లులికి, పదిమంది ఆడపిల్లలు పుట్టిన తల్లులకీ వర్తిస్తుంది గానీ, మీ అమ్మగారికి వర్తించదు. దీంట్లో కూడా ఒక పాయింటు వుంది. ఎనిమిదిమంది ఆడపిల్లలు పుడితే ఈ మాట వర్తించదు. ఎనిమిది ఆడపిల్లల్ని కనటం పూర్వజన్మ సుకృతం సార్! ఆ మహాతల్లి క్రితం జన్మలో నియమ నిష్టగా అష్టలక్ష్మీపూజ అతి పవిత్రంగా చేయటంవల్ల ఈ జన్మలో అష్టలక్ష్ములు ఆవిడ కడుపున పుట్టారన్న మాట మీ అమ్మగారు దేవతసార్! దేవత!'


    'అయితే దీంట్లో ఇంత కథుందన్నమాట! ముందే ఆ సంగతి చెప్పొచ్చుకదా!' సంతోష పడిపోయి అన్నాడు వర్ధనరావు.


    'ఎలా చెబుతాను సార్! మీ అమ్మగారు అష్టలక్ష్ములకి జన్మ ఇచ్చారని. నాకేమన్నా తెలుసా పాడా? అదయినా మీరు ఇప్పుడు చెప్పబట్టి తెలిసింది. అష్టలక్ష్ములనేగాక మీలాంటి తెలివిగలవారిని కన్న ఆమె నిజంగా దేవతే సార్! నా మాటలో ఏమన్నా సందేహం వుందాసార్!'


    నా మాటల్లో సందేహం వుందని ఒప్పుకున్నట్లయితే ఆయన ఇరకాటంలో పడ్డట్లవుతుంది. ఆ మాత్రం ఆలోచనా శక్తి వుండబట్టే 'ఎబ్బే ఎంతమాత్రం సందేహంలేదు. నాకొక కొత్త సత్యాన్ని వినిపించావు! ఎప్పుడో నా పసితనంలో విన్నట్లే గుర్తు. కాకపోతే ఇప్పుడు నువ్వు అన్న తరువాత గుర్తుకు వచ్చింది. అవునూ! అష్టలక్ష్ముల తరువాత నేను పుట్టాను. ఇక్కడ పుడితే వాడిని ఏమంటారోయ్?'


    ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు చూద్దాం! అన్నట్లుగా కిసుక్కున నవ్వాడు అహోబిలం.


    'ఏమొచ్చిందని నవ్వావ్? ఎందుకు నవ్వావ్?' అతని వేపు కోపంగా చూస్తూ అడిగాడు వర్ధనరావు.


    'నవ్వు వచ్చిందిసార్' తల వంచుకుని చెప్పాడు అహోబిలం.


    'వస్తుందయ్యా వస్తుంది! ఇది పోలీస్ స్టేషన్. నవ్వువస్తే నవ్వటానికి, ఏడుపు వస్తే ఏడవడానికి కాదు. స్ట్రిక్ట్ గా ఉండాలి. వచ్చిందికదా అని నవ్వేయటమే వూ...నీతో మాట్లాడటం టైమ్ వేస్టు' అని ఆ తరువాత నా వేపుకి తిరిగి 'వూ...నా ప్రశ్నకి సమాధానం చెప్పు!' అన్నాడు గాంభీర్యంగా వర్ధనరావు.


    'ఇద్దరు అయితే లవకుశులు సార్! ముగ్గురయితే త్రిమూర్తులు సార్! నలుగురు అయితే రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు సార్! ఐదుగురు అయితే పంచపాండవులూనూ, నూరుగురు ఐతే కౌరవులు సార్!'


    నా మాటలకి అడ్డువచ్చి 'నేను అడిగింది ఒక్కడిని గురించి, ఇంతమంది గురించి చెబుతావేమిటి? ఆన్సర్ టు ది పాయింట్!' అన్నాడు.


    "తప్పయిపోయింది సార్! ఒక్కడ్ని కనుక అయితే, ఏకో నారాయణా అంటారు. అష్టలక్ష్ముల తరువాత పుట్టారు కదా సార్! అష్టా అంటే ఏమిటి? ఎనిమిది. ఎనిమిది తర్వాత ఏమిటి? తొమ్మిది. ఎనిమిది తరువాత పుట్టిన మీరు నవనారాయణుడు సార్! నవనారాయణుడికి మరో పేరు కూడా నరనారాయణ అని పురాణాలు చెప్పే ఒకాయన చెప్పాడు సార్!" చాలా వినయంగా పలికాను.


    నేను చెప్పింది వినంగానే ఇన్ స్పెక్టర్ వర్ధనరావు ముఖం అప్పుడే విచ్చుకున్న అరటాకంతయింది. చాలా ప్రసన్న వదనంతో "ఈ రోజు చాలా మంచి విషయాలు చెప్పావోయ్!" అని అహోబిలం వేపుకి తిరిగి,


    "వీళ్ళిద్దరినీ తీసుకువెళ్ళి తిరిగి సెల్ లో పడేయ్!" అంటూ ఆర్డర్ వేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS