Previous Page Next Page 
అగ్నిశ్వాస పేజి 32


    అవినాశ్ విశాలమైన వక్షంపై తూటాల నెదుర్కొని ధైర్యంగా నిలబడిన సాక్ష్యంగా ఎన్నో గుర్తులు... మచ్చలు.


    "ఇది నాకు కళంకం తెచ్చే మచ్చలు కావు శశాంకా. నా విద్యుక్తధర్మ నిర్వహణలో నేను మనసునీ, శరీరాన్నీ ఎంత నిష్కళంకంగా ఒడ్డి పోరాడుతానో నేను బ్రతికున్నంత కాలం నాకు నేనైనా గర్వించే గుర్తులివి..." ఇవి చాలు నన్ను ఉత్సాహపరచడానికి... ఏ ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్సూ ఇవ్వనంత సంతృప్తిని, ఊపుని ఈ మచ్చలే నాకిచ్చి ముందుకు నెడుతుంటాయి... ఇది మీకు స్వోత్కర్షగా కనిపించినా నాకు అభ్యంతరం లేదు... అసలింత లోతుగా వెళ్ళింది ఒక అన్నగా మీలో కొద్దిపాటి చైతన్యాన్ని తీసుకురావాలని..." తదేకంగా చూస్తూ వుండిపోయిన శశాంక వెంటనే జవాబు చెప్పలేదు.


    కాని...


    ఇంత నిజాయితీపరుడైన పోలీసాఫీసరు ఎన్నాళ్ళు ఈ సిటీలో వుంటాడా అని ఆలోచిస్తున్నాను.


    "వెల్ మిస్టర్ శశాంక... నేను వచ్చిన పని ఎంతవరకూ నెరవేరిందీ తెలీని స్థితిలో వెళ్తున్నాను... హేవ్ సెకండ్ థాట్. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్..."


    అవినాశ్ వెళ్ళిపోయాడు.


                                                      *    *    *    *


    అర్ధరాత్రి గడుస్తూంది.


    అసహనంగా బెడ్ పై అటూ ఇటూ పొర్లుతున్నాడు శశాంక. ఏ స్వార్థమూ లేకుండా ఒక పోలీసు ఉన్నతాధికారి అయ్యుండీ స్వయంగా ఇంటికి వచ్చి నచ్చచెప్పి వెళ్ళిన అవినాశ్ మాటలు పదేపదే గుర్తుకొస్తుంటే హఠాత్తుగా ఓ ప్రశ్న అతడి ముందు నిలిచింది...


    అది అణువుగా అంకురించి అరక్షణంలో అనంతంగా వ్యాపించి నిలదీసింది.


    ధనుష్కోటి కథ ముగిసిపోయింది.


    అతడే తన ముఖ్య ప్రత్యర్థి అయితే ఆ ప్రత్యర్థి ఇకలేడు...ఇప్పుడు తన కర్తవ్య మేమిటి...


    ఏదో చేయాలి.


    ఏం చేస్తూ బ్రతకాలి.


    చిక్కుముడుల్లా ప్రశ్నలు అతడ్ని నిలదీస్తుంటే అప్పుడు వినిపించింది.


    తలుపుల్ని దబదబా బాదుతున్నారెవరో...


    సంశయంగా ఆగేడో క్షణం.


    ఇంకా చప్పుడు వినిపిస్తూనే వుంది.


    ఇలాంటి అపరాత్రివేళ ఈ అనుకోని సంఘటన్ని అతడు మామూలుగా తీసుకోలేదు...


    ఏదో అనుమానం.


    చేతులకి గ్లన్స్ తొడుక్కుని లాల్చీ పైజమాలతోనే వేగంగా క్రిందికి నడిచి ద్వారం తెరిచాడు.


    వయసులోవున్న ఓ అమ్మాయి దూకుడుగా లోపలికి ప్రవేశించింది.


    భయంతో రొప్పుతూ సోఫాలో చతికిలబడి, "ప్లీజ్ తలుపేసేయండి... వాళ్ళు నన్ను తరుముతున్నారు" అంది కంగారుపడుతూనే.


    ద్వారం మూసేయలేదు శశాంక.


    ప్రహరీదాకా నడిచాడు.


    దూరంగా వీథి లైట్ల కాంతిలో ఆగివున్న ఓ జీపు శశాంకని చూడగానే వేగంగా రివర్సు చేయబడింది.


    సాలోచనగా వెనక్కి వచ్చాడు.


    సుమారు ఇరవై, ఇరవై అయిదేళ్ళ వయసుండే ఆ యువతి ఇంకా వణికిపోతూనే వుంది.


    ఆ తొట్రుపాటులో తొలగిన పైటనిగాని, ఆయాసంతో ఎగిరిపడుతున్న వక్షాన్నిగాని ఆమె గుర్తించలేదు.


    తృటిలో దృష్టి మరల్చి, 'భయపడకండి. వెళ్ళిపోయారు...' అన్నాడు బయటికి చూస్తూ. "మీ కభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే పడుకోవచ్చు."


    "లేదు__ ఇంటికెళ్ళిపోవాలి" భీతహరిణేక్షిలా కళ్ళను కదిలిస్తూ "ప్లీజ్... మీకు వీలైతే నన్ను డ్రాప్ చేస్తారా" అంది.


    "మీ ఇష్టం" భుజాలు డ్రాప్ చేస్తూ బయటికి వచ్చాడు.


    మరో అయిదు నిమిషాలలో మారుతీ సిటీలో అడుగుపెట్టింది.


    కారును అలవోకగా డ్రైవ్ చేస్తూ పక్కనే ఒదిగి వున్న ఆమెను క్షణంపాటు చూశాడు. "ఇంత రాత్రివేళ బయటికెందుకొచ్చారు."


    "సెకండ్ షో పిక్చరు కెళ్ళాను."


    ఉలికిపడిన శశాంక, "ఒంటరిగానా" అన్నాడు.


    "అవును... ఇవాళ ఆఖరి రోజు. చిరంజీవి పిక్చరు. అందుకని..." ఆమె తప్పుచేసినట్టు గిల్టీగా గొణుగుతుంటే నవ్వకుండా వుండలేకపోయాడు.


    "చూడండి మిస్... మీ సాహసానికి అభినందించాలో, లేక సినిమా చూడడానికి ఇంత పిచ్చిగా అర్థరాత్రి ఇల్లు దాటిన మిమ్మల్ని తిట్టాలో నాకు బోధపడడం లేదు. గాంధీ గారంటే మీకు చాలా ఇష్టమా..."


    ఈ ప్రశ్నకి బిత్తరపోయి చూసిందామె. "ఏం."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS