అవంతి నిట్టూర్చింది. ఆ నిట్టూర్పుతోనే ఎన్నో ఆలోచనలు మళ్ళీ....... అవంతి మంచంపైన వెనక్కి వాలిపోయింది. ఆమెకళ్ళు వెలుగుతోన్న దీపంకేసి చూస్తున్నాయి.
19
మర్నాడు ఉదయం కుసుమ, శ్యామలా వచ్చారు.
కుసుమ నిర్లిప్తంగా మంచంపైన వాలిపోయి శూన్యంలోకి చూస్తుంది. ఆమె కళ్ళు తడబడుతున్నాయి.
అవంతి జాలిగా చూసింది కుసుమకేసి. శ్యామలని అడిగింది రమణి.
"ఎలా జరిగిందట?"
శ్యామల ఓసారి కుసుమకేసి చూసింది. ఆమె మూగగా రోదిస్తోంది.
"సరోజినీ ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా ఉత్తరం రాసిపెట్టింది"
అవంతి ఉలిక్కిపడి లేచింది.
"నేను నమ్మను" అంది.
"నీ నమ్మకంతో ఎవరికి పనుంది ఆ ఉత్తరాన్ని చూసి పోలీసులు కూడా ఆత్మహత్య కేసుగానే రిజిష్టర్ చేసుకున్నారు?"
"అసలేం జరిగిందో చెప్పు?"
"ఆ రోజు సాయంత్రం నాలుగ్గంటలకట. గుప్పుమని కిరోసిన్ వాసనొస్తే ఆ ఇంటిముందు కూరలమ్మే మనిషికి అదేమిటో అర్థంకాలేదట. అంతలే కేకలు వినబడి ఆ ఇంట్లోకి పరుగెత్తేడట. కానీ సరోజినీ ఆడబడుచు, అత్తవాడ్ని లోపలికి రానీకుండా బయటకి నెట్టేశారట"
అవంతి భృకుటి ముడి పడింది.
"ఆ పొరుగువాళ్ళందరు కూడా అనుకొంటుంటే విన్నాను. సరోజిని వాళ్ళు బాగా సాధించేవారట. మొగుడు, అత్త, ఆడబిడ్డ కూడా కలిసికొట్టేవారని చెప్పుకొంటున్నారు. కానీ ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే......" శ్యామల ఆగిపోయింది.
"చెప్పు, ఫర్వాలేదు"
"ఆ కూరలమ్మేవాడికీ, సరోజినీకి సంబంధముందని, ఆసంబంధం కాస్తా తమకు తెలిసే సరికి అలా ఆత్మహత్య చేసుకొందని అత్తగారంటోంది."
"స్టాపిట్ నాన్సెన్స్" కాళికాదేవిలా గర్జించింది అవంతి.
రమణ, శ్యామల ఆ అరుపుకి ఉలిక్కిపడ్డారు. ఆమె కళ్ళల్లో ఎర్రని జీరల్ని చూసి వాళ్ళు భయపడిపోయారు.
"చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఆఖరికి దారుణంగా చచ్చిపోయినా దానిపైన ఇంత కఠినమైన నిందవేస్తారా రాస్కెల్స్."
"అంటే ఇది ఆత్మహత్య కాదనా నీ అనుమానం"
"అవును. ఖచ్చితంగా ఇది ఆత్మహత్యకాదు. హత్య సరోజినిని కాల్చి చంపేశారు. చుట్టుపక్కలవాళ్ళు సాక్ష్యం చెప్పరు. చూసిందాన్ని గొంతు దాటి బయటకి రానివ్వరు. కారణం పోలీసులతో గొడవలు తెచ్చుకోడానికి భయం. కోర్టుల చుట్టూ సాక్ష్యం చెప్పటానికి తిరగాల్సి వస్తుందని భయం. అందుకే మన దేశంలో నేరాలు ప్రబలిపోతున్నాయి.
సరోజిని అత్తమామలు, మొగుడు ప్రతిదానికి ఆమెని సతాయించేవారన్నది నిర్వివాదాంశం. ఆఖరికి ఆమెని చంపేసే దశలో, ఆమె ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా ముందు జాగ్రత్తగా వాళ్ళే బలవంతంగా ఉత్తరం రాయించి ఎందుకు వుండకూడదు? ఆ ఉత్తరాన్ని తమ ప్రాణాలకి అడ్డం పెట్టుకొని దాన్ని కాల్చి చంపి ఎందుకుండకూడదు? నిజంగా అది ఆత్మహత్య గనక చేసుకొని వుంటే, మంటల్లో కాలిపోతూ సరోజిని చేసిన ఆర్తనాదాలు విని రక్షించడానికెళ్ళిన కూరలమ్మే మనిషిని బయటకి ఎందుకు తోసేస్తారు? వాడెక్కడ నోరెత్తుతాడోనని వాడితోనే సరోజినికి సంబంధాన్ని అంటకట్టేశారు హంతకులు. ఇలాగే జరిగి వుంటుంది. ఇలాగే జరిగి వుంటుంది...... ఇలాగే....." అవంతి గొంతు పూడుకుపోయింది.
కుసుమ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది.
"ఆత్మహత్య చేసుకోవడానికెన్నో మార్గాలున్నాయి. కానీ ఒకమాట చెప్పనా? నిప్పుసెగ తగిలితేనే ఏ మనిషీ భరించలేడు. అలాంటిది కిరోసిన్ వంటిపైన పోసుకొని స్వయంగా చేతుల్తో ఏ మనిషి నిప్పు పెట్టుకోలేడే! ఎంత చావాలనుకున్నా శరీరాన్ని అంత దారుణంగా హింస పెట్టుకోడానికి మనసొప్పదే. ప్రమాదవశాత్తూ స్టవ్ పేలి చనిపోవడం వేరు. చీరకి నిప్పంటుకోడం వేరు. కానీ ఇలాంటి చావుల వెనక మరో హస్తం ఖచ్చితంగా వుంటుందని నా నమ్మకం. చావడానికెన్ని సుఖమైన మార్గాలు లేవు కనుక ఇంత దారుణంగా చావాలి? ఖచ్చితంగా ఇది హత్యే" అంది అవంతి.
"నిజమేనే నేనూ అలానే అనుకొన్నాను. మనవాళ్ళ నమ్మకం కూడా అదే. కానీ అక్క రాసిన ఉత్తరం ప్రకారం అది ఆత్మహత్యగా తీర్మానించారు. కనీసం హాస్పిటల్ కి చేరేవరకు అది బతికినా డెత్ స్టేట్ మెంట్ లో ఏం చెప్పేదో కదా! అనిపిస్తోంది" అంది కుసుమ.
అవంతి కిటికీ దగ్గరగా నడిచింది. ఎంత మెల్లగా కిటికీవరకూ నడిచిందో అంత వేగంగా వెనక్కి తిరిగింది. ఆమె పిడికిళ్ళు బిగుసుకొన్నాయి. రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
"ఈ వెధవలు, చేతకానీ మొగుళ్ళుకోరే గొంతెమ్మ కోరికలన్నీ పెళ్ళాలెందుకు తీర్చాలి. కట్టుకొన్న సన్నాసి బుద్ది తెలిసిన ఆడది వాడ్ని వదిలేయాలి. తెగతెంపులు చేసుకోవాలి. వాడిని వదిలేస్తే బ్రతకలేదనుకోవడం ఆడదాని బుద్ధితక్కువ తనం. చావడానికి తెచ్చుకునే మొండిధైర్యాన్ని, తెగువని ఇటు బతకడానికుపయోగిస్తే ఆ తెగింపు ఆడదాని జీవితానికి పూలబాట వేస్తుందని మనజాతి తెలుసుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో ఎందుకు పడిపోయిందో నాకు అర్థం కావడంలేదు.
బతకాలి.
బతికి సాధించాలి.
నీ అండదండలు లేకపోయినా నేను నిలబడగలనురా పిచ్చి వెధవా! అని ఆ మొగుడ్ని సవాల్ చేసి నిరూపించాలి.
మల్లెపువ్వు లాంటి మనసుతో, మంచుకన్నా పవిత్రమైన ప్రేమతో ఆడది ఆరాధిస్తుంది. భర్త కౌగిలిలో కరిగిపోవాలని తహతహలాడుతుంది. కానీ ఆ ప్రేమనీ ఆరాధనని గ్రహించి గుండెల్లో దాచుకోలేని భర్తలెందుకు? తల్లిని, అక్కచెల్లెళ్ళని అదుపులో పెట్టి భార్యకి రక్షణనివ్వలేని మొగుళ్ళెందుకు?
