"అచ్చు జైనుడిలా వున్నారు"
"అదే నాకు కావలసింది. వస్తాను."
అతను జ్ఞానమందిరానికి వెళ్లాడు. అక్కడ అమ్మాయిలంతా అతని కోసమే చూస్తున్నారు.
"గుర్తుపట్టారా?" అన్నప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు అతనెవరో.
"జైనమతం ఎందుకు పతనమైందో తెలుసా? ఇలాంటి కఠిన నియమాల వలన. గాలి పీల్చేటప్పుడు సూక్ష్మక్రిములు లోపలికి వెళతాయని యిలా ముక్కుకి అడ్డంగా గుడ్డ కట్టుకోమన్నారు.
నడిచే దారంట చీమలులాంటివి లేకుండా శుభ్రం చేయమన్నారు. కానీ వీటిని అందరూ ఆచరించగలరా? అందుకే ఆ మతం పతనమయి పోయింది.
డార్విన్ 'నేచురల్ సెలక్షన్' థీరీనే అన్నిటికి వర్తిస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వున్నవే వుంటాయి. మిగిలినవి అంతరించిపోతాయి"
అమ్మాయిలంతా వింటున్నారు.
"వితంతువుల విషయమే తీసుకోండి. కొన్నిరోజులు సతీసహగమనం అన్నారు. ఆ తరువాత అది ఆచరణకు లొంగకపోయేసరికి శిరోముండనం అన్నారు. అదీ పోయిందీ. పోనీ అలంకరణయినా చేసుకోకుండా వుండమన్నారు. దాన్నీ ఇప్పటి అమ్మాయిలు ఖాతరు చేయడంలేదు. ఎంచక్కా బొట్టూ కాటుక పెట్టుకుంటున్నారు. మీరేమో యిక్కడ దేహాభిమానం వుండకూడదని మీ శరీరాన్ని కృశింప చేసుకుంటున్నారు. మీలో లేనిది ఒక్కటే" అని ఆగాడు.
అమ్మాయిలంతా చెవులను రిక్కించారు. అతనేం చెబుతాడోనని అందరూ టెన్షన్ గా చూస్తున్నారు.
అతను ఒక్కో అక్షరాన్ని వత్తి పలుకుతున్నట్లు చెప్పాడు "జీవనేచ్చ."
అమ్మాయిలు అర్థం కానట్లు అతనివైపే చూస్తుండిపోయారు. అతను చెప్పిన పదాన్ని మనసులో పదే పదే అనుకున్నారు.
"జీవితం జీవించడానికి. ఆ జీవితం మీద మమకారం వుండాలి. ప్రతిక్షణం మనం జీవిస్తున్నామన్న ఫీలింగ్ కలగాలి. అదే జీవనేచ్ఛ. అది లేకపోబట్టే మీరు బలవంతంగా బతుకుతున్నట్లనిపిస్తోంది."
అంత కఠినమయిన నిజాన్ని భరించలేనట్లు వాళ్ళంతా మౌనంగా వుండిపోయారు.
"మనం ఇక ఈ క్షణం నుంచీ జీవించాలి. అదే ఈ జైనమతాచార్యుడు చెప్పేది" అని బయల్దేరాడు.
అప్పటికి తేరుకున్నారు వాళ్ళు. వెళ్ళి రమ్మన్నట్లు పెదవులు చిన్నగా విడదీశారు.
అతను అన్నావారి సత్రంకు వెళ్ళి అతని మిత్రుడితో అన్ని విషయాలు వివరంగా మాట్లాడాడు.
తనెక్కడుందీ, పూసలు కట్టడం ఎంత రహస్యంగా జరగాల్సిందీ చెప్పాడు.
పూసల్ని ఓ కుర్రాడు సైకిల్ మీద తెచ్చిచ్చేటట్లు, కుట్టిన తరువాత తిరిగి ఆ కుర్రాడే తీసుకువెళ్ళేటట్లు ఏర్పాటు జరిగింది.
తరుణ్ అన్నీ మాట్లాడాక అనాథ మహిళా సదన్ కి వచ్చేశాడు. అతను వచ్చిన అరగంటకి సైకిల్ మీద ఓ కుర్రాడు పూసలు తీసుకొచ్చాడు.
"దారిలో ఎవరయినా అడిగారా?" సైకిల్ కుర్రాడ్ని అడిగాడు తరుణ్.
"ఎంట్రెన్స్ లో ఆపారు. మీరు చెప్పినట్లే విమలాబాయి వేడినీళ్ళు కాసుకునే బాయిలర్ కు బొగ్గులు అని చెప్పాను" అన్నాడతను.
"వెరీగుడ్."
సైకిల్ కుర్రాడు పూసల బస్తాను గేటుకవతల పెట్టాడు. ఆ కుర్రాడు వెళ్ళిపోయాక పూసల బస్తాను తరుణ్ తీసుకువెళ్ళి జ్ఞానమందిరంలో పెట్టాడు.
"ఆత్మ ప్రక్షాళన కార్యక్రమం బదులు పూసలు ఎలా దండలుగా చుట్టాలో చెబుతాను. ఆ టైమ్ కి అందరూ రండి" అని చెప్పాడు.
ఠంచనుగా అందరూ ఆరుగంటలకి వచ్చారు. పూసల్ని దారాలకు ఎలా ఎక్కించాలో డెమాన్ స్ట్రేషన్ చేసి చూపించాడు.
"ఇలా మొత్తం ఒక దారానికి పూసలు ఎక్కిస్తే రూపాయి ఇస్తారు. ఎన్ని దండలు కుడితే అన్ని రూపాయలన్న మాట. ఒకరు ఇన్ని దండలే కుట్టాలన్న రూలేం లేదు. మనమందరం కలిసే దారాలు కుడదాం. వ్యక్తిగతంగా కాక వచ్చే డబ్బును సమిష్టిగా అనుభవిద్దాం. ఓకేనా?"
అమ్మాయిలంతా తలలాడించారు.
"డబ్బు సంపాదన మొదలుకావడంతో బహుశా మీ జీవితాల్లో కూడా గణనీయమైన మార్పులొస్తాయనుకుంటాను."
ఆ మార్పులేమిటో అమ్మాయిలు వూహించుకోలేకపోయారు. అతనివైపు ప్లాట్ గా చూస్తుండిపోయారు.
"బహుశా ఏమిటి? ఖచ్చితంగా మీ ఆలోచనావిధానం మారుతుంది. జైనమతాచార్యుడి వేషం విప్పేసినా ఆ మతం యొక్క సిద్ధాంత ప్రభావం నన్నొదిలినట్లు లేదు. అందుకే బహుశా అనే పదం వాడేననుకుంటా.
జైనుల తార్కిక వాదాన్ని 'స్కాద్ వాదం' అంటారు. ఏదీ పూర్తిగా సత్యం కాదు. అలాగని అబద్ధమూ కాదు. అందుకే ప్రతిదానికీ 'బహుశా' అనే పదం కలిపేవారు జైనులు. 'బహుశా కుండవున్నది. బహుశా కుండ లేదు' అనేవారు. అంటే పదార్ధం యొక్క శాశ్వితత్వం ఎంత సత్యమో, మార్పుకూడా అంతే సత్యమన్నారు. వీళ్ళూ కర్మసిద్ధాంతాన్ని వప్పుకున్నారు. కానీ మనం మాత్రం కర్మను వప్పుకోకూడదు.
ఏం జరిగినా ఈ జీవితంలోనే. అందుకే దాన్ని అర్థవంతంగా మార్చుకోగలగాలి. మీకు వైధవ్యం ప్రాప్తించడం కూడా కర్మ కాదు. ఒకవేళ అది కర్మే అయినా దాన్ని మనం తిరిగి సరిచేసుకోవాలి"
అమ్మాయిలు ఏమీ మాట్లాడలేదు.
మెల్లమెల్లగా వాళ్ళతని మాటలకు ఆకర్షితులవుతున్నారు. ఇన్నిరోజులుగా విమలాబాయి చెప్పిందంతా గాలికి ఎగిరిపోతున్నట్లు అతని తుఫాన్ లో ఎగిరిపోతున్నాయి. అయితే యిది వాళ్ళు తమకు తామే గుర్తించేంత స్పష్టంగా లేదు.
"మరిక పూసలు తీసుకుని బయలుదేరుదామా?" అని అందరికీ పూసలు, వాటిని కుట్టడానికి పొడవాటి సూదులూ, దారాలూ యిచ్చాడు.
అందరూ తమ తమ గదులకు బయల్దేరారు. తరుణ్ తన వాటా తీసుకుని మౌనిక గదికి వచ్చాడు.
"ఈసారికి మీ బదులు నేను పూసలు కుడతాను. మీకు బాగయ్యాక మీరే కుట్టాలి" అన్నాడామెతో.
"ఇప్పుడే కుట్టగలను" అంది చిన్నగా.
"ఇప్పుడొద్దులెండి" మీ చెయ్యి బాగయ్యాక కుట్టడం ప్రారంభిద్దురుగానీ"
"నా ఒక్కదాని కోసం ఇంతమంది కష్టపడటం నాకు బాధగా వుంది"
"మాకు ఆనందంగా వుంది. అసలు కష్టపడటమే బాగుంటుంది. ఇతరుల కోసం కష్టపడటం మరింత బాగుంటుంది. శ్రమైక సౌందర్యం ముందు మిగిలినదేదీ నిలబడదు. చెమటోడ్చి సంపాదించిన రూపాయి కన్నా విలువైనదేదీ లేదు ప్రపంచంలో. మీరంతా నేర్చుకోవాల్సిందదే. అందుకే ఈ పూసల కార్యక్రమం" అని ప్రారంభించాడు.
మరుసటి రోజు మధ్యాహ్ననికల్లా అమ్మాయిలంతా పూసలు కుట్టడం పూర్తి చేశారు. ఇక్కడ చేరాక మొదట విమలాబాయి మంత్రోపదేశం చేసి తులసిమాలలను తిప్పడం నేర్పింది. మంత్రం చదువుతూ మాలలోని ఒక్కో పూసని కదపాలి. మొత్తం మాట ఎనిమిది పూసలు. ఎన్నిసార్లు మాలను తిప్పిందీ నోట్ చేయడానికి విమలాబాయి ఒక కార్డులాంటిదిచ్చింది. అప్పుడు అమ్మాయిలు ఒకరికంటే మరొకరు పోటీలుపడి మాలలు తిప్పే వాళ్ళు. ఇప్పుడూ అదే స్పిరిట్ లో పూసలు కుట్టారు.
