జాంబవంతుడు: మిత్రమా ఆంజనేయా, విధి ఎంత క్రూరమైనదో చూచితివా? యువరాజు కావలసిన శ్రీరామచంద్రుడు వనవాసమునకు పోవలసి వచ్చినది. అతని సతీమణి సీతాదేవిని ఎవడో రాక్షసుడు ఎత్తుకొనిపోవు చుండగా ఆమె ఆర్తనాదమును విని పక్షీంద్రుడు జటాయువు ఆమెను రక్షించబోయి ఆ రక్కసునిచే చంపివేయబడినాడు. సీతాదేవిని అన్వేషించుచూ దక్షిణదిశగా వచ్చిన అంగదుని బృందము ఆమె జాడ కానరాక ప్రాయోపవేశమున ప్రాణములను కోల్పోనున్నది.
తన తమ్ముడు జటాయువు మరణించెనని విని సంపాతి దుఃఖించినాడు. "నా రెక్కలు కాలిపోయి నేను ఈ పర్వతముపై పడిపోయిన నాటి నుండియూ మనమెన్నటికైన మరల కలియకపోదుమా అన్న ఆశతో నున్నాను? రావణుడేత్తుకొని పోవుచున్న ఆ అబలను రక్షించదలచి ఆ దుర్మార్గునితో పోరాడి వీరస్వర్గమును పొందితివా తమ్ముడూ? నీవు ధన్యుడవు! పక్షహీనుడనై నేనీ కొండపై ఎన్నేండ్ల నుండియో వ్యర్ధ జీవితమును గడుపుచున్నాను!
జాంబవంతుడు: ఎవ్వడవోయి నీవు? ఆ ఆబాల ఎవరు? ఆమెను అపహరించుకు పోయినవాడు రావణుడని నీకెట్లు తెలియును?
సంపాతి తన వృత్తాంతమును వివరించి పిమ్మట "ఆమె యెవ్వరో నాకు తెలియదు. 'ఓ రామా, ఓ లక్ష్మణా వీడెవడో రాక్షసుడు నన్నెత్తుకొని పోవుచున్నాడు, రక్షించుడు! రక్షించుడు! అని ఆర్తనాదము చేసినది. నేను తలపైకెత్తి చూచి ఆమెను కొనిపోవుచున్న వాడు లంకేశ్వరుడని తెలిసికొన్నాను. నేనీ పర్వతముపైన పడి పెక్కు వత్సరములు గడచినవి. ఈ దీర్ఘకాలములో రావణుడెన్నిసారులో లంకాపురి నుంచి రాకపోకలు జరిపి నాకంట పడి యుండుటచే ఆ దనుజుని సులువుగనె గుర్తుపట్ట గలిగినాను" అన్నాడు.
జాంబవంతుడు: రామలక్ష్మణులను సంబోధించుచూ ఆర్తనాదము చేసిన ఆ యబల సీతా మహాసాధ్వియే. ఆమె జాడ మనకు రావణుని రాజధాని లంకాపురి యందు లభించును.భల్లుకేస్వరుని వచనములు అంగద బృందములోని వానరులకు నైరాశ్యమును తొలగించి నూతనోత్సాహమును కలిగించినవి. వారు ప్రాయోపవేశము నుండి లేచి తమ భావికర్తవ్యమును గూర్చి ఆలోచించసాగినారు. సంపాతి మిత్రులారా కాలిపోయిన రెక్కలతో ఈ పర్వతముపై కూలిపోయిన నా వలన మీకెట్టి ప్రయోజనమునూ లేదని చింతించుచున్నాను" అన్నాడు.
జాంబవంతుడు: పక్షిరాజా అట్లు అనకుము నీవు భావించుచున్నట్లు నీ జీవితము వ్యర్ధము కాలేదు. నీకు సంభవించిన కష్టమును సహించుచు ఈ పర్వతము పైననె ఉండిపోయిన నీవు 'సీతా మహాసాధ్విని అపహరించుకొని పోయినవాడు లంకాపురిని పాలించు రావణాసురుడన్న వార్తను మాకు తెలిపి మహోపకారమును చేసినావు.
సంపాతి: ఆ లంకాపురి ఈ దక్షిణ మహాసముద్రమున నూరు యోజనముల దూరమున నున్నది.
జాంబవంతుడు: అచ్చట జనక రాజనందన జాడ తెలియుటతోనె శ్రీరామచందృడాపురిని ముట్టడించి రావణుని సంహరించి జానకిని రక్షించును.
సంపాతి: నా తమ్ముని జటాయువును చంపిన రావణుడు సంహరింపబడెనన్న వార్త నా చెవిని పడుటతోనె నా పగయునూ తీరును.
సముద్ర లంఘనము
జాంబవంతుడు: వానరాధిపుడు మరియొక వాక్యమును కూడ చేర్చినాడు. మీ బృందమునకా ఘనత ఈ ఆంజనేయుని వలన చేకూరును' అని మారుతి వైపు చూపినాడు.
అంగదుడు తన బృందములోని వారినిట్లు ప్రశ్నించెను:
"నూరు యోజనముల మేర సముద్రమును లంఘించి పోయి లంకాపురి యందు సీతాసాధ్విజాడను వెతికి తెలిసికొని తిరిగి ఆ వంద యామడలను ఎగిరిరాగల సమర్ధుడు మనయందెవడు?"
వారిలో 'గజవీరుడ'ను వానరుడు 'నేను పది యోజనములు ఎగురగలను' అన్నాడు. గవాక్షుడు 'ఇరువది' యనియూ, గనయుడు 'ముప్పది' యనియూ, శరభుడు 'నలుబది' యనియూ, గంధమాదనడు 'యాబది' యనియూ వచించినారు. మైందుడు మరియొక పదినీ ద్వివిదుడు వేరొక దశకమునూ చేర్చి చెప్పినారు. వారియందెవడునూ డెబ్బది యోజనములకు పైన పలుకలేదు. పిమ్మట అంగదుడు "నేను నూరు యోజనములను ఎగిరి పోగలను. కాని వెనువెంటనే నూరు యామడలు తిరిగి లంఘించి వచ్చుటకు శక్తి చాలదు" అన్నాడు. సమావేశము నిశ్శబ్దమైనది. బృంద సభ్యుల ముఖములలో మరల నైరాశ్యము కనపడినది.
