Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 31


    "అలాంటి విశేషం ఏమయినా ఉందా గాయత్రి!" అని ప్రశ్నించింది. సుమిత్ర భర్త ఎదుటే అలా అడగటంతో సిగ్గు పడిపోయింది గాయత్రి!

    పైగా వాల్మీకి ముఖం మరో వంకకు మరలించుకుని ముసిముసిగా నవ్వి మీసం సవరించుకుంటున్నాడు. మగ మహారాజుల ఫోజులు ఇలానే ఉంటాయి. కనిపించే భారం ఆడవాళ్ళదే అయినా కడుపు పండించే అవకాశం మగవారిది! అందుకే ఆ మీసం దువ్వుడు అనుకుంది గాయత్రి!

    "అలాంటిది ఉంటే మీకు ముందుగా చెప్పకుండా మరెవరితో చెప్పుకుంటాను అమ్మగారూ!" అంది గాయత్రి!

    "అయిదారేళ్ళు పిల్లలు లేకుండా ఉంటే దంపతులకి హాయి హాయి అని ఆమని సలహా యిచ్చివెళ్ళింది. అందుకే ఇలా జాగుచేస్తోంది కాబోలు" అన్నాడు వాల్మీకి తన తప్పిదం ఏమీ లేదని ధృవీకరించుతూ.

    ఇంక ఆడవారి మధ్య ఈ విషయాలు వింటూ కూర్చొనటం ఇష్టం లేక బయటకు వెళ్ళిపోయాడు.

    అతడు వెళ్ళిపోవటం అవకాశంగా తీసుకుని తల్లి అడిగింది.

    "ఆమని పిచ్చిపిల్ల! దాని సలహాలు పాటిస్తున్నావా! ముందు ఒక మనవడు నాకు కావాలి. ఆ తరువాత మీరు ఏం చేసుకున్నా నేను అడగను.

    నెల తప్పకుండా జాగ్రత్తలు ఏవయినా తీసుకుంటున్నావుటే గాయత్రీ!" అని ఎంతో ఆసక్తిగా ప్రశ్నించింది తల్లి.

    "అలాంటివి ఏమీ లేవండి అమ్మగారూ! మీతో చెప్పకుండా ఎందుకు చేస్తాను?"

    "పెళ్ళి జరిగి మూడు నెలలు దాటిపోయింది కదా? నాకు అనుమానం వచ్చిందిలే!"

    "నాకు అలాంటి అనుమానాలు ఏవీలేవు. ఉంటే ముందుగా మీతో చెప్తానండి." అన్నది గాయత్రి. పెద్ద వాళ్ళ ఆలోచనల్ని అనుసరించుకుని పోయే బుద్ధిమంతురాలు. పెళ్ళిళ్ళు మనమే చేస్తాం.

    కాని దేవుడు దయతలిస్తే కాని కడుపు పండదు అనుకుంది సుమిత్ర.

    అంతటితో ఆ సంభాషణ ముగించిందామె.



                           *    *    *


    అది నగరానికి నడిబొడ్డు! అయిదు అంతస్తుల భవనం.

    విమెన్స్ కాలేజి హాస్టల్ లో నూట ఇరవై అయిదో నంబరు గది! పైన సీలింగ్ ఫాన్ తిరుగుతుంది.

    తెల్లగా పరచిన ప్రక్క! దానిమీద తెగిపోయిన మల్లెచెండులాగ పడుకుని ఉంది ఆమని! ఆమె మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.

    అక్కకు జాబులు వ్రాసే అలవాటులేదు.

    అమ్మగారు క్రమశిక్షణ ప్రకారం పదిహేనురోజులకు ఒక్క ఉత్తరం మాత్రమే వ్రాయిస్తారు. అదికూడ అర్ధంకాని ఆ కరణంగారి దస్తూరితో అంటి ముట్టని విధంగా యింటి సంగతులు వ్రాసి బాగా చదువుకోమని సలహాలతో ముగిస్తాడు. నగరంలో బాంకు ఖాతాలు ఆస్తుల ఆజమాయిషీ ఇప్పుడు సుమిత్రగారికి సులభం అయిపొయింది.

    అవి చూచుకునేందుకు ఆమని ఉంది కదా!

    ఆజమాయిషీ ఆమె చేతిలోకి వచ్చాక ఆదాయం పెరిగింది.

    మమ్మీ లెక్కలు మాత్రం అడగదు.

    నెలవారీగా వచ్చే ఆదాయం తన పేరుమీద బ్యాంక్ లో జమ చేయిస్తే అది పెద్ద మొత్తం అవుతుంది. ఖర్చుపెట్టుకునేందుకు చేతినిండా డబ్బు ఉంది కాని ఆమెకు సంతోషంగా లేదు! అక్క ఎలా ఉంది?

    ఈ ఆలోచన మర్చిపోవటానికి తీవ్రంగా పుస్తకాలలో తల దూర్చిందామె. మెడికల్ ఎంట్రన్స్ ఫలితాలు కూడ వచ్చాయి.

    కలసి డాక్టరీ చదువుకుందామని ప్లాన్ చేసుకున్న ఫ్రండ్స్ అందరూ సీట్లు సంపాదించి అక్కడక్కడ కాలేజీల్లో చేరిపోయినారు.

    వారు ఎంతో సానుభూతిగా ఉత్తరాలు వ్రాస్తున్నారు.

    నువ్వు కూడ మాలాగే ఎక్కడో డాక్టరీ చదువుతూ ఉండాల్సింది. కాని అక్క పెళ్ళి అనే చిన్న కారణంతో ఫీజు కట్టకుండా ఫోజు కొట్టావు. ఇప్పుడు డిగ్రీలో అఘోరించాల్సి వచ్చింది కదా!" అని.

    కాని ఈ మాటల్ని విమర్శల్ని సానుభూతిని ఆమని స్వీకరించలేదు. స్టుపిడ్స్ మీరు డాక్టర్లు అయితే నేను కలెక్టర్ని అవుతానే, చూస్తారుగా ఐఎఎస్ లో రికార్డు స్థాయి ర్యాంక్ సంపాదిస్తా!

    అప్పుడు నన్ను చూచి కుళ్ళిపోదురుగాని. తెల్లచొక్కా తొడుక్కోగానే అంత నిక్కు వచ్చిందేం? మీ అందరికి బుద్ధి చెప్తా.

    తలలు వంచుకుని సారీ చెప్పేలా చేయకపోతే నా పేరు ఆమని కాదు అని ఛాలెంజిలు విసురుతూ ఆ విమర్శల్నీ సానుభూతి వచనాల్ని త్రిప్పి త్రిప్పి కొడుతోంది ఆమె.

    ఏడిశావ్ లేవోయ్! నువ్వు ఐఏఎస్ చేసేనాటికి మేం డాక్టర్లం అయిపోయి ఏ మెక్సికోలోనో ఫ్లారిడాలోనో స్థిరపడి ఉంటాం. అప్పుడు నువ్వు తాజ్ మహల్ దగ్గరో చార్మినార్ దగ్గరో పకోడీలు తిందువుగాని అని వాళ్ళు తిరుగు ఛాలెంజ్ విసురుతున్నారు ఉత్తరాల్లో.

    మిత్రులతో పోటీపడి జీవితపు అవిశ్రాంత పరుగు పందెంలో పంచకళ్యాణిలా ఉరకలు పెడుతోందామె. ఈ రేస్ ఎప్పుడో ఏకాంతంలో జ్ఞాపకాల తాకిడి మనసు గోడల్ని కొట్టినప్పుడు కొద్దిక్షణాలు హఠాత్తుగా ఆగిపోతోంది.

    అక్క ఏం చేస్తోంది? అక్కా బావ సుఖంగా ఉన్నారా?

    వారి దాంపత్య జీవితం సఫలీకృతం అవుతోందా?? లాంటి ప్రశ్నలు కొద్దిసేపు మనసుని ఊపేస్తాయి. దిగులు మూటకట్టినట్టుగా మంచంమీద పడిపోతుంది.

    జ్ఞాపకాల బరువుకి కరిగి జారిన ఒక కన్నీటిబొట్టు దిండులోకి ఇంకిపోయింది. మళ్ళీ వేయి విద్యుత్తులు వెలిగినట్లు జ్ఞాపకాల బరువు విదుల్చుకుని కాంతివేగంతో ముందుకు ప్రవహించుకుంటూ పోయింది ఆమని?

    ప్రస్తుతం ఆ జ్ఞాపకాలతో కరిగిన కొద్దిక్షణాలను ఏరుకుంటూ ప్రక్కమీద పడి ఉందామె! లవ్ లీ ఆమని!

    అందమయిన అక్షరాలు మధురమయిన ఆ క్షణంలో వారి మనసుల్లోకి తన జ్ఞాపకాలను వెలిగించుతున్నాయా? లేదా?

    తనని చూచి అసూయపడిన అక్క ఎంత పిచ్చిది? ఆ పిచ్చితనమే కాబోలు నిజమయిన ఆడతనం అంటే! యూ పూర్ గాయత్రి!

    నీ విశాలమయిన ప్రేమ నిండారిన మనసు చుట్టూ ఎంత ఇరుకయిన గోడలు కట్టేసుకున్నారే! స్వార్ధంతో నాకన్నా ఎంత చిన్నదానివై పోయావే!?

    అనుకుంటూ రుమాలుతో కళ్ళు అద్దుకుంది ఆమని!

    వరండాలో శాండల్స్ టకటకలు విన్పించాయి.

    అమ్మో వచ్చేస్తోంది బెటాలియన్ అనుకుంటూ దిండులో తల దూర్చుకుంది. సుడిగాలి విసురుల్లాంటి ఫ్రెండ్స్ అయిదారుగురు రూంలోకి వచ్చేశారు!

    దీనికేదో అయిందే! అలా ముడుచుకుని పడుకుందేమిటి?" అంది తరళ! ఆమె కళ్ళు మెర్కురీ దీపాల్లా తరళాయితం అవుతున్నాయి.

    "నిద్ర పోతోందనుకుంటా?"

    "రాత్రి అంతా ఏం చేసిందబ్బా?"

    "పుస్తకాలన్ని తినేసి ఉంటుంది!"

    "కాయితాలు తింటే దాన్ని గాడిద అంటారు"

    "అంతా డ్రామాలే! మేలుకునే ఉంది" అంది విరజ!

    నిమ్మీ రమ్మీ విమ్మీలు ముగ్గురు ఆమెను పట్టుకుని లేపారు. వ్రేలాడి పోతున్న ముఖాన్ని గడ్డం క్రింద చేయిపెట్టి నిలబెట్టారు.

    నిర్మల, రమాదేవి, విమల అనే పేర్లు ట్రిమ్ అయిపోయి అలా మారాయి!

    కంటిరెప్పలు బలవంతంగా విప్పారు.

    ఇంక తన నాటకం సాగదని వాళ్ళు విడిచిపెట్టరని గలగల నవ్వేసింది ఆమని!

    "రాస్కెల్! మమ్మల్ని ఢమ్మా కొట్టించేద్దామని నిద్రనాటకం మొదలెట్టావా?"

    "ఎందుకు ప్రొద్దుటే వాటర్ లూ వార్ మొదలెట్టారు?"

    "ఇవాళ శలవు! మర్చిపోయావా?"

    "అయితే ఏం చేద్దామంటారు?"

    "సాయంత్రందాకా వీధులన్నీ కొలుద్దాం"

    "మీ అన్నయ్య సర్వే డిపార్టుమెంట్ లో కదా ఉద్యోగం! ఆ అలవాటు నీకొచ్చిందా?"

    "మా అన్నయ్య పేరెత్తావంటే నీ వీపు రమోలా వాయించేస్తాను"

    "బీటిల్స్ లో చేరిపోవే! ఎంతసేపయినా వాయించుకోవచ్చు."

    అమనిని అందరూ తలోచెయ్యివేసి మంచం మీదినించి దింపేశారు.

    క్రీంకలర్ ఫాంటూ లైట్ ఎల్లో షర్టు వేసుకుని ఉందామె!

    సౌకర్యార్ధం పొట్టిగా ఆరంగుళాలలోపు ఉండేలా చేయించుకున్న క్రాఫ్ దువ్వుకోవటం అరనిముషం లోపుగానే పూర్తి అయింది.

    ఒత్తుగా నిగనిగలాడుతూ జుట్టు పెంచుకుని ఉదయం అరగంటా సాయంత్రం అరగంటా దువ్వుకోవటం పూలెట్టుకోవటం పిన్నులు తగిలించి కంట్రోల్ చేయటంలాంటి దంతా గిట్టదు ఆమనికి.

    కాంపిటేటివ్ స్పిరిట్ కలిగిన చదువుల్లో ఉన్న విద్యార్ధినులకు తెలుసు. జుట్టు అలంకారానికిరోజు గంటకాలం వేస్ట్ చేయటం అంటే ఏమిటో!?

    ఒక గంట సమయాన్ని రోజూ పెంచుకోగలిగితే కాంపిటేటివ్ చదువుల విద్యార్ధినులకు మొత్తం కెరీర్ మారిపోగల అవకాశాలున్నాయి.

    క్రాఫ్ సవరించుకుని వాలెట్ మోకాలి దగ్గర ఉన్న పాకెట్ లో పెట్టుకుని వారితో బయలుదేరింది ఆమని.

    చిరుగాలి కెరటాల్లా ఆహ్లాదంగా సెలవుదినం గడిపేందుకు వారు రోడ్డుమీదికి వచ్చారు. సెలవుదినం కావటంవల్ల వాహనాల రద్దీ తక్కువగా ఉంది. ముఖ్యంగా కార్యాలయాలు కాలేజీలు బంద్ అయి వున్నాయి. అందువల్ల కాస్తంత నిర్మానుష్యం అనిపించేలాగ కూడ ఉంది.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS