ఈ నాలుగేళ్లు నీ బంధనలో మగ్గిపోయిన దానికన్నా జైల్లో గడిపితే ఏదో ఓ రోజు విడుదల అవుతాననే నమ్మకం వుండేది.
ఈ చీకటిలో మగ్గిపోయేదాని కంటే ఆ జైలు జీవితమే నయం అనిపించే స్థితికి నన్ను తీసుకొచ్చావు ప్రశాంత్. "
ప్రశాంత్ నొచ్చుకున్నా డతని మాటలకి.
"నన్నెంత అపార్దం చేసుకొన్నావురా సూరిబాబు! నువ్వు ఇక్కడ వున్నందుకే కదరా నీ వాళ్ల బాధ్యతని నేను స్వీకరించింది.
నీ తల్లి వృద్దురాలు. బి.పి. పేషెంట్.
ఆమె ఏమైపోవాలి?
వయసొచ్చిన ఆడపిల్ల నీ చెల్లెలు.
ఆ బంగారు చెల్లి భవిష్యత్తు నాశనం కావల్సిందేనా!
నీమీద నాకున్న అభిమానం చేతనే నీ తల్లికి మంచి డాక్టర్ని పెట్టి వైద్యం చేయిస్తున్నారు. నీ చెల్లికో మొగుడ్ని కొనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను.
వాళ్లకు తినడానికి సాయం చేస్తున్నాను.
అదే నువ్వు నా మాటని ఖాతరు చేయకుండా బయట ప్రపంచం పైన మోజుతో తపించిపోయి బయటికి వెళ్లిపోయావనుకో....
ఏం జరుగుతుందో తెలుసా?
పిచ్చికుక్క మెళ్లో తాడువేసి పట్టుకుని ఈడ్చుకెళ్లినట్టు పోలీసులు నీ చేతులకి బేడీలు వేసి తీసుకెళ్లి ముందు చావగొడతారు.
న్యాయస్థానం శిక్ష వేస్తుంది.
మందులు, తిండిలేక నీ తల్లి చచ్చిపోతుంది. దిక్కులేని నీ చెల్లెల్ని నాలాంటి తుమ్మెదలు విడిచిపెట్టవు.
ఆఖరికి బతుకుతెరువుకోసం నీ బంగారు చెల్లి వ్యభిచారిణిగా మారి పోతుంది.
అందుకేరా!
ఇన్ని ఆలోచించి పధకాన్ని వేసింది."
"స్టాపిట్!" అరిచాడు సూరిబాబు.
ప్రశాంత్ అతనికేసి చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నాడు.
"దుర్మార్గుడా!నీ స్వార్దం కోసం నన్ను బలిపశువుని చేశావని నేనెప్పుడో అర్దం చేసుకున్నాను.
డబ్బుకోసం.
గ్లామర్ కోసం,
పేరు ప్రఖ్యాతుల కోసం.
అమ్మాయిల కోసం నువ్వుపడి చచ్చిపోతావు.
వాటికోసమే నా మీద వలపన్నావు.
తిండికి మొహం వాచిపోయి వున్న నామీద నోట్లు ఎరవేసి నా నోరు నొక్కేశావు.
నోరు విప్పి ఈ విషయాలన్నీ ఈ లోకానికి ఎక్కడ చెబుతానో అన్న భయంతో నన్నీ నరకంలో పడేశావు.
ఒరే ప్రశాంత్!
చిన్నతనంనించీ నీ బుద్దు లెరిగినవాడిని.
చెప్పనా!
ఈ తార కథ వెనుక సూత్రధారివి నువ్వే.
ఈ నాటకం నువ్వు ఆడించింది.
దాన్ని.... ఆ బిచ్ ని నామీద ప్రయోగించింది నువ్వు. ఆ ముండని మానభంగం చేశానని కేసు పెట్టించింది కూడా నువ్వే!
నన్ను భయపెట్టి నన్ను నీ చేతుల్లోకి మలచుకోడానికి నువ్వు ఆడించిన అతి భయంకరమైన నాటకంరా ఇది!"
ప్రశాంత్ చప్పట్లు కొట్టాడు.
"వండర్ ఫుల్. నిజంగా నువ్వు జీనియస్ విరా సూరిబాబూ!ఎందుకో తెలుసా? ఈ నగ్న సత్యాన్ని తెలుసుకోడానికి నీకు నాలుగు సంవత్సరాలు పట్టింది నిజమే!
నీ ఆరోపణలన్నీ నిజమే!
కానీ ఏం చేయగలవు?
పీక లోతు ఊబిలో కూరుకుపోయావు.
నిన్ను బయటికి లాగాలన్నా, పూర్తిగా ఊబిలోకి నెట్టివేయాలన్నా అది నా చేతుల్లో క్షణాల్లో జరిగే కార్యక్రమం"
సూరిబాబు కళ్లు ఎర్రగా మారిపోయినయి.
"నీ చేతనైంది చేసుకో. ఇక నీ బెదిరింపులకి లొంగను.
నేను ఈ క్షణంనుంచి కలం పట్టను. నీ పేరుమీద నేను రచనలు చేయను." చాలా ధృడంగా అన్నాడు సూరిబాబు.
"నీ కన్న తల్లి, తోడబుట్టిన చెల్లెలు గుర్తులేరా? నీకు వాళ్లు ఏమై పోయినా ఫర్వాలేదా నీకు?"
సూరిబాబు మాట్లాడలేదు.
"పిచ్చివేషాలు, వెర్రి్ ఆలోచనలు మానేయ్ మిత్రమా! నాకు రాయటం చేతకాక పోవచ్చు. కానీ నీకు కధలు ఫీడ్ చేస్తున్నాను. మెటీరియల్ ఇస్తున్నాను. రాసిందానికి ప్రతిఫలం ముట్టచెబుతున్నాను.
ప్రఖ్యాత రచయితగా రెండు చేతులా సంపాదిస్తున్న నేను, ఈ వ్యాసంగానికిగానీ, గ్లామర్ కి గానీ దెబ్బ తగిలితే నేను తట్టుకోలేను. పిచ్చి వాడినై పోతాను. కాదు రాక్షసుడ్ని అయిపోతాను. అందుకే ఇద్దరి శ్రేయస్సు కోసం చెప్తున్నాను. అన్నీ మరచిపో.
ఈ కాసెట్స్ వి.సి. ఆర్ లో వేసి చూడు. నాకు చెప్పు. ఏదైనా పనికొస్తే కొత్త సబ్జెక్ట్ చేద్దాం."
"నీ దుర్మార్గం నాకు తెలుసురా రాస్కెల్. నీ మాట వినకపోతే కొరడాతో కొడతావు. అమ్మకి మందులు ఇప్పించవు.
నా చెల్లెలు జీవితంతో ఆడుకొంటావు.
